ప్రచారానికి తెర

Election Campaign Closed - Sakshi

సాక్షిప్రతినిధి, ఖమ్మం: శాసనసభ ఎన్నికల ప్రచారానికి బుధవారం సాయంత్రం 5 గంటలతో తెరపడింది. ఈనెల 7వ తేదీన పోలింగ్‌ నిర్వహించనుండగా.. 38 గంటల  ముందుగానే ప్రచారం పరిసమాప్తమైంది. నోటిఫికేషన్‌ విడుదలైనప్పటి నుంచి బరిలో నిలిచిన పార్టీలన్నీ ప్రచారాన్ని హోరెత్తించాయి. జిల్లాలో వివిధ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులుగా 62 మంది బరిలో ఉండగా.. వీరంతా ఆయా నియోజకవర్గాల్లో ప్రచారాన్ని ముమ్మరంగా సాగించారు. ఇప్పటివరకు నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తలు తమ అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారం నిర్వహించారు. ఆటోలు, ప్రచార వాహనాలపై మైకులతో ప్రచార జోరు సాగిం చారు. అభ్యర్థుల అనుచరులు కూడా తమకు పరిచయం ఉన్న ఇళ్లకు వెళ్లి.. తమ అభ్యర్థికి ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. 7వ తేదీన పోలింగ్‌ ఉండడం వల్ల ప్రచారం సమాప్తం కావడంతో పల్లెలు, పట్టణాల్లో నిశ్శబ్ద వాతావరణం నెలకొంది. జిల్లాలోని మద్యం దుకాణాలను సాయంత్రం 6 గంటల నుంచి మూసివేశారు.

ప్రధాన రాజకీయ పక్షాలకు చెందిన అభ్యర్థులు చివరి నిమిషం వరకు తమ ప్రచారం కొనసాగించారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం రూరల్‌ మండలం తెల్దారుపల్లిలో చివరి ఎన్నికల ప్రచార సభలో ప్రసంగించగా.. ఖమ్మం టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పువ్వాడ అజయ్‌కుమార్‌ నగరంలోని 15వ డివిజన్‌లో చివరి సభ నిర్వహించారు. పాలేరు కాంగ్రెస్‌ అభ్యర్థి కందాళ ఉపేందర్‌రెడ్డి తిరుమలాయ పాలెం మండలం రమణతండాలో.. ఖమ్మం ప్రజాకూటమి అభ్యర్థి నామా నాగేశ్వరరావు ఖమ్మం నగరంలో.. మధిర కాంగ్రెస్‌ అభ్యర్థి మల్లు భట్టి విక్రమార్క మధిర మండలం సిద్ధినేనిగూడెంలో చివరి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మధిర టీఆర్‌ఎస్‌ అభ్యర్థి లింగాల కమల్‌రాజ్, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మధిర పట్టణంలో చివరి ఎన్నికల ప్రచార సభలో ప్రసంగించి.. పార్టీ విజయానికి కృషి చేయాల్సిందిగా అభ్యర్థించారు. వైరా నుంచి టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మదన్‌లాల్, ప్రజాకూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న బాణోతు విజయ నియోజకవర్గంలోని వైరా మండలం అష్ణగుర్తిలో ఎన్నికల ప్రచార సభ నిర్వహించారు. సత్తుపల్లిలో ప్రజాకూటమి అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్య, టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పిడమర్తి రవి చివరి రోజు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇక బీజేపీ, సీపీఎం–బీఎల్‌పీ సైతం చివరి రోజు ఎన్నికల ప్రచార సభల ను ఆయా గ్రామాల్లో విస్తృతంగా నిర్వహించాయి.
 
రాష్ట్ర, జాతీయస్థాయి నేతల ప్రచారం 
ఈసారి ఎన్నికలను రాజకీయ పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతోపాటు సర్వశక్తులొడ్డి పోరాడుతున్నాయి. ఇటు టీఆర్‌ఎస్, అటు ప్రజాకూటమి పక్షాలతోపాటు బీజేపీ, బీఎల్‌ఎఫ్‌–సీపీఎం కూటమి, స్వతంత్ర అభ్యర్థులు జోరుగా ప్రచారం చేపట్టారు. టీఆర్‌ఎస్, ప్రజాకూటమి, బీజేపీ, బీఎల్‌ఎఫ్‌–సీపీఎం కూటమి తరఫున రాష్ట్ర, జాతీయ నాయకులు జిల్లాలో ప్రచారం నిర్వహించారు. టీఆర్‌ఎస్‌ తరఫున ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌ జిల్లాలో రెండుసార్లు పర్యటించగా.. కేటీఆర్‌ కూడా ఒకసారి ఖమ్మంలో రోడ్‌షో చేపట్టారు. ప్రజాకూటమి తరఫున ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, ఏపీ సీఎం నారా చంద్రబాబు ఖమ్మంలో నిర్వహించిన బహిరంగ సభలో కలిసి పాల్గొన్నారు. మరో సారి చంద్రబాబునాయుడు సత్తుపల్లిలో పర్యటించి.. టీడీపీ అభ్యర్థి గెలుపు కోసం ప్రచారం నిర్వహించారు. ఇక మధిరలో కాంగ్రెస్‌ స్టార్‌ క్యాంపెయినర్‌ విజయశాంతి, ఖమ్మంలో టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహ్మద్‌ అజారుద్దీన్‌ రోడ్‌షోలు చేసి.. ఆయా అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహించారు. బీజేపీ అభ్యర్థుల తరఫున స్వామి పరిపూర్ణానంద, ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి, పార్లమెంట్‌ సభ్యుడు జీవీఎల్‌ నరసింహారావు, కేంద్ర మాజీ మంత్రి దత్తాత్రేయ విస్తృత ప్రచారం నిర్వహించారు. బీఎల్‌ఎఫ్‌–సీపీఎం తరఫున సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి, పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందాకారత్, రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, త్రిపుర మాజీ ముఖ్యమంత్రి మాణిక్‌ సర్కార్‌ ప్రచారం చేశారు. అభ్యర్థుల మధ్య పోటాపోటీ నెలకొనడంతో అభ్యర్థులు అలుపెరగకుండా ప్రచారం నిర్వహించారు.
 
ఎత్తుగడల్లో అభ్యర్థులు 
ప్రచారానికి తెరపడడంతో అభ్యర్థులు వ్యూహ ప్రతివ్యూహాల్లో నిమగ్నమయ్యారు. ఏ ప్రాం తంలో పరిస్థితి ఎలా ఉంది? ఓట్లు సాధించడానికి ఏం చేయాలనే దానిపై చర్చించుకుంటున్నారు. ఆయా పార్టీల నాయకులు, అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకునేందుకు ఎత్తుగడలు వేస్తున్నారు. ప్రచా రం ముగించిన అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు.
  
అడ్డుకట్ట వేసేందుకు చర్యలు 
జిల్లాలో డబ్బుల పంపిణీ ఊపందుకుంది. దీనికి అడ్డుకట్ట వేసేందుకు జిల్లా అధికార యంత్రాంగం పటిష్ట చర్యలు చేపడుతోంది. మండల కమిటీలతోపాటు జిల్లాస్థాయిలో ప్రత్యేక కమిటీలను వేశారు. ఎన్నికల వ్యయ పరిశీలకులతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. రెవెన్యూ, పోలీస్‌ తదితర బృందాలతో చెక్‌పోస్టుల వద్ద తనిఖీలు నిర్వహిస్తున్నారు. అనుమానం ఉన్న వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ఎన్నికల ప్రచారం ప్రారంభమైన ప్పటి నుంచి పోలీసులు వివిధ ప్రాంతాల్లో చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి.. వాహనాలను తనిఖీ చేస్తున్నారు. పలు ప్రాంతాల్లో భారీ స్థాయిలో నగదు తీసుకెళ్తున్న వారిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించడంతోపాటు లెక్కలు చూపని వాటిని సీజ్‌ చేశారు. పోలింగ్‌ రోజున అభ్యర్థులు ఎటువంటి ప్రచారం నిర్వహించవద్దని హెచ్చరించారు. కాగా.. అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు అధికారులు శాయశక్తులా కృషి చేస్తున్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top