అనుమతిలేని ఇళ్లకు అదనపు పన్ను

Extra Property Tax Will Be Charged On Unauthorized Homes In Municipalities - Sakshi

10శాతంనుంచి వందశాతం వరకు పెంపు

ఈ ఏడాదినుంచే మున్సిపాలిటీలలో అమలు

సాక్షి, మిర్యాలగూడ: మున్సిపాలిటీలలో అనుమతి లేని నివాసాలపై ప్రభుత్వం కొరడా ఝులిపించనుంది.  మున్సిపల్‌ అనుమతులు లేకుండా నివాసాలు నిర్మించుకున్న వారికి అదనపు పన్ను రూపంలో ఆస్తిపన్ను పెంచారు. అనుమతి ఉన్న భవనాలలో అనుమతికి మించి అదనపు గదులు గానీ, అంతస్తులు గానీ నిర్మించినా అదనపు పన్ను చెల్లించాల్సిందే. 2019–20వ ఆర్థిక సంవత్సరం నుంచి ఈ అదనపు పన్నును అమలు చేయనున్నారు. నివాసాలు, కమర్షియల్‌ కాంప్లెక్స్‌లు నిర్మించిన సంవత్సరాల ఆధారంగా ఆస్తి పన్నులో 10 శాతం నుంచి వందశాతం వరకు పెంచారు. దీంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. వెయ్యి రూపాయల ఆస్తిపన్ను చెల్లించే వారికి ఇకనుంచి రెండు వేల రూపాయల బిల్లు వస్తుంది. 

అంతా ఆన్‌లైన్‌లోనే
జిల్లాలో నల్లగొండ, మిర్యాలగూడ, దేవరకొండ పాత మున్సిపాలిటీలు ఉండగా, కొత్తగా చిట్యాల, చండూరు, హాలియా, నందికొండను ఏర్పాటు చేశారు.  మున్సిపాలిటీలలో నివాసాలు, కమర్షియల్, ప్రభుత్వ కార్యాలయాలు, ఇతర నివాస సముదాయాలను గత ఏడాది ఆన్‌లైన్‌లో జియో ట్యాగింగ్‌ చేశారు. నిర్మాణాల విస్తీర్ణం, భవన అంతస్తులు, ఇతర నిర్మాణాలు పూర్తిగా ఆన్‌లైన్‌లో నమోదయ్యాయి. దీంతో అనుమతి తీసుకున్న సమయంలో ఇంటి నిర్మాణం ఎన్ని అంతస్తులు, ప్రస్తుతం ఎన్ని అంతస్తులు ఉందనే విషయంతో పాటు నిర్మాణానికి అనుమతి ఉందా? లేదా? అనేది కూడా గూగుల్‌లో అధికారులు చూసే అవకాశం ఉంది. దాని ఆధారంగా ఆన్‌లైన్‌లోనే ఆస్తిపన్ను ఎంత చెల్లించాలనే వివరాలు  కూడా వస్తాయి. ఆన్‌లైన్‌లో వచ్చిన ఆస్తి పన్నును ఇంటి యజమాని పూర్తిగా చెల్లించాల్సిందే.  ఇంటి నిర్మాణం, విస్తీర్ణం, అంతస్తుల ఆధారంగా ప్రస్తుతం చెల్లిస్తున్న ఆస్తిపన్నుపై అదనంగా 10 నుంచి వందశాతం వరకు పెంచారు. 

మిర్యాలగూడలో ఇదీ పరిస్థితి:
మిర్యాలగూడ మున్సిపాలిటీలో నివాసాలు 19,318 ఉన్నాయి. కమర్షియల్‌ భవనాలు 1941, కమర్షియల్‌తో పాటు నివాసాలు ఉన్నవి 452 మొత్తం 21,711 భవనాలు ఉన్నాయి. వాటికి గాను 6.82 కోట్ల రూపాయల ఆస్తిపన్ను వసూలు చేయాల్సి ఉంది. దీంతోపాటు పాత బకాయిలు 8.26 లక్షల రూపాయలు ఉండగా మొత్తం 6.90 కోట్ల రూపాయల ఆస్తి పన్నును వసూలు చేయాల్సి ఉంది.  ఇప్పటివరకు 1.88 కోట్ల రూపాయలు మాత్రమే వసూలు చేశారు. ఇంకా 5.02 కోట్ల రూపాయలు వసూలు చేయాల్సి ఉంది. ప్రభుత్వ భవనాలు, కార్యాలయాలకు సంబంధించి పాత బకాయిలతో పాటు 1.51 కోట్ల రూపాయలు వసూలు చేయాల్సి ఉంది. 

ఆన్‌లైన్‌లోనే బిల్లు వస్తుంది.. చెల్లించాల్సిందే..
మిర్యాలగూడ మున్సిపాలిటీలో గతంలో అనుమతి లేకుండా నిర్మించుకున్న భవనాలకు అదనంగా పన్ను చెల్లించాల్సిందే. ఆన్‌లైన్‌లో ఇంటి నిర్మాణానికి అనుమతి ఉందా? లేదా? అనే విషయం కూడా ఉంది. 10 శాతం నుంచి వంద శాతం వరకు అదనపు పన్ను వస్తుంది. అనుమతి ఉండి కూడా అదనపు పన్ను వస్తే పత్రాలతో మున్సిపాలిటీకి వస్తే పరిశీలిస్తాం. ఆన్‌లైన్‌లోనే బిల్లులు వస్తున్నందున చెల్లించాల్సిందే. 
– కళ్యాణి, రెవెన్యూ అధికారి, మిర్యాలగూడ మున్సిపాలిటీ  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top