మరో మూడు నెలలు పొడిగింపు?

Extension for another three months - Sakshi

     డీజీపీగా అనురాగ్‌ శర్మకు సర్కార్‌ ఆఫర్‌

     వచ్చే ప్యానల్‌ ఇయర్‌ నాటికి ఎంపికపై కసరత్తు 

     ప్రస్తుతం డీజీపీ నియామకంపై ఎటూతేల్చుకోలేని సర్కార్‌  

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రానికి కొత్త డీజీపీ ఎవరు? ఆ స్థానంలో ఎవరిని తీసుకువస్తారు? పోలీస్‌ శాఖలోనే కాదు రాజకీయపరంగా కూడా ఈ అంశంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇలాంటి తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త ఎత్తుగడతో ముందుకు వెళ్తోందన్న వాదన సైతం అధికార వర్గాల్లో వినిపిస్తోంది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ప్రస్తుత డీజీపీ అనురాగ్‌శర్మ నవంబర్‌ 14న పదవీ విరమణ చేయాల్సి ఉంది. అయితే మరో మూడు నెలల పాటు డీజీపీ పదవీ కాలాన్ని పొడిగించే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టు సచివాలయ వర్గాల్లో చర్చ సాగుతోంది. గతంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న రాజీవ్‌ శర్మ పదవీ కాలాన్ని ఆరు నెలల పాటు ప్రభుత్వం పొడిగించింది. ఇప్పుడు అనురాగ్‌ శర్మ వ్యవహారంలోనూ ప్రభుత్వం అదే రీతిలో వ్యవహరించేందుకు కార్యాచరణ సిద్ధం చేసుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

పదోన్నతులు కల్పిస్తూనే బదిలీలు..
నవంబర్‌ 14న పదవీ విరమణ చేసేకంటే ముందే ఇన్‌చార్జి డీజీపీగా పలువురు అధికారుల పేర్లపై కసరత్తు జరగాల్సి ఉంది. ప్రస్తుతం అలాంటి చర్చలు, కసరత్తు జరగడం లేదు. అనురాగ్‌ శర్మ పదవీ కాలాన్ని మూడు నెలల పాటు పొడిగించడంపై కూడా ఒక ఎత్తుగడ ఉన్నట్టు వినిపిస్తోంది. వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరిలో పలువురు అధికారులకు పదోన్నతులు కల్పించాల్సి ఉంది. అప్పటి వరకు రాష్ట్రంలో ఐపీఎస్‌ల బదిలీలు లేకుండా చూసుకోవాలని, పదోన్నతులు కల్పిస్తూనే డీజీపీతో పాటు ఇతర కీలకమైన అధికారులను బదిలీ చేసేందుకు కసరత్తు చేసుకోవాలన్న ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఉందని సీనియర్‌ ఐపీఎస్‌ల్లో చర్చ జరుగుతోంది. పదోన్నతుల్లో భాగంగా సైబరాబాద్‌ కమిషనర్‌ సందీప్‌ శాండిల్యా ఐజీ హోదా నుంచి అదనపు డీజీపీగా పదోన్నతి పొందనున్నారు. అలాగే తరుణ్‌జోషి సీనియర్‌ ఎస్పీ హోదా నుంచి డీఐజీగా పదోన్నతి పొందనున్నారు. వీరిద్దరికీ నూతన పోస్టింగ్‌తో పాటు రెండేళ్ల పాటు పోస్టింగ్‌ పూర్తి చేసుకున్న సీనియర్‌ ఐపీఎస్‌లకు స్థాన చలనం చేయాల్సి ఉంది. ఇందుకోసం ఒకేసారి డీజీపీతోపాటు భారీ ప్రక్షాళన చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలుస్తోంది.

వచ్చే ఏడాదే డీజీపీ ఎంపికపై కసరత్తు
ఇక డీజీపీగా ఎవరిని నియమించాలన్న దానిపై సర్కార్‌ పెద్దగా కసరత్తు చేసినట్టు కనిపించడంలేదు. జనవరిలోనే ఆ తతంగం పూర్తిచేస్తారని, ఇందుకోసం కేంద్ర సర్వీసులో ఉన్న సుదీప్‌ లఖ్టకియాతో పాటు నగర కమిషనర్‌ మహేందర్‌రెడ్డి, హోం శాఖ ముఖ్య కార్యదర్శి రాజీవ్‌ త్రివేది, రోడ్‌ సేఫ్టీ డీజీ కృష్ణప్రసాద్‌ పేర్లు వినిపిస్తున్నాయి. ఈ నలుగురిలో ఎవరో ఒకరికి డీజీపీ పోస్టు ఖాయమన్న చర్చ ఐపీఎస్‌ల్లో నడుస్తోంది. అయితే ఫిబ్రవరిలో ఇన్‌చార్జి డీజీపీగా ఒకరిని నియమించి ఆ తర్వాత డీవోపీటీ, కేంద్ర హోంశాఖకు పంపే ప్యానల్‌ జాబితాలో ఈ నలుగురితో పాటు డైరెక్టర్‌ జనరల్‌ హోదాలో ఉన్న మరో ముగ్గురి పేర్లు కూడా పంపనున్నట్టు తెలుస్తోంది. కేంద్రం నుంచి వచ్చే ముగ్గురి పేర్లలో ఒకరిని పూర్తి స్థాయి డీజీపీగా నియమించుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top