మందగించిన ‘కంటివెలుగు’

Doctor's Negligence Kanti Velugu Scheme Adilabad - Sakshi

ఆదిలాబాద్‌టౌన్‌: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ‘కంటి వెలుగు’ కార్యక్రమం ముందుకు సాగుతున్నా.. వైద్య పరీక్షలు చేయించుకున్న వారు శస్త్ర చికిత్సల కోసం ఎదురుచూడాల్సి వస్తోంది. దీంతో వారిచూపు మందగిస్తోంది. కంటి వెలుగు కార్యక్రమాన్ని ఆగస్టు 15న ప్రారంభించారు. నాలుగు నెలలు గడిచినా ఇంతవరకు జిల్లాలో ఒక్కరికి కూడా కంటి ఆపరేషన్‌ చేసిన దాఖలాలు లేవు. దీంతో బాధితులు ఆపరేషన్‌ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు. కాగా ఈ కార్యక్రమం ఫిబ్రవరిలో ముగియనుంది. జిల్లాలో 7లక్షల 8వేల మందికి కంటి పరీక్షలు చేయాల్సి ఉండగా, ఇప్పటి వరకు 2లక్షల 49వేల మందికి మాత్రమే పరీక్షలు జరిపారు. గడువులోగా పరీక్షలు పూర్తవ్వడం గగనంగానే కనిపిస్తోంది.

జిల్లాలోని 18 మండలాల్లో 18 బృందాలతో కంటి వెలుగు కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మొత్తం 7లక్షల 8వేల మంది ఉండగా, ఇప్పటి వరకు 2లక్షల 49వేల 88 మందికి కంటి పరీక్షలు చేశారు. ఇందులో పురుషులు 1లక్ష 12వేల 120 మంది ఉండగా, మహిళలు 1లక్ష 36వేల 950 ఉన్నారు. దాదాపు 40 శాతం వరకు మాత్రమే లక్ష్యం పూర్తయినట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి వరకు ఈ కార్యక్రమం కొనసాగనుంది. అప్పటిలోగా అందరికి కంటి పరీక్షలు జరిగేనా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇంకా 4లక్షల 50వేల మంది వరకు కంటి పరీక్షలు చేయాల్సి ఉంది. అయితే అధికారుల లెక్కల ప్రకారం మరో లక్ష మంది వరకు మాత్రమే కంటి సమస్యలతో బాధపడుతున్నట్లు అంచనా వేస్తున్నారు.

కళ్లాద్దాల పంపిణీలోనూ జాప్యమే.. 
పరీక్షలు పూర్తిచేశాక కంటి సమస్యతో బాధపడుతున్న వారికి కంటి అద్దాలు పంపిణీ చేయాల్సి ఉంటుంది. అయితే జిల్లాలో బాధితులకు అద్దాల పంపిణీలోనూ తీవ్ర జాప్యం జరుగుతోంది. ఇప్ప టి వరకు 44,035 మందికి రీడింగ్‌ అద్దాలు పంపి ణీ చేశారు. అలాగే దూరపు, దగ్గరి చూపునకు సంబంధించిన కంటి అద్దాలు 27,428 పంపిణీ చేయాల్సి ఉండగా, ఇప్పటివరకు 7,215 మందికి మాత్రమే పంపిణీ చేశారు. దాదాపు 20వేల మందికి ఇంకా పంపిణీ కావాల్సి ఉంది. కంటి పరీక్షలు చేయించుకున్న వీరు కంటి అద్దాల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.
 
శస్త్రచికిత్స సంగతేంటి? 
పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో కంటి వెలుగు కార్యక్రమం ద్వారా కంటి పరీక్షలు చేయించుకున్న వారిలో కొంత మందికి శస్త్ర చికిత్సలు అవసరం కాగా, ఇప్పటివరకు ఏ ఒక్కరికి సైతం శస్త్ర చికిత్స చేసిన దాఖలాలు లేవు. కేవలం కంటి పరీక్షలకే పరిమితమవుతున్నట్లు తెలుస్తోంది. కంటి సమస్యతో బాధపడుతున్న 25,447 మందిని శస్త్ర చికిత్సల కోసం వివిధ ఆస్పత్రులకు రిఫర్‌ చేయగా, ఎక్కడ కూడా ఇప్పటివరకు ఆపరేషన్‌ చేయలేదు. కంటి సమస్యతో బాధపడుతున్న వారు అధికారులను ఆపరేషన్‌ ఎప్పుడు చేస్తారని అడిగితే దాటవేస్తున్నారని చెబుతున్నారు.

లక్ష్యం పూర్తయ్యేనా.. 
ఫిబ్రవరిలోగా కంటి వెలుగు కార్యక్రమ లక్ష్యం పూర్తవ్వడం అనుమానంగానే కనిపిస్తుంది. ఈ కార్యక్రమాన్ని ఆగస్టులో ప్రారంభించగా జిల్లాలో 50 శాతానికి కూడా లక్ష్యం చేరుకోలేదు. మరో 60 రోజుల్లో వంద శాతం కంటి పరీక్షలు చేసేలా పరిస్థితులు కనిపించడం లేదు. ప్రభుత్వ సెలవులు, పండుగ రోజుల్లో ఈ శిబిరాలకు సెలవు ఉండడంతో ప్రక్రియ ముందుకు సాగడం లేదు. కాగా గడిచిన నాలుగు నెలల్లో 2లక్షల 49వేల మందికి పరీక్షలు జరిపారు. ఇంకా 4లక్షల 50వేల వరకు పరీక్షలు చేయాల్సి ఉంది.  మార్చిలో కంటి ఆపరేషన్లు కంటి వెలుగు కార్యక్రమం ద్వారా జిల్లాలో 2.60లక్షల మందికి కంటి పరీక్షలు చేశాం. శస్త్ర చికిత్సలు అవసరమైన వారికి 2019 మార్చి మొదటి వారంలో చేయిస్తాం. ఫిబ్రవరి చివరి వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. 80 శాతం వరకు స్క్రీనింగ్‌ పూర్తవుతుంది. ఈ అవకాశాన్ని ప్రజలు వినియోగించుకోవాలి. – రాజీవ్‌రాజ్, డీఎంహెచ్‌వో, ఆదిలాబాద్‌ 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top