నిరాశే.. | Disappointment people central district budget | Sakshi
Sakshi News home page

నిరాశే..

Mar 1 2015 2:47 AM | Updated on Aug 14 2018 10:51 AM

కేంద్ర బడ్జెట్ జిల్లా ప్రజలకు నిరాశే మిగిల్చింది. జిల్లాలో ఉన్న రెండు పెద్ద ప్రాజెక్టులకు సంబంధించిన ప్రస్తావన బడ్జెట్‌లో లేకపోవడం అటు రాజకీయ పక్షాలు,

 సాక్షి ప్రతినిధి, నల్లగొండ : కేంద్ర బడ్జెట్ జిల్లా ప్రజలకు నిరాశే మిగిల్చింది. జిల్లాలో ఉన్న రెండు పెద్ద ప్రాజెక్టులకు సంబంధించిన ప్రస్తావన బడ్జెట్‌లో లేకపోవడం అటు రాజకీయ పక్షాలు, ఇటు ప్రజల్లోనూ చర్చనీయాంశమవుతోంది. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ఆలిండియా మెడికల్ సెన్సైస్ (ఎయిమ్స్) ఆస్పత్రి వస్తుందని, ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పిస్తే జిల్లాలో 2.27లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని ఆశించిన ప్రజానీకం ఉసూరుమంది. ఈ బడ్జెట్‌లో తీసుకున్న నిర్ణయాలపై మిశ్రమ స్పందన వస్తుండగా, జిల్లాకు చెందిన ఈ రెండు ప్రాజెక్టులపై మాత్రం రాజకీయ నాయకులు కూడా పెదవి విరుస్తున్నారు. ఈ బడ్జెట్‌తో ప్రజానీకానికి పెద్దగా ఒరిగేదేమీ లేదని, పాత సారాను కొత్త సీసాలో పోసి అమ్మినట్టుగానే ఉందని ప్రతిపక్ష పార్టీల నేతలంటున్నారు.
 
 వచ్చే ఏడాది అయినా...
 ఆలిండియా మెడికల్ సెన్సైస్ (ఎయిమ్స్)కు ఈ బడ్జెట్‌లో మోక్షం కలుగుతుందని జిల్లా వాసులు భావించారు. ఈ అంశానికి సంబంధించి ఇటీవల సీఎం కేసీఆర్ జరిపిన పర్యటనతో ప్రాధాన్యం ఏర్పడింది. వాస్తవానికి గతంలో జిల్లాకు మంజూరు చేసిన నిమ్స్ స్థానంలో ఎయిమ్స్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర విభజన సమయంలో చేసిన చట్టంలో పేర్కొన్న ప్రకారం తెలంగాణకు ఎయిమ్స్ మంజూరు చేయాల్సి ఉంది. తెలంగాణ ప్రభుత్వం జిల్లాను ఎంచుకుని గత నెలలో కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల్లోని ఇతర స్థలాలను కూడా పరిశీలించి మరీ జిల్లాను ఎంపిక చేసినట్టు ప్రకటించింది. దీంతో ఈ బడ్జెట్‌లో ఎయిమ్స్ ఖాయమని అనుకున్నారంతా.
 
 కానీ... కేంద్రం కొత్తగా ప్రకటించిన ఐదు ఎయిమ్స్‌ల్లో తెలంగాణ పేరు లేదు. అయితే, పునర్వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న అన్ని అంశాలను, ఆ సమయంలో ఇచ్చిన అన్ని హామీలను నెరవేరుస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ తన బడ్జెట్ ప్రసంగంలో చెప్పడం కొంత ఉపశమనాన్ని కలిగించింది. వచ్చే ఏడాది అయినా ఎయిమ్స్ ఆసుపత్రి వస్తుందనే ఆశలు కల్పించింది. ఇక, ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించే అంశం ఎప్పటి నుంచో పరిశీలనలో ఉంది. ఈ ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించడం ద్వారా  కొత్త రాష్ట్రానికి మేలు చేస్తారని అందరూ అనుకున్నారు. కానీ ఈ అంశం అరుణ్‌జైట్లీ బడ్జెట్ సూట్‌కేసులో లోక్‌సభకు రాలేదు. దీంతో ఈ ప్రాజెక్టుకు సంబంధించి జిల్లాలో సాగవుతుందని భావిస్తున్న 2.27లక్షల ఎకరాలకు సాగునీరు కొంత జాప్యం కానుంది.
 
 ఎయిమ్స్ వస్తుందనుకున్నాం : ఎంపీ గుత్తా
 ఈ బడ్జెట్‌లో తెలంగాణకు ఎయిమ్స్ ప్రకటిస్తారని అనుకున్నాం. కానీ, కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం నిరాశనే మిగిల్చింది. గతంలో ఉన్న రెండు యూపీఏ ప్రభుత్వాలు అమలు చేసిన పథకాలనే బడ్జెట్‌లో కొనసాగించారు తప్ప కొత్తగా చేపట్టిన పథకాలేవీ కనిపించలేదు. గతంలో ప్రాణహిత- చేవెళ్లకు జాతీయ హోదా కల్పించేందుకు యూపీఏ ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించింది. ఇప్పుడు దానిని అధికారికం చేస్తే బాగుండేది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement