కోడలిపై కన్నేసిన మామ; కొడుకు చేతిలో..

A Father Died Accidentally by Son in Bhuvanagiri - Sakshi

ఇదేం పని అని నిలదీసిన కుమారుడిపైనే కయ్యానికి కాలుదువ్విన తండ్రి

పెనుగులాటలో తోసేయడంతో తలకు గాయమై మృత్యువాత

వీడిన వృద్ధుడి హత్య కేసు మిస్టరీ, నిందితుడి అరెస్ట్‌ 

వివరాలు వెల్లడించిన డీసీపీ నారాయణరెడ్డి

పెద్దరికాన్ని నిలబెట్టుకుంటూ సన్మార్గంలో పయనించాలనే మంచిమాటలు చెప్పాల్సిన వయసులో ఆ వృద్ధుడి బుద్ధి పెడదోవపట్టింది.. వివాహేతర సంబంధాలు పెట్టుకుని కుటుంబంలో చిచ్చురేపాడు.. చివరకు వావి వరసలు కూడా మరిచి పశువులా ప్రవర్తించాడు.. పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టినా అతడి తీరులో మార్పు రాలేదు సరికదా ఆగడాలు ఇంకా శృతిమించిపోయాయి. ఈ వయసులో ఇదేం పని నాన్నా అంటూ నిలదీసిన కుమారుడిపైనే కయ్యానికి కాలుదువ్వాడు.. ఆ పెనుగులాటలో కుమారుడు తోసేయగా బండమీద పడడంతో తల పగిలి తండ్రి ప్రాణాలు విడిచాడు.. ఇవీ.. భువనగిరి మండలం బండసోమారంలో వృద్ధుడి హత్యోదంతానికి దారితీసిన కారణాలు. ఉద్దేశపూర్వకంగా చేసినా.. అనుకోకుండా జరిగిన నేరం నేరమే అన్నట్టు చివరకు ఆ వృద్ధుడి కుమారుడు కటకటాలపాలయ్యాడు. 

భువనగిరి అర్బన్‌ : వృద్ధుడి హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. కుమారుడే అతడి మృతికి కారణమని విచారణలో తేలడంతో నిందితుడిని అరెస్ట్‌ చేశారు. శనివారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ నారాయణరెడ్డి కేసు వివరాలు వెల్లడించారు.మండలంలోని బండసోమారం గ్రామానికి చెందిన యామల్ల లక్ష్మారెడ్డి(65), రాధమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు, కుమార్తె. కొన్ని సంవత్సరాల క్రితం చిన్న కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతిచెం దాడు. కుమార్తె వివాహం చేశాడు. తండ్రి, కుమారులిద్దరూ వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కొన్ని నెలల క్రితం మాధవరెడ్డికి  వలిగొండ మండలం కంచనపల్లి గ్రామానికి చెందిన అమ్మాయితో వివాహం జరిగింది. కొన్ని రోజులకే వారి మధ్య మనస్పర్థలు రావడంతో ఆమె విడాకులు తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. మళ్లీ మాధవరెడ్డికి సిరివేణికుంటకు చెందిన ఓ యువతి వివాహం జరిగింది. అందరూ ఒకే ఇంట్లో కలిసే ఉంటున్నారు. 

వావివరసలు మరిచి.. కోడలిపైనే కన్నేసి..
లక్ష్మారెడ్డి కొన్నేళ్లుగా చెడు తిరుగుళ్లు తిరుగుతూ గ్రామంలో కొందరు మహిళలలో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం ఇంట్లో తెలియడంతో కుటుంబ సభ్యులు అతడిని మందలించారు. అయినా అతని బుద్ధి మారకపోగా ఇంట్లో ఉన్న కోడలిపైనే కన్నేశాడు. ఈ విషయం కుమారుడు మాధవరెడ్డికి తెలియడంతో తండ్రి కొడుకులకు మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో తండ్రి వేధింపులు భరించలేక మాధవరెడ్డి గ్రామంలోనే వేరు కాపురం పెట్టాడు. ఆయన తీరుపై గ్రామంలో పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టాడు. దీంతో ఇక నుంచి కోడలిని వేధించనని పెద్ద మనుషుల సమక్షంలో లక్ష్మారెడ్డి ఒప్పుకున్నాడు. 

వడ్లు ఆరబోసేందుకు వెళ్లి..
లక్ష్మారెడ్డి గత శుక్రవారం ఉదయం వడ్లు ఆరబోసి వస్తానని వ్యవసాయ బావి వద్దకు వెళ్లాడు. మధ్యాహ్నం ఇంటికి వచ్చి తిరిగి బావి వద్దకు వెళ్లాడు. అదే సమయంలో మాధవరెడ్డి కూడా బావి వద్దకు వెళ్లాడు. ఆ సమయంలో వడ్లు ఆరబోసిన రామస్వామిగుట్టపై లక్ష్మారెడ్డి అదే గ్రామానికి చెందిన ఓ మహిళతో సఖ్యతగా ఉండడాన్ని చూశాడు. మాధవరెడ్డిని చూసిన ఆ మహిళ వెంటనే అక్కడినుంచి వెళ్లిపోయింది. ఆ సన్నివేశాన్ని చూసి జీర్ణించుకోలేకపోయిన మాధవరెడ్డి ఈ వయసులో ఇదేం పని ఇక నీవు మారవా అంటూ నిలదీశాడు. దీంతో లక్ష్మారెడ్డి కుమారుడితో గొడవకు దిగాడు.

ఇద్దరు ఘర్షణ పడగా మాధవరెడ్డి తండ్రిని నెట్టివేశాడు. దీంతో లక్ష్మారెడ్డి వెల్లకిలా బండపై పడడంతో తలకు తీవ్ర గాయమై అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. దీంతో తండ్రి మరణించాడని మాధవరెడ్డి అక్కడినుంచి ఇంటికి వెళ్లిపోయాడు. తల్లి వద్దకు వెళ్లి నాన్న ఫోన్‌ చేసి  రమ్మన్నాడని నమ్మించాడు. తల్లిని ట్రాక్టర్‌పై ఎక్కించుకుని వ్యవసాయ బావి వద్దకు వెళ్లాడు. నాన్న ఫోన్‌ చేయడం లేదని అటూ ఇటూ తిరిగారు. చివరకు బండపై మూలుగు వినిపిస్తోందని అక్కడికి వెళ్లి చూడగా అప్పటికే లక్ష్మారెడ్డి రక్తపు మడుగులో అపస్మారకస్థితిలో ఉన్నాడు. స్థానికుల సాయంతో భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించగా అప్పటికే లక్ష్మారెడ్డి మృతిచెందాడు. 

కేసును ఛేదించారు ఇలా..
బాట విషయంలో భూ పంచాయితీ ఉన్న వారే తన తండ్రిని హత్య చేసి ఉంటారని మాధవరెడ్డి పోలీసుల ఎదుట అనుమానం వ్యక్తం చేశాడు. అయితే  భర్త గురించి బాగా తెలిసిన రాధమ్మ భూ పంచాయితీ ఉన్న వారిపై, కుమారుడిపై కూడా అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే పోలీసులు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించగా మాధవరెడ్డి తండ్రి మరణానికి తానే కారణమని, ఉద్దేశపూర్వకంగా హత్య చేయలేదని పెనుగులాటలో కింద పడడంతో మృత్యువాత పడ్డాడని నేరాన్ని అంగీకరించాడు. దీంతో అతడిపై కేసు నమోదు చేసి  బైక్, రెండు సెల్‌ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును 24 గంటలలోగా ఛేదించిన సీఐ సురేందర్‌రెడ్డి, ఎస్‌ఐలు రాఘవేందర్‌గౌడ్, మధు, ఏఎస్‌ఐలు పీఎస్‌ఎన్‌ ప్రసాద్, వి.సాగర్‌రావు, కానిస్టేబుల్‌ ఎం. జాన్, యాకుబ్‌ఖాన్, కొండారెడ్డి, వేణును డీసీపీ అభినందించారు. సమావేశంలో ఏసీపీ భుజంగరావు సిబ్బంది పాల్గొన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top