నవ్వులు నాటిన  ‘నైరుతి’!..

Eastern monsoon Season Enter Into Country - Sakshi

కీలక సమయంలో వర్షాలతో ఊపందుకున్న ఖరీఫ్‌ 

నిండుకుండలా జలాశయాలు.. రబీ సాగుకు భరోసా

దేశవ్యాప్తంగా నైరుతి నిష్క్రమణ.. ‘ఈశాన్యం’ ప్రవేశం

సాక్షి, హైదరాబాద్‌: ‘నైరుతి’వెళ్లిపోయింది.. బుధవారం నైరుతి రుతుపవనాలు దేశవ్యాప్తంగా నిష్క్రమించాయి.. ఇటు ఈశాన్య రుతుపవనాలు మొదలయ్యాయి. జూన్‌ నుంచి సెప్టెంబర్‌ మధ్య కాలంలో చివరి రెండు నెలలు నైరుతి రుతుపవనాలతో వర్షాలు కుమ్మేశాయి. ఈ సీజన్‌లో తెలంగాణలో సాధారణంగా 759.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, 805.6 మిల్లీమీటర్లు నమోదైంది. సాధారణం కంటే 6 శాతం అధికంగా వర్షపాతం నమోదైంది. సాధారణానికి అటుఇటుగా వర్షం కురుస్తుందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అంచనా వేయగా, అంతకుమించి వర్షం కురవడం గమనార్హం. 2016 తర్వాత ఈసారి తెలంగాణలో 6 శాతం అధికంగా వర్షపాతం నమోదైంది. 2016లో 19 శాతం అధికంగా వర్షం కురిసింది. అంతకుముందు 2013లో 26 శాతం, 2010లో 32 శాతం అధికంగా వర్షపాతం నమోదైందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం లెక్కలు చెబుతున్నాయి.
 
జూన్‌లో లోటు.. సెప్టెంబర్‌లో అధికం
గత పదేళ్లలో ఈ సీజన్‌తో కలిపి ఐదు సార్లు అధిక వర్షాలు నమోదు కాగా, మిగిలిన ఐదు సార్లు లోటు వర్షపాతం నమోదైంది. జూన్‌లో తెలంగాణలో 33 శాతం లోటు వర్షపాతం నమోదైతే, జూలైలో 12 శాతం లోటు రికార్డయింది. ఇక ఆగస్టులో వర్షాలు ఊపందుకున్నాయి. ఆ నెలలో 11%  అధిక వర్ష పాతం నమోదు కాగా, సెప్టెంబర్‌లో రికార్డు స్థాయిలో ఏకంగా 83 శాతం అధిక వర్షపాతం నమోదైంది. ఇక రాష్ట్రంలో మొత్తం 589 మండలాలుంటే, ఈ సీజన్‌లో ఇప్పటివరకు 359 మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. 122 మండలాల్లో అధిక వర్షపాతం నమోదైంది. జిల్లాల వారీగా చూస్తే కొమురంభీం, నిజామాబాద్, వరంగల్‌ అర్బన్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, మహబూబ్‌నగర్, ములుగు, నారాయణపేట జిల్లాలో అధిక వర్షపాతం నమోదైంది. మిగిలిన జిల్లాల్లో సాధారణ వర్షం కురిసింది.

దేశంలో కూడా రికార్డు
దేశవ్యాప్తంగా కూడా ఈ సీజన్లో అధిక వర్షపాతం నమోదైంది. మొత్తంగా 10 శాతం అధిక వర్షపాతం నమోదైంది. ఇక్కడ వందేళ్ల రికార్డు దేశంలో ఒకటి నమోదైంది. సరిగ్గా వందేళ్ల కిత్రం అంటే 1917 సెప్టెంబర్‌ నెలలో దేశవ్యాప్తంగా 165 శాతం వర్షపాతం నమోదైతే, మళ్లీ ఈ ఏడాది సెప్టెంబర్‌లో 152 శాతం వర్షపాతం నమోదైంది. వందేళ్ల తర్వాత ఆ స్థాయిలో వర్షపాతం నమోదు కావడం గమనార్హం.

గణనీయంగా ఖరీఫ్‌ సాగు..
నైరుతి రుతుపవనాలు తెచ్చిన భారీ వర్షాలతో ఈ ఏడాది ఖరీఫ్‌లో పంటల సాగు విస్తీర్ణం గణనీయంగా నమోదైంది. ఖరీఫ్‌లో అన్ని పంటల సాధారణ సాగు విస్తీర్ణం 1.08 కోట్ల ఎకరాలు కాగా... ఇప్పటివరకు ఏకంగా 1.10 కోట్ల ఎకరాల్లో (102 శాతం) పంటలు సాగయ్యాయి. అందులో వరి సాధారణ సాగు విస్తీర్ణం 24.11 లక్షల ఎకరాలు కాగా, రికార్డు స్థాయిలో 31.47 లక్షల ఎకరాల్లో (131 శాతం) నాట్లు పడ్డాయి. ఇక పత్తి సాధారణ సాగు విస్తీర్ణం 43.12 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు ఏకంగా 46.48 లక్షల ఎకరాల్లో (108 శాతం) సాగైంది. పప్పు ధాన్యాల సాగు సాధారణ విస్తీర్ణం 10.37 లక్షల ఎకరాలు కాగా... 9.42 లక్షల (91 శాతం) ఎకరాల్లో సాగైంది. రాష్ట్రంలో అత్యధికంగా మంచిర్యాల జిల్లాలో 128 శాతం, నారాయణపేట జిల్లాలో 122 శాతం పంటల సాగు నమోదైంది. అతి తక్కువగా జనగామ 83 శాతం, మెదక్, రంగారెడ్డి జిల్లాల్లో 86 శాతం పంటలు సాగయ్యాయి. ఇక రబీ సాగుకు కూడా ఈ వర్షాలు దోహదం చేశాయి. జలాశయాలు, చెరువులు, కుంటలు, వాగులు పొంగి పొర్లడంతో రబీలో అంచనాలకు మించి పంటల సాగు నమోదవుతుందని వ్యవసాయశాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఈశాన్య రుతుపవనాల ప్రవేశం..
ఈశాన్య రుతుపవనాలు బుధవారం రాష్ట్రంలోకి ప్రవేశించాయి. తమిళనాడు దాన్ని ఆనుకుని ఉన్న ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ ప్రాంతాల్లో ఈశాన్య రుతుపవన వర్షాలు ప్రారంభమయ్యాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. దక్షిణ తమిళనాడు తీరానికి దగ్గరలో ఉన్న నైరుతి బంగాళాఖాతం నుండి పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు ఉపరితల ద్రోణి ఏర్పడింది. ఈ ప్రభావంతో గురువారం అనేక చోట్ల ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అలాగే ఒకట్రెండు చోట్ల భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. శుక్రవారం కొన్నిచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం సీనియర్‌ అధికారి రాజారావు వెల్లడించారు. ఇక గత 24 గంటల్లో మహబూబాబాద్‌లో 5 సెంటీమీటర్ల అధిక వర్షపాతం నమోదైంది.

రాష్ట్రంలో గత పదేళ్లలో నమోదైన వర్షపాతం
––––––––––––––––––––––––––––––––––––––––––––––
ఏడాది            సాధారణంతో పోలిస్తే నమోదైన వర్షపాతం (శాతంలో)
––––––––––––––––––––––––––––––––––––––––––––––
2009            –35
2010            32
2011            –13
2012            4
2013            26
2014            –34
2015            –21
2016            19
2017            –13
2018            –2
2019            6

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top