మీరు ఫైన్‌ వేస్తే..మేము లైన్‌ కట్‌ చేస్తాం | Sakshi
Sakshi News home page

మీరు ఫైన్‌ వేస్తే..మేము లైన్‌ కట్‌ చేస్తాం

Published Sat, Nov 2 2019 4:59 AM

Fight Between Traffic Police And Transco Employees At Peddapalli - Sakshi

పెద్దపల్లి: ఎవరి అధికారం వారిది. ఎవరి డ్యూటీ వారిదేనంటూ ట్రాఫిక్‌ పోలీసులు, ట్రాన్స్‌కో ఉద్యోగులు నిరూపించుకున్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రలో ట్రాఫిక్‌ పోలీసు, ట్రాన్స్‌కో ఉద్యోగుల మధ్య శుక్రవారం విధి నిర్వహణ వ్యవహారం ఆసక్తికరంగా మారింది. ఓ ట్రాన్స్‌కో ఉద్యోగికి ట్రాఫిక్‌ పోలీసులు నిబంధనల పేరిట రూ.2 వేల జరిమానా విధించారు. తాను ఉద్యోగిని అంటూ చెప్పినప్పటికీ పోలీసులు జరిమానా విధించారు. దీంతో ఆగ్రహించిన ట్రాన్స్‌కో ఉద్యోగి.. మీ డ్యూటీ మీరు చేస్తున్నారు. మరీ ట్రాఫిక్‌ పోలీసు స్టేషన్‌ బకాయి సంగతేందంటూ నిలదీశాడు. వెంటనే ట్రాన్స్‌కో సిబ్బంది పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి బకాయి చెల్లించండి సార్‌ అంటూ ప్రశ్నించారు. తమ డ్యూటీ తాము చేస్తున్నామని, కరెంట్‌ స్తంభం ఎక్కి లైన్‌కట్‌ చేసి వెళ్లారు. పైఅధికారులు ట్రాన్స్‌కో సిబ్బందిని మందలించడంతో తిరిగి సాయంత్రం వరకు ట్రాఫిక్‌ ఠాణాలో లైట్లు వెలిగాయి. ఈ విషయమై ట్రాఫిక్‌ సీఐ బాబురావు వివరణ ఇస్తూ.. కరెంటు పాత వైరు మార్చివేసి కొత్త వైరు ఏర్పాటు చేశారని, ఇందులో అపోహాలకు తావులేదన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement