సాక్షి, హైదరాబాద్: పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్ జీవో 46పై హైకోర్టు ఇవాళ(నవంబర్ 28, శుక్రవారం) విచారణ జరిపింది. ఈ దశలో ఎన్నికల పై స్టే విధించలేం అని హైకోర్టు స్పష్టం చేసింది. సబ్ క్యాటగిరీ రిజర్వేషన్ లేనందుకు మీరు ఎన్నికలు రద్దు చేయాలనీ కోరుకుంటున్నారా? పిటీషనర్‌కు హైకోర్టు ప్రశ్న వేసింది. ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చాక కోర్టుల జోక్యం ఉండకూడదని ఎలక్షన్ కమిషన్ తరఫు అడ్వకేట్ తన వాదనలు వినిపించారు.
42 శాతం రిజర్వేషన్ జీవో విచారణ సమయంలో పాత పద్ధతిలో ఎన్నికలు నిర్వహించమనీ మేమే చెప్పాం కదా? అంటూ హైకోర్టు వ్యాఖ్యానించింది. గతంలో 2009 లో ఇదే తరహా పరిస్థితి వచ్చినప్పుడు జీహెచ్‌ఎంసీ ఎలక్షన్‌ను రద్దు చేశారని పిటిషనర్ తరఫు న్యాయవాది అన్నారు. ఈ దశలో తాము ఎలాంటి జోక్యం చేసుకోలేమని హై కోర్టు తేల్చి చెప్పింది.
‘‘మేమే ఎన్నికలు నిర్వహిoచమని ఆదేశించి.. మేమే స్టే ఎలా ఇస్తాం’ అంటూ హైకోర్టు వ్యాఖ్యానించింది. హైకోర్టు డెడికేటెడ్ కమిషన్ రిపోర్డ్‌ను బహిర్గతం చేసి కాపీ ఇవ్వాలంటూ పిటిషనర్ తరఫు న్యాయవాది కోరగా.. ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమన్న హైకోర్టు తెలిపింది. సబ్ క్యాటగిరి రిజర్వేషన్లపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. 6 వారాలోపు కౌంటర్ దాఖలు చేయాలన్న కోర్టు.. తదుపరి విచారణ 8 వారాలకు వాయిదా వేసింది.


