మున్సిపాలిటీ పేరిట నకిలీ సర్టిఫికెట్లు

Fake Certificates in Nalgonda Municipality - Sakshi

విద్యాశాఖకు సమర్పించిన ఓ పాఠశాల యాజమాన్యం

కలకలం రేపిన ఉదంతం

నల్లగొండ టూటౌన్‌ : నీలగిరి మున్సిపాలిటీని నకిలీ రశీదులు, నకిలీ సర్టిఫికెట్లు వెంటాడుతున్నాయి. గతంలో నకిలీ ఆస్తి పన్ను రశీదులు సృష్టించి కోట్ల రూపాయలను కొల్లగొట్టిన అవినీతి ఆనకొండలపై వేటు పడిన విషయం తెలిసిందే. ఆస్తి పన్ను కాజేసిన ఘటనపై అప్పట్లో 23 మంది మున్సిపల్‌ ఉద్యోగులు సస్పెన్షన్‌ అయి రెండేళ్ల పాటు విధులకు దూరంగా ఉన్నారు. ఇప్పుడు మరోసారి నీలగిరి మున్సిపాలిటీ పేర నకిలీ సర్టిఫికెట్లు  తయారు చేయడం వెనుక పెద్ద కథే నడిచినట్లు తెలుస్తోంది.   విద్యార్థులకు నీతిని బోధించే ప్రైవేట్‌ పాఠశాల యాజమాన్యం వారు నకిలీ సర్టిఫికెట్లు సృష్టించారా లేక మున్సిపాలిటీ కార్యాలయంలోని ఇంటి దొంగల హస్తం ఏమైనా ఉందా అనే అనుమానాలు సైతం వ్యక్తం అవుతున్నాయి. సంబంధిత పాఠశాల వారు  అనుమతుల కోసం విద్యాశాఖకు సమర్పించే సర్టిఫికెట్లు నకిలీవా, ఒరిజినల్‌వా అని చూడకపోవడంతో నకిలీ సర్టిఫికెట్లు చలామని అవుతున్నట్లు తెలిసింది.

నీలగిరి పట్టణంలోని మిర్యాలగూడ రోడ్డులో  ఉన్న ఓ ప్రైవేట్‌ పాఠశాల వారు మున్సిపాలిటీ నుంచి శానిటరీ సర్టిఫికెట్, నిరభ్యంతర సర్టిఫికెట్లు పొందలేదు. దాంతో మున్సిపాలిటీ పేరు మీద సంబం«ధిత ప్రైవేట్‌ పాఠశాలకు నిరభ్యంతర సర్టిఫికెట్, శానిటరీ సర్టిఫికెట్‌ ఇచ్చి పాఠశాల  అనుమతి కోసం సమర్పించారు.  రెండు రోజుల క్రితం  అజ్ఞాత వ్యక్తి ఇచ్చిన సమాచారం మేరకు సంబంధిత పాఠశాలకు తాము ఎలాంటి  సర్టిఫికెట్లు ఇవ్వలేదని మున్సిపల్‌ అధికారులు జిల్లా విద్యాశాఖ అధికారికి లేఖ రాశారు. మున్సిపల్‌ కార్యాల యం నుంచి పొందకుంగా సంబంధిత పాఠశాల యాజమాన్యం వారు విద్యాశాఖకు సమర్పించిన శానిటరీ సర్టిఫికెట్, నిరభ్యంతర సర్టి ఫికెట్ల ఎవరు సృష్టించారో తేలాల్సి ఉంది.  

వెయ్యి రూపాయల కోసం నకిలీవెందుకో...?
ప్రైవేట్‌ పాఠశాలకు జిల్లా విద్యాశాఖ నుంచి అన్ని అనుమతులు రావాలంటే మున్సిపల్‌ కార్యాలయం నుంచి శానిటరీ సర్టిఫికెట్, నిరభ్యంతర సర్టిఫికెట్‌ తీసుకొని వారికి సమర్పించాలి. సంబంధిత పాఠశాల సర్టిఫికెట్ల కోసం దరఖాస్తు చేసుకుంటే మున్సిపల్‌ సిబ్బంది వెళ్లి పాఠశాలలో మౌలిక వసతులు, తాగు నీరు, మూత్రశాలలు, మరుగు దొడ్లు ఉండాలి. అదే విధంగా కాలనీలో నెలకొల్పిన పాఠశాలపై కాలనీవాసులు అభ్యంతరం తెలపకుండా ఉండాలి. దాని కోసమే నిరభ్యంతర సర్టిఫికెట్‌ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ సర్టిఫికెట్‌లకు కేవలం ఒక్కో దానికి రూ. 1000  మాత్రమే చెల్లించాల్సి ఉంది. ఒక పాఠశాల స్థాపించే వారు వెయ్యి, రెండు వేలకు భయపడతారా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.  

నకిలీపై నజర్‌ ...
మున్సిపాలిటీ పేరు మీద నకిలీ సర్టిఫికెట్లు వెలుగు చూడడంతో వీటిపై నిగ్గు తేల్చాల్చిన అవసరం ఉంది. ఈ నకిలీ  బెడద కేవలం శానిటరీ సర్టిఫికెట్లు, నిరభ్యంతర సర్టిఫికెట్ల వరకే పరిమితం అయ్యాయా లేక ఇతర విభాగాలకు సంబంధించి కూడా ఏమైనా చలామణి అవుతున్నాయా అనే అనుమానాలు లేకపోలేదు. నకిలీ సర్టిఫికెట్లు, నకిలీ రశీదు పుస్తకాల వ్యవహారం మున్సిపాలిటీకి పెద్ద తలనొప్పిగా మారాయి. ఇలాంటి నకిలీ వ్యవహారాల వలన ఇటు మున్సిపాలిటీకి చెడ్డ పేరు రావడంతో పాటు  పట్టణ ప్రజల్లోనూ అనేక అనుమానాలు రేకెత్తిస్తాయి. నకిలీ సర్టిఫికెట్లపై మున్సిపల్‌ అధికారులు నజర్‌ పెట్టి సూత్రదారులు, పాత్రదారులపై కఠిన చర్యలు తీసుకుంటేనే ప్రజల్లో నమ్మకం పెరుగుతుందని స్థానికులు భావిస్తున్నారు.  
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top