‘కృష్ణ పట్టె’లో భయం..భయం

Earth Tremor At Suryapet District - Sakshi

సూర్యాపేట జిల్లా చింతలపాలెం, మేళ్లచెరువు మండలాల్లో భూప్రకంపనలు

వారం రోజులుగా ఆందోళనలో ప్రజలు

సాక్షి ప్రతినిధి, సూర్యాపేట: స్వల్ప భూ ప్రకంపనలతో కృష్ణ పట్టె ప్రాంతంలోని మండలాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు. వారం రోజులుగా  కంపనాలు వస్తుండటంతో భారీ భూకంపం వస్తుందేమోనని ఆయా గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. సూర్యాపేట జిల్లాలోని మేళ్లచెరువు, చింతలపాలెం మండలాలను కృష్ణపట్టె మండలాలుగా పిలుస్తుంటారు. వీటి పరిధిలో సున్నపురాయి గనులు, సిమెంట్‌ ఫ్యాక్టరీలతో పాటు పులిచింతల ప్రాజెక్టు ఉంది. వందలాది ఎకరాల్లో తవ్వకాలతో ఇక్కడ సున్నపురాయిని వెలికితీస్తున్నారు.

ఈ నేపథ్యంలో వారం రోజులుగా చింతలపాలెం మండలంలోని చింతలపాలెం, గుడిమల్కాపురం, దొండపాడు, నెమలిపురి, కిష్టాపురం, మేళ్లచెరువు మండలంలోని.. మేళ్లచెరువు, రామాపురం, వేపలమాధారం గ్రామాల్లో రోజుకు రెండుమూడు సార్లు స్వల్ప కంపనాలు వస్తున్నా యి. ఇది భారీ భూకంపానికి  సంకేతమేమోనని ఆ గ్రామాల ప్రజలు చర్చించుకుంటున్నారు. దీనిపై జాయింట్‌ కలెక్టర్‌ సంజీవరెడ్డికి కూడా ప్రజలు ఫోన్లు చేశారు. ఈ ప్రాంతంలో రిక్టర్‌ స్కేల్‌ లేకపోవడంతో భూ కంపనాల విషయాన్ని ఎన్‌జీఆర్‌ఐకి చెబుతామని అధికారులు తెలిపారు.

ఆందోళన వద్దు 
స్వల్ప భూ కంపనాలు వస్తున్న విషయం పై తహసీల్దార్లు పూర్తి స్థాయిలో సమాచారం తీసుకుంటున్నారు. దీన్ని ఎన్‌జీఆర్‌ఐకి పంపిస్తాం. ప్రజలు ఆందోళన చెందవద్దు. అప్పుడప్పుడు భూమిలో సర్దుబాట్ల వల్ల స్వల్ప కంపనాలు వస్తుంటాయి. వీటి వల్ల ఎలాంటి నష్టమూ జరగదు. – డి.సంజీవరెడ్డి, జేసీ, సూర్యాపేట

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top