‘కృషి కల్యాణ్‌’తో రైతు ఆదాయం రెట్టింపు

Farmer income doubled with krishi kalyan abhiyan - Sakshi

కేంద్ర సంయుక్త కార్యదర్శి నీరజాశాస్త్రి 

సాక్షి, హైదరాబాద్‌: రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే కృషి కల్యాణ్‌ అభియాన్‌ పథకం ముఖ్య ఉద్దేశమని కేంద్ర ప్రభుత్వ సంయుక్త కార్యదర్శి నీరజాశాస్త్రి అన్నారు. బుధవారం వ్యవసాయ కమిషనరేట్‌లో ఈ పథకం అమలు తీరుతెన్నులను ఆమె సమీక్షించారు. వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ శాఖల సమన్వయంతో రైతుల సమగ్ర అభివృద్ధికి, ఉత్పత్తుల పెంపు, ఉత్పాదకత పెంచేందుకు ఈ పథకం ఉపయోగపడుతుందని నీరజాశాస్త్రి అన్నారు. వ్యవసాయరంగాన్ని బలోపేతం చేయడమే ఈ పథకం లక్ష్యమని పేర్కొన్నారు.

ఈ పథకం ద్వారా రైతులకు భూసార కార్డుల పంపిణీ, అపరాలు, నూనెగింజల మినీ కిట్ల పంపిణీ, ఉద్యాన, అటవీ, వెదురు మొక్కలను అందజేయడం, పాడి పశువులకు 100 శాతం వ్యాక్సినేషన్‌ జరిగేలా చూడటం, గొర్రెలు, మేకల్లో పీపీఆర్‌ రోగ నివారణ, పశువులకు కృత్రిమ గర్భధారణకు చర్యలు చేపడతామని చెప్పారు. సూక్ష్మ నీటిపారుదల విధానం, సమగ్ర పంటల విధానాన్ని ప్రోత్సహించడానికి ప్రదర్శనలు ఏర్పాటు చేయడం, ఈ పథకం కింద ఎంపిక చేసిన గ్రామంలో 10 నుంచి 20 వ్యవసాయ పరికరాలను అందజేస్తామని చెప్పారు.

ఈ పథకాన్ని కేంద్రం జూన్‌ 1 నుంచి జూలై 18 వరకు అమలు చేయాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. దేశంలోని 115 జిల్లాల్లో ఈ పథకం అమలు చేస్తున్నట్లు చెప్పారు. ప్రతి జిల్లాలో 25 గ్రామాలను ఎంపిక చేసినట్లు తెలిపారు. తెలంగాణ నుంచి ఖమ్మం, జయశంకర్‌ భూపాలపల్లి, కొమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలను ఎంపిక చేసినట్లు చెప్పారు. ఈ పథకాన్ని విజయవంతం చేయాల్సిందిగా వ్యవసాయ కమిషనర్‌ జగన్‌మోహన్‌ అధికారులను ఆదేశించారు. రైతు సమన్వయ సమితుల సహకారాన్ని తీసుకోవచ్చన్నారు. రోజువారీ నివేదికలను కృషి విజ్ఞాన కేంద్రం పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేయాలని సూచించారు. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top