లారీ రాదు.. కాంటా కాదు!

Farmers Waiting in Buying Center For Rice Bags Sale in Warangal - Sakshi

కొనుగోలు కేంద్రాల్లో పేరుకుపోతున్న ధాన్యం

రోజుల తరబడి పడిగాపులు కాస్తున్న అన్నదాతలు

అకాల వర్షాలతో ఆందోళన

తడిసిన ధాన్యాన్ని ఆరబెడుతూ కేంద్రాల వద్దే నిరీక్షణ

ఈమె పేరు నక్క రమ్య. నాగారం పంచాయతీ వార్డు సభ్యురాలు. రెండు ఎకరాల్లో వరి సాగు చేశారు. వంద బస్తాల ధాన్యం పండింది. దీంతో సంతోషించిన ఆమె అధికారులు ఇచ్చిన టోకెన్‌ ప్రకారం 15రోజుల క్రితం కొనుగోలు కేంద్రానికి ధాన్యం తీసుకొచ్చారు. అయితే, ఇప్పటి వరకు కూడా తూకం వేయడం లేదు. లారీ వచ్చి ఇక్కడి ధాన్యాన్ని తీసుకెళ్తే తప్ప కాంటా వేయలేమని సిబ్బంది చెబుతున్నారు. అకాల వర్షాలతో భయంగా ఉందని వాపోతున్నారు.

హసన్‌పర్తి: కాలం కలిసి రావడంతో చేతికొచ్చిన పంటను చూసి ఆనందపడాలా... రోజులు గడిచిపోతూ అకాల వర్షం కురుస్తున్నా కాంటాలు కాకపోవడంతో ఆందోళన చెందాలా... కాంటాలు అయినా ధాన్యాన్ని తరలించకపోవడంతో దిగులు పడాలా... ఇవీ అన్నదాతల సందేహాలు! కొనుగోలు కేంద్రాల్లో ఎప్పటికప్పుడు ధాన్యాన్ని తూకం వేయకపోగా, తూకం వేసిన ధాన్యాన్ని సైతం తరలించేందుకు లారీలు పంపించకపోవడంతో నిద్ర, ఆహారం మానుకుని నిరీక్షించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. కొనుగోలుకేంద్రాల వద్ద కుప్పలుగా ధాన్యం పేరుకుపోతున్నా అధికారుల పట్టింపులేని తనం రైతుల ఆందోళనకు కారణమవుతోంది. ఓ దశలో రైతులు ఐకేపీ, పీఏసీఎస్‌ నిర్వాహకులతో గొడవకు దిగుతున్నారు. అయినా పరిస్థితిలో మార్పు రావడం లేదనే విమర్శలు ఉన్నాయి.

92 కొనుగోలు కేంద్రాలు
వరి ధాన్యం కొనుగోలుకు జిల్లాలో 92 కేంద్రాలు ఏర్పాటుచేశారు. జిల్లాలోని వరంగల్, కాజీపేట, ఖిలా వరంగల్, ఐనవోలు, హసన్‌పర్తి, హన్మకొండ, ధర్మసాగర్, వేలేరు, ఎల్కతుర్తి, కమలాపూర్‌ మండలాల్లో ఈ కేంద్రాలు ఉన్నాయి. ఇందులో 29 కొనుగోలు కేంద్రాలు ఐకేసీ ఆధ్వర్యాన మిగిలిన 63 కేంద్రాలు ఆయా మండలాల్లోని పీఏసీఎస్‌ల ఆధ్వర్యాన నిర్వహిస్తున్నారు. ఈసారి టోకెన్‌ పద్ధతి ప్రారంభించిన అధికారులు టోకెన్లల తేదీల వారీగానే రైతులు తమ ధాన్యాన్ని తీసుకురావాలని సూచించారు. ఇంత వరకు బాగానే ఉన్నా... కేంద్రాలకు తీసుకొచ్చిన వారి ధాన్యాన్ని కాంటా వేయడంతో మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఒకవేళ కాంటా పూర్తయినా మిల్లులకు తరలించడంలో లారీల కొరత కారణంగా జాప్యం జరుగుతుండడంతో రైతులే కాపలా ఉండాల్సి వస్తోంది.

పేరుకుపోయిన ధాన్యం...
ఇప్పటికే కొనుగోలు కేంద్రాల వద్ద వరి «ధాన్యం పేరుకపోయ్యింది. జిల్లా వ్యాప్తంగా 92 కేంద్రాలు నిర్వహిస్తుండగా, ఒక్కో కేంద్రం ప్రస్తుతం 10 నుంచి 90 లారీలకు సరిపడా ధాన్యం నిల్వ ఉన్నట్లు అంచనా. ఇందులో చాలా వరకు తూకం వేయని ధాన్యమే ఉండడం గమనార్హం. హసన్‌పర్తి మండలంలోని వంగపహాడ్‌ ప్రాథమిక వ్యవసాయ ప్రాధమిక సహకార కేంద్రం వద్ద 60లారీలు, బైరాన్‌పల్లి కేంద్రం 20 లారీలు, మల్లారెడ్డిపల్లిలో 40 లారీలు, సూదన్‌పల్లి కేంద్రం వద్ద 20లారీలు, నాగారం వద్ద 90 లారీలు, అన్నాసాగరం వద్ద 15 లారీలు, దేవన్నపేట వద్ద 10 లారీలు, సీతంపేట వద్ద 15లారీలు, ఎల్లాపురం వద్ద 10లారీలు, జయగిరి వద్ద15 లారీలు, గంటూరుపల్లి వద్ద 15 లారీలు, పెంబర్తి వద్ద 10లారీలు, పెగడపల్లి వద్ద 30 లారీలకు సరిడా ధాన్యం నిల్వ ఉందని రైతులు చెబుతున్నారు. కాగా, ఇందులో చాలా మంది రైతులు కేంద్రాలకు ధాన్యం తీసుకొచ్చి 20 రోజులు దాటుతోందని తెలుస్తోంది. కాంటా పూర్తికాక ముందే వర్షం వస్తే తడిచిన ధాన్యాన్ని ఎవరు కొనుగోలు చేస్తారని ప్రశ్నిస్తున్నారు.

నాలుగు రోజులకో లారీ
ఒక కేంద్రానికి లారీ పంపిస్తే.. మరో నాలుగు రోజులు గడిస్తే తప్ప లారీ రావడం లేదని సమాచారం. మిల్లుల వద్ద ధాన్యం దింపడానికి హమాలీల కొరత కారణంగా సమయం పడుతుండగా.. లారీలు కూడా సరిపడా సమకూర్చలేకపోతున్నారని తెలుస్తోంది. కాగా, ధాన్యం తీసుకెళ్లడానికి లారీలు పంపించాల్సిన బాధ్యతను ప్రభుత్వం ఆర్టీఏ అధికారులకు అప్పగించింది. దీంతో నాలుగు రోజుల క్రితం బాహుపేట ఆర్టీఏ అధికారులకు ఒక ఖాళీ లారీను  ఆపి «వంగపహాడ్‌లోని ధాన్యం కేంద్రానికి పంపించారు. ఇద్దరు రైతులను ఆ లారీలో ఎక్కించారు. అయితే లారీ డ్రైవర్‌ మధ్యలోనే రైతులను దింపేసి వెళ్లిపోయాడు. ఈ మేరకు సాయంత్రం వరకు వారు ఇంటికి చేరుకోకపోవడంతో పీఏసీఎస్‌ చైర్మన్‌ తన బైక్‌పై వారిని తీసుకురావాల్సి వచ్చింది. ఇకనైనా లారీ అసోసియేషన్ల బాధ్యులు, రైస్‌ మిల్లర్ల అసోసియేషన్‌ సభ్యుల సమన్వయంతో లారీలను సమకూర్చి ఎప్పటికప్పుడు ధాన్యాన్ని మిల్లులకు తరలించాలని రైతులు కోరుతున్నారు.

ఈయన పేరు చేరాలు. మల్లారెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఈయన నాలుగు ఎకరాల్లో వరి సాగు చేశాడు. సుమారు మూడు వందల బస్తాల పంట పండింది. ఏప్రిల్‌ 29వ తేదీన కొనుగోలు కేంద్రానికి ధాన్యం తీసుకెళ్తే ఇప్పటి వరకు కాంటా వేయలేదు. రెండు రోజుల క్రితం వీచిన గాలి దుమారానికి ధాన్యం కొట్టుకపోయిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. ధాన్యం కాంటా వేసేలా అధికారులు చూడాలని కోరుతున్నాడు

రోజూ ఆందోళనే..
ధాన్యం తీసుకొచ్చి పది రోజులైతాంది. ఇప్పటి వరకు తూకం వేయలేదు. రోజూ ఇక్కడికి వచ్చి కాంటా వేయమని అడుగుతున్నాం. లారీలు వస్తే కానీ తూకం వేయలేమని చెబుతున్నారు. సోమవారం కురిసిన వర్షానికి ధాన్యం తడిసి ముద్దయింది.– గండు సరోజన, వంగపహాడ్‌

ఇబ్బందులు ఎదురైనా అధిగమిస్తున్నాం...
కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యం తీసుకెళ్లడానికి లారీలు ఏర్పాటు చేస్తున్నాం. ప్రతీ కొనుగోలు కేంద్రానికి అక్కడ ఉన్న ధాన్యం నిల్వల మేరకు లారీలు పంపుతున్నాం. ఇటు ఎల్కతుర్తి, అటు రాంపూర్‌ వద్ద ఆర్టీఏ అధికారులను ఖాళీ లారీలను ఆపి కొనుగోలు కేంద్రాలకు మళ్లిస్తున్నారు. ఇటీవల లారీల వల్ల ఇబ్బందులు ఎదురైన విషయం వాస్తవమే. వీటిని అధిగమిస్తూ ముందుకు సాగుతున్నా.
– రాజ్‌కుమార్,సివిల్‌ సప్లయీస్‌ డిప్యూటీ తహసీల్దార్‌

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top