తెలంగాణలో సంచలన ఎన్‌కౌంటర్లు ఇవే!  | Sakshi
Sakshi News home page

తెలంగాణలో సంచలన ఎన్‌కౌంటర్లు ఇవే! 

Published Sat, Dec 7 2019 3:14 AM

Encounters After Formation Of Telangana During 2015 To 2019 - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఏడు ఎన్‌కౌంటర్లు చోటు చేసుకున్నాయి. అన్నీ సంచలన కేసులే కావడం గమనార్హం. వీరిలో నలుగురు మావోయిస్టులు, పేరుమోసిన మాఫియాడాన్, రెండు ఘటనల్లో సిమీ ఉగ్రవాదులు ఉన్నారు. 

2015, ఏప్రిల్‌ 4 : తెలంగాణలో తొలి ఎన్‌ కౌంటర్‌ జరిగింది. నల్లగొండ సిమీ ఉగ్రవాదుల సంచారంతో వణికిపోయింది. 2013లో మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వా జైలు నుంచి పారిపోయిన ఐదుగురిలో ఇద్దరు ఉగ్రవాదులు సూర్యాపేటలో బస్సులు తనిఖీ చేస్తున్న సమయంలో పోలీసులపైకి కాల్పులు జరిపి పారిపోయారు. జానకీపురం గ్రామంలో పోలీసులతో జరిపిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు సిమీ ఉగ్రవాదులు హతమయ్యారు. 

2015, ఏప్రిల్‌ 7 : సిమీ ఉగ్రవాది వికారుద్దీన్‌ అతని నలుగురు సహచరులను హైదరాబాద్‌లోని కోర్టుకు తీసుకువస్తుండగా ఆలేరు సమీపంలో పోలీసులపైకి దాడికి దిగారు. ఉగ్రవాదులు ఫైర్‌ ఓపెన్‌ చేయడంతో పోలీసులు ఎదురుకాల్పులకు పాల్పడ్డారు. ఈ కాల్పుల్లో వికారుద్దీన్‌తోపాటు నలుగురు సహచరులు మరణించారు. 

2015, సెప్టెంబర్‌ 15 : ఉమ్మడి వరంగల్‌ జిల్లా వెంగళాపూర్‌ వద్ద మావోయిస్టులకు, పోలీసులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు ప్రాణాలు కోల్పో యారు. వీరిలో ఒకరు మహిళ. 

2016, ఆగస్టు 8 : షాద్‌నగర్‌ సమీపంలోని మిలీనియా టౌన్‌షిప్‌ పరిసరాల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మాఫియాడాన్‌ నయీముద్దీన్‌ అలియాస్‌ నయీమ్‌ హతమయ్యాడు. 

2019, జూలై 31 : కొత్తగూడెం జిల్లా రోళ్లగూడెం వద్ద జరిగిన ఎన్‌కౌంటర్‌లో న్యూడెమోక్రసీ నేత లింగన్న హతమయ్యాడు. 

2019–20 : మణుగూరు మండలం బూరుగుల గ్రామంలో జాడి వీరాస్వామి అలియాస్‌ రఘును మట్టుబెట్టారు.  

2019, డిసెంబర్‌ 6 : దిశ కేసులో ఆరిఫ్, శివ, నవీన్, చెన్నకేశవులు చటాన్‌పల్లిలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ప్రాణాలు కోల్పోయారు.  

Advertisement
Advertisement