అమాయకత్వం ఆసరాగా నిలువెత్తు మోసం

Few Persons Doing Fraud In Medak - Sakshi

ఏజెంట్‌ సహకారంతో రూ.కోటికిపైగా టోకరా

సంగారెడ్డి జిల్లా కేంద్రంగా బాగోతం

సాక్షి, మెదక్‌ : నిరుపేదల అమాయకత్వాన్ని ఆసరా చుసుకుని కుచ్చుటోపీ పెట్టారు. అప్పనంగా రూ.కోట్ల్లలో కాజేసీ మాయమయ్యారు. సంగారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన ఓ మహిళ నర్సాపూర్‌ మండల పరిధిలోని రెడ్డిపల్లికి గ్రామానికి చెందిన ఓ అమ్మాయికి ఉపాధి కల్పిస్తున్నామంటూ ఏజెంట్‌గా పెట్టుకున్నారు. సంగారెడ్డిలో తమ కార్యాలయం ఉంది.. తమ వద్ద రూ.లక్ష పెట్టుబడి పెడితే నెలకు రూ.10 వేలు ఇస్తామని.. నిర్ణీత గడువు తర్వాత మొత్తం అమౌంట్‌ చెల్లిస్తామని నమ్మబలికారు.

ఇందుకు జీతంతోపాటు కమీషన్‌ ఇస్తామని చెప్పారు. ఆ తర్వాత సంగారెడ్డికి చెందిన మహిళతోపాటు, ఏజెంట్‌ పలు చోట్ల తిరిగి పెట్టుబడులు పెట్టించడం ప్రారంభించారు. ఈ ఏడాది జనవరిలో ఈ తతంగం ప్రారంభం కాగా..  తొలుత నర్సాపూర్‌ మండలంలోని రెడ్డిపల్లి, మంతూర్, ఖాజిపేట గ్రామాలను మాత్రమే టార్గెట్‌ చేసుకున్నారు. ఈ మూడు గ్రామాలకు చెందిన పలువురు మొదట్లో రూ.10 వేల నుంచి రూ. 50 వేల వరకు పెట్టుబడులు పెట్టారు. రూ.10 వేలు పెట్టిన వారికి నెలకు రూ.1000.. రూ.50 వేలు పెట్టిన వారికి నెలకు రూ. 5 వేల చొప్పున క్రమం తప్పకుండా ప్రతీ నెల ఇస్తూ వచ్చారు. 

ఒకే కుటుంబంలో ఒకరికి తెలియకుండా ఒకరు..
మార్చి నుంచి సెప్టెంబర్‌ చివరి వరకు పెట్టుబడి పెట్టిన ప్రతిఒక్కరికీ క్రమం తప్పకుండా చెల్లింపులు సజావుగా సాగాయి. సెప్టెంబర్‌ మొదటి వారం నుంచి అక్టోబర్‌ మొదటి వారం వరకు చాలా మంది పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టారు. రెడ్టిపల్లి, మంతూర్, ఖాజిపేట గ్రామాలకు చెందిన పలువురు సుమారు రూ.కోటికిపైగా పెట్టుబడులు పెట్టినట్లు తెలిసింది. ఈ గ్రామాల్లో ఒకే కుటుంబంలోని సభ్యులు ఒకరికి తెలియకుండా ఒకరు రూ.లక్షల్లో పెట్టుబడులు పెట్టారు. ఇంటి యాజమాని, అతని భార్య, కుమారులు, యజమాని తల్లి ఇలా.. ఒక్కొక్కరు రూ.10 వేల నుంచి రూ.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టినట్లు సమాచారం. 

ఈ నెల రాకపోవడంతో వెలుగులోకి..
పెట్టుబడులు వెల్లువెత్తిన తర్వాత అక్టోబర్‌ నెల వచ్చింది. మొదటి వారంలో తమకు చెల్లించే డబ్బులు వస్తాయని పెట్టుబడులు పెట్టిన వారు ఎదురుచూస్తున్నారు. వారం దాటినా రాకపోవడంతో వారు రెడ్డిపల్లిలోని ఏజెంట్‌ ఇంటి బాటపట్టారు. ఇంకా రాలేదని ఆమె సమాధానం ఇవ్వడంతో వారికి అనుమానం వచ్చింది. అడ్రస్‌ లేకపోవడంతో లబోదిబోమని మొత్తుకుంటున్నారు. ఏజెంట్‌ ఇంటికి నిత్యం కాళ్లరిగేలా తిరుగుతున్నారు. విషయం బయటకు పొక్కడంతో రూ.లక్షల్లో పెట్టుబడి పెట్టిన వారు ఎవరికి చెప్పుకోలేక.. కుమిలిపోతున్నారు.

పసిగట్టి.. ప్లాన్‌ వేసి..
కాళేశ్వరం ప్రాజెక్టు కాల్వ నిర్మాణం కోసం రెడ్డిపల్లి, మంతూర్, ఖాజిపేట గ్రామాలకు చెందిన పలువురు రైతుల భూములను ప్రభుత్వం సేకరించింది. ఈ మేరకు నష్టపరిహారం కింద గత ఏడాది ఈ మూడు గ్రామాలకు చెందిన భూ యజమానుల ఖాతాల్లో డబ్బులు జమచేసింది. దీన్ని పసిగట్టిన సంగారెడ్డికి చెందిన దంపతులు పక్కా ప్లాన్‌తో మోసానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. పెట్టుబడి పెట్టి వారికి రాసిచ్చిన ప్రామిసరీ నోటులో ఎం.లావణ్యరెడ్డి, భర్త మహేందర్‌రెడ్డి అని ఉంది. వీరి నుంచి సమాధానం లేదని..  సంగారెడ్డిలో ఉన్న అడ్రస్‌లో వారు లేరని బాధితులు చెబుతున్నారు.

వృద్ధాప్యంలో పనికొస్తాయనుకున్నా..
వృద్ధాప్యంలో పనికొస్తాయని నమ్మి నా వద్ద ఉన్న రూ.లక్ష  జనవరిలో పెట్టుబడి కింద పెట్టాను. మా గ్రామంలో ఉన్న ఏజెంట్‌కు ముందే చెప్పినా. నాకు నెలకు రూ.2,500 ఇస్తే చాలు.. రూ.10 వేలు వద్దన్నా. అలానే మార్చి నుంచి నెలకు రూ.2,500 తీసుకున్నా. అక్టోబర్‌ 2న రావాల్సి డబ్బుల కోసం ఏజెంట్‌ వద్దకు వెళ్లా. పై నుంచి పైసలు రాలేదని చెప్పడంతో గుండె ఆగినంత పనైంది.  మోసపోయిన నాకు డబ్బులు ఇప్పించాలని వేడుకుంటున్నా.
– మన్నె నారాయణ, రెడ్టిపల్లి, నర్సాపూర్‌

విచారణ చేపడతాం..
నర్సాపూర్‌ మండలం రెడ్డిపల్లి, మంతూర్, ఖాజిపేట గ్రామాల్లో మనీ స్కీం నడుస్తున్నట్లు మా దృష్టికి ఇప్పటివరకు రాలేదు. ఈ మూడు గ్రామాల్లో విచారణ చేపట్టి బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటాం. అనుమతులు లేకుండా మనీ స్కీంలు కొనసాగించిన వారిపై కేసులు నమోదు చేస్తాం. ప్రజలు అత్యాశకు పోయి గుర్తింపు లేని సంస్థలో పెట్టుబడులు, చిట్టీలు వేయొద్దు.
– నాగయ్య, నర్సాపూర్‌ సీఐ 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top