తహసీల్దార్‌ ఎదుట రైతు ఆత్మహత్యాయత్నం

Farmer Suicide Attempt At MRO Office Rangareddy - Sakshi

యాచారం: భూరికార్డులు ధరిణి వెబ్‌సైట్‌లో నమోదు చేయడం లేదని ఓ రైతు తహసీల్దార్‌ ఎదుటే ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. రైతులు, తహసీల్దార్‌ కార్యాలయం సిబ్బంది ఆ రైతు చేతిలో ఉన్న పురుగుల మందును లాక్కోవడంతో ప్రాణపాయం తప్పింది. యాచారం మండల పరిధిలోని అయ్యవారిగూడెం గ్రామానికి చెందిన నక్క జంగయ్య అనే రైతు పదేళ్ల క్రితం సర్వే నంబరు 877లో  గ్రామానికి చెందిన వల్లవోతు మల్లయ్య, మైసయ్య రైతుల వద్ద ఎకరా భూమి  కొనుగోలు చేశాడు. రిజిస్ట్రేషన్‌ చేసుకుని మ్యూటేషన్‌ చేయించుకున్న రైతు జంగయ్య ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోలేదు. కేసీఆర్‌ సర్కార్‌ రైతుబంధు పథకం కింద ఎకరాకు రూ.5 వేల పెట్టుబడి సాయం అందిస్తుండడం వల్ల ఆ డబ్బులు వస్తాయని ఆశతో ఏడాదిగా యాచారం తహసీల్దార్‌ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాడు. అయ్యవారిగూడెం రెవెన్యూ కార్యదర్శి జగదీష్‌ను పలుమార్లు కలువగా స్పందన లేకుండా పోయింది.

జిల్లా  కలెక్టర్‌ లోకేష్‌కుమార్‌ గురువారం సాయంత్రం రెవెన్యూ కార్యదర్శులను బదిలీ చేయడంతో రెవెన్యూ కార్యదర్శి జగదీష్‌ బదిలీ అయిపోతే తనకు రైతుబంధు  రాదోనని ఆందోళనకు గురైన రైతు జంగయ్య శుక్రవారం ఉయం 10.30 గంటల నుంచి తహసీల్దార్‌ కార్యాలయం వద్దే ఉన్నాడు. ఎకరా భూమి ఆన్‌లైన్‌ నమోదు చేసే విషయంలో సరైన విధంగా స్పందన లేకపోవడంతో మనుస్తాపానికి గురైన జంగయ్య సాయంత్రం 4 గంటల సమయంలో యాచారం వెళ్లి పురుగులు మందు కొనుగోలు చేసుకుని వచ్చి తహసీల్దార్‌ పుష్పలత ఎదుటే తన భూమి ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారా... లేదా చవమంటారా అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. అంతలోనే చేతిలో ఉన్న పురుగుల మందు డబ్బా మూతి తీసి తాగేలోపే అక్కడే రైతులు, రెవెన్యూ సిబ్బంది గమనించి పురుగుల మందు సీసాను లాక్కొన్నారు.

క్షణాల్లోనే జరిగిన సంఘటనకు ఉలికిపడిన తహసీల్దార్‌ రైతుపై తీవ్రంగా మండిపడుతూ చస్తారా... చస్తే భూమి ఆన్‌లైన్‌ అవుతుందా.. ఏమైనా ఇబ్బంది ఉంటే తన దృష్టికి తీసుకరావాలి అంటు అన్నారు. రెండు రోజుల్లో నీ సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇవ్వడంతో ఆ రైతు శాంతించి వెళ్లిపోయాడు. ఇదే విషయమై రెవెన్యూ కార్యదర్శి జగదీష్‌ను సంప్రదించగా అయ్యవారిగూడెంలోని 877 సర్వే నంబరులో 10.21 ఎకరాలు భూమి ఉండగా, ఎకరా భూమి అదనంగా నమోదైందని, ఆ భూమిని తహసీల్దార్‌ అనుమతితో రికార్డుల నుంచి తొలగించడం కోసం ఆర్డీఓ అనుమతి కోసం పంపాను. రెండు, మూడు రోజుల్లో సరిచేస్తానని తెలియజేశాను. ఇంతలో ఆ రైతు ఆత్మహత్యయత్యానికి యత్నించడం బాదేసిందని అన్నారు. రైతు జంగయ్య రైతును ఇబ్బంది పెట్టలేదని, సాంకేతిక సమస్య వల్ల ఆన్‌లైన్‌లో ఎకరా భూమి నమోదు చేయలేదని తెలిపారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top