మొక్కజొన్న రైతుకు ఆదిలోనే హంసపాదు | Farmers are plowing corn fields despite the lack of rain | Sakshi
Sakshi News home page

మొక్కజొన్న రైతుకు ఆదిలోనే హంసపాదు

Jun 29 2025 5:13 AM | Updated on Jun 29 2025 5:13 AM

Farmers are plowing corn fields despite the lack of rain

నిండా ముంచిన ‘ముందస్తు వర్షాలు’ అంచనా 

విధిలేక పొలాలను దున్నేస్తున్న వైనం

పాములపాడు: ‘ముందస్తు వర్షాలు’ అంచనాలను నమ్మిన మొక్కజొన్న రైతు మోసపోయాడు. వర్షం జాడ లేకపోవడం, వేసిన పైరులో ఎదుగుదల లో­పించడం, ప్రభుత్వం ఆదుకోకపోవడం రైతులను కలచివేస్తోంది. ఎంతో ఆశతో ఖరీఫ్‌ను ఆరంభించిన అన్నదాత ఆదిలోనే తీవ్ర నష్టం చవిచూడాల్సి వచ్చింది. వరుణుడు ముఖం చాటేయడం కళ్లెదుటే పైరు ఎండుదశకు చేరడంతో చేసేది లేక మొక్కజొన్న పైరును రైతన్నలు దున్నేస్తున్నారు. నంద్యాల జిల్లా పాములపాడు మండలంలో మొక్కజొన్న ప్రధాన పంట. ఖరీఫ్‌లో సుమారు 8వేల హెక్టార్లలో సాగవుతుంది. 

ఈ సంవత్సరం ముందస్తు వర్షాలు కురుస్తాయని, రుతుపవనాలు జూన్‌ మొదటి వారంలోనే ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ ప్రకటించడం విదితమే. మే నెల చివరి వారంలో ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. దీంతో అన్నదా­త­లు ఎంతో ఆశతో  మొక్కజొన్న, పత్తి సాగుకు సిద్ధ­మయ్యారు. అయితే జూన్‌ నెలాఖరు వరకు కూడా వర్షాల జాడలేకపోవడంతో రైతులు నిండా మునిగిపోయారు. 

ఎండలు తీవ్రంగా ఉండటం, గాలి విపరీతంగా వీస్తుండటంతో భూముల్లో తేమ శాతం తగ్గి­పోయింది. విత్తనాలు మొలకెత్తినా పంటలో ఎదుగుదల లేక పైర్లు వాడుపడుతున్నాయి. ఎకరా మొక్కజొన్న సాగుకు రైతులు రూ.15వేల వరకు ఖర్చు చేశారు. చేసేది లేక ఇప్పటికే సుమారు 50 శాతం పైగా రైతులు పొలాలను దున్నేస్తుండటం గమనార్హం. దీనిపై రైతుల అభిప్రాయాలు వారి మాటల్లోనే.. 

8 ఎకరాల్లో మొక్కజొన్న దున్నేశాం 
నేను మా అన్న విజేయుడు 8 ఎకరాల్లో మొక్కజొన్న పైరును దున్నేశాం. విత్తనాలు బాగా మొలిశాయి. పైరు బాగుందనుకున్నాం. ఈ సంవత్సరమైనా కష్టాలు తీరుతాయనుకున్నాం. తీరా చూస్తే వర్షాలు కురవకపోవడంతో మొక్కలు ఎండిపోతున్నాయి. పంట ఉంచినా లాభం ఉండదు. అం­దుకే పైరును దున్నేశాం. వర్షం పడితే మరో­సారి విత్తనం వేస్తాం.  – గడ్డం కాంతయ్య, రైతు, బానుముక్కల 

40 ఎకరాలు సిద్ధం చేసి ఉంచాం 
మొక్కజొన్న విత్తనం వేయడానికి 40 ఎకరాల పొలం సిద్ధం చేసి ఉంచాం. వర్షం కురిస్తే విత్తనం వేయడమే. ఆకాశంలో మబ్బులు వస్తు­న్నాయి కానీ.. వర్షం పడటం లేదు. విత్తనాలు, ఎరువులు అన్నీ తెచి్చపెట్టుకొని వర్షం కోసం ఎదురు చూస్తున్నాం. ప్రస్తుతం బోర్లలో ఉన్న నీరు ఎంతకూ సరిపోవు. ఇప్పటికే విత్తనం వేసిన వారు తీవ్రంగా నష్టపోయారు.  – కోట్ల నాగేశ్వరరెడ్డి, రైతు, పాములపాడు 

బాబు హయాంలో కరువే 
చంద్రబాబు, కరువు కవలలు అంటే ఏమో అనుకున్నాం. ఇప్పుడున్న పరిస్థితిని చూస్తే నిజమే అనిపిస్తుంది. ముందస్తు వర్షాలు మురిపించినా విత్తనం వేసిన తరువాత వరుణుడి జాడ లేకుండాపోయింది. కూటమి ప్రభుత్వానికి రైతులంటే చిన్నచూపు. ఆరుగాలం కష్టపడే అన్నదాతను ఏమాత్రం పట్టించుకోవడం లేదు.  – రాములు నాయక్, రైతు, క్రిష్ణానగర్‌ 

Advertisement
 
Advertisement
Advertisement