నిర్లక్ష్యమే శాపమై!

Electric Shock Two Members Died Mahabubnagar - Sakshi

జడ్చర్ల: కరెంట్‌తో చెలగాటం ఆశామాషీ కాదు. ఏ చిన్న కరెంటు పని ఉన్నా అనేక జాగ్రత్తలు తీసుకోవడం.. నైపుణ్యం ఉన్నవారిచే  చేయించ డం ఉత్తమం. సామాన్య ప్రజలే ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్న ప్రస్తుత పరిస్థితుల్లో సంబంధిత వి ద్యుత్‌ శాఖ అధికారులు మరెన్ని జాగ్రత్తలు తీ సుకోవాలి. కానీ ఆ శాఖ అధికారుల తప్పిదం, సి బ్బంది నిర్లక్ష్య వైఖరి కారణంగా.. మిడ్జిల్‌లోని 33 /11 కేవీ విద్యుత్‌ సబ్‌స్టేషన్‌లో గురువారం చోటు చేసుకున్న ప్రమాదంలో గాయపడిన బాధితులు ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.

అసలేం జరిగిందంటే.. 
మిడ్జిల్‌ సబ్‌స్టేషన్‌లోని విద్యుత్‌ స్తంభాలు ఇతర మెటీరియల్‌కు పెయింట్‌ వేసేందుకు సంబంధిత ఏఈ చర్యలు చేపట్టారు. కానీ ఇందుకు సంబంధించి ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి అనుమతి తీసుకోకుండానే పనులు చేపట్టారు. అంతా సవ్యంగా సాగితే ఏ ఇబ్బంది లేకుండేది. కానీ సబ్‌స్టేషన్‌లో పెయింట్‌ చేస్తున్న కూలీలు విద్యుత్‌ ప్రమాదానికి గురికావడంతో అధికారుల నిర్లక్ష్యం వెలుగులోకి వచ్చింది. వాస్తవంగా విద్యుత్‌ సబ్‌స్టేషన్‌లో పనిచేయడమంటేనే ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సిందే.

ఇందుకు సంబంధించి ఊర్కొండ మండలం బాల్యలోక్యతండాకు చెందిన శ్రీను, వెంకటేశ్, తిరుపతి, దేవ్యలను పెయింట్‌ వేసేందుకు రప్పించారు. సబ్‌స్టేషన్‌లో ఒక లైన్‌కు సంబంధించి విద్యుత్‌ సరఫరా నిలిపివేసి.. మరో లైన్‌కు సంబంధించి సరఫరాను కొనసాగిస్తూనే పనులు చేయించారు. దీంతో ప్రమాదవశాత్తు పెయింట్‌ వేస్తున్న వారికి విద్యుత్‌ షాక్‌ తగలడంతో.. తీవ్రగాయాలతో బయటపడి ఆస్పత్రి పాలయ్యారు. వీరిలో శ్రీను పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. మిగతా వారు కూడా తీవ్ర గాయాలకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
 
రక్షణ చర్యలేవీ..? 
వాస్తవంగా పెయింట్‌ చేస్తున్న కూలీలకు సంబంధిత అధికారులు రక్షణ చర్యలు చేపట్టాల్సి ఉంది. వారికి విద్యుత్‌ షాక్‌ తగలకుండా ముందస్తుగా చే తులకు, కాళ్లకు ప్లాస్టిక్‌ బ్లౌజ్‌లు, ఇతర రక్షణ ఏ ర్పాట్లు చేయడంతోపాటు అక్కడ ప్రత్యేకంగా ప నులను చేస్తున్న సమయంలో ఎక్కడెక్కడ కరెంటు సరఫరా ఉంటుందో దగ్గరుండి హెచ్చరిస్తూ పర్యవేక్షించాలి. కానీ సిబ్బంది, ఏఈ ఎవరూ కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ప్రమాదానికి కారణమయినట్ల తెలుస్తుంది. అంతేగాక పెయింటింగ్‌ వేసేందుకు ఇనుప నిచ్చెన వినియోగించడం మరింత ఆజ్యం పోసినట్లయింది. నిర్లక్ష్యంగా వ్యవహరించిన బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా బాధిత కుటుంబాల సభ్యులు, ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు.

గతంలోనూ ఇద్దరు మృత్యువాత 
జడ్చర్ల మండలంలోని గంగాపూర్‌ గ్రామ శివారులో గతంలో విద్యుత్‌ లైన్‌లు బిగిస్తున్న క్రమంలో విద్యుత్‌ షాక్‌ తగిలి ఇద్దరు కార్మికులు మృత్యువాత పడ్డారు. అప్పుడు కూడా సంబంధిత విద్యుత్‌ శాఖ సిబ్బంది, కాంట్రాక్టర్‌ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే ప్రమాదం చోటు చేసుకుందన్న ఆరోపణలున్నాయి.

విద్యుదాఘాతానికి వ్యక్తి బలి 
శ్రీరంగాపూర్‌ (కొత్తకోట): పొలంలో తెగిపడిన విద్యుత్‌ తీగ తగిలి ఓ గొర్రెల కాపరి మృతిచెందాడు. ఈ సంఘటన శుక్రవారం శ్రీరంగాపూర్‌లో చోటుచేసుకుంది. బాధిత కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన గొల్ల బొక్కలయ్య(40) గొర్రెలను కాస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో గురువారం తన గొర్రెలను మేపడానికి తీసుకెళ్లిన బొక్కలయ్య రాత్రి తిరిగి ఇంటికి చేరుకున్నాడు.

అయితే ఒక గొర్రె కనిపించకపోవడంతో శుక్రవారం ఉదయం బొక్కలయ్య దానిని వెతుకుతూ వెళ్లగా సమీపంలోని ఒక పొలంలో పడిన విద్యుత్‌ తీగ వద్ద గొర్రె పడి ఉంది. గమనించిన బొక్కలయ్య వెంటనే వెళ్లి చూడగా విద్యుత్‌ తీగ తగిలి షాక్‌కు గురై అక్కడికక్కడే మృతిచెందాడు. అటుగా వెళ్లిన రైతులు గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించగా వారు వెళ్లి బోరున విలపించారు. బొక్కలయ్యకు భార్యతోపాటు ఇద్దరు పిల్లలున్నారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు డిమాండ్‌ చేశారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top