
సాక్షి, న్యూఢిల్లీ: ఆర్థికంగా వెనకబడిన వర్గాల (ఈడబ్ల్యూఎస్)కు రిజర్వేషన్లు కట్టబెట్టిన 123వ రాజ్యాంగ సవరణ చట్టం రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని ఉల్లంఘిస్తోందని, దీనిని రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించాలని కోరుతూ రిటైర్డ్ జస్టిస్ వి.ఈశ్వరయ్య బుధవారం సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ‘123వ రాజ్యాంగ సవరణ చట్టం రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని, రాజ్యాంగంలోని 141వ ఆర్టికల్‌కు ఉల్లంఘిస్తోంది.
ఇందిరా సహానీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో 1991లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును విభేదిస్తోంది. 2011లో చేపట్టిన సామాజిక–ఆర్థిక కుల జనగణనను ప్రచురించి, దాని ఆధారంగా రిజర్వేష న్లు అమలు చేసేలా ఆదేశాలివ్వాలి. ఆర్థికంగా వెనకబడిన వర్గాలు ఏరకంగానూ అణచివేతకు గురికాలేదు. కానీ సామాజికంగా బలహీనులైన వెనకబడిన వర్గాలు అనేక విధాలుగా వివక్షకు గురయ్యాయి. అగ్రవర్ణాల్లో పేదలు 5% కూడా లేరు. వారికి 10 శాతం రిజర్వేషన్లు కేటాయించారు’ అని పిటిషన్‌లో పేర్కొన్నారు.