‘ధర’ఖాస్తులు గందరగోళం | Sakshi
Sakshi News home page

‘ధర’ఖాస్తులు గందరగోళం

Published Thu, Oct 30 2014 3:44 AM

‘ధర’ఖాస్తులు గందరగోళం - Sakshi

ముకరంపుర :
 ఆహారభద్రత కార్డులు, సామాజిక పింఛన్ల దరఖాస్తుల ప్రక్రియ గందరగోళంగా మారింది. ముందస్తు ప్రచారం లేకుండానే పట్టణాలు, నగరాల్లో బుధవారం నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించడం ప్రజలను అయోమయానికి గురిచేసింది. కౌంటర్లకు సంబంధించిన సమాచారం లేకపోవడం, కనీస ఏర్పాట్లు చేయకపోవడం కారణంగా జనం తీవ్ర ఇబ్బందులుపడ్డారు. ముందుగా నవంబర్ ఒకటి నుంచి 7వ తేదీ వరకు పట్టణాలు, నగరాల్లో దరఖాస్తులు స్వకరించనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.

తీరా ఈ నెల 29 నుంచి నవంబర్ ఒకటో తేదీ వరకు నాలుగు రోజుల్లో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ పూర్తి చేయాలని మంగళవారం రాత్రి ఆగమేఘాలపై ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు జిల్లా అధికారులు హడావుడిగా బుధవా రం నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించా రు. కరీంనగర్, రామగుండం కార్పొరేషన్లు, జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి, సిరిసిల్ల మున్సిపాలిటీలు, హుజూరాబాద్, హుస్నాబాద్, జమ్మికుంట, పెద్దపల్లి, వేములవాడ నగరపంచాయతీల్లోని వంద డివిజన్లు, 226 వార్డుల్లో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు.

క్షేత్రస్థాయిలో ముందస్తు ప్రణాళికా లోపంతో పలుచోట్ల కేంద్రాలను అప్పటికప్పుడు మార్చారు. దీంతో కేంద్రాలు ఎక్కడున్నాయో తెలియక ప్రజలు ఆగమయ్యారు. తెల్లకాగితంపై దరఖాస్తు చేసుకోవచ్చని కలెక్టర్ వీరబ్రహ్మయ్య స్పష్టం చేసినప్పటికీ క్షేత్రస్థాయిలో సిబ్బంది అందుకు భిన్నం గా వ్యవహరించారు. దరఖాస్తులకు ధ్రువీకరణపత్రాల జిరాక్స్, ఆధార్ జిరాక్స్ జతచేయాలనడంతో పాటు నిర్ణీత ఫార్మాట్‌లోనే అందజేయాలనడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.

ఆధార్‌కార్డుల జిరాక్స్‌లు, దరఖాస్తు ఫారాల కోసం జిరాక్స్ సెంటర్ల వైపు పరుగులు తీశారు. ఇదే అదునుగా నిర్వాహకులు జిరాక్స్‌కు రూ.2 నుంచి రూ.5, దరఖాస్తులకు రూ.5 నుంచి రూ.10 చొప్పున వసూలు చేశారు. చాలాచోట్ల కార్పొరేటర్లు, కౌన్సిలర్లే ముందుండి దరఖాస్తుల సమర్పణలో సాయపడ్డారు. ఇంటింటికి వెళ్లి దరఖాస్తులు ఇవ్వాలంటూ ప్రచారం చేశారు. పూర్తి స్థాయిలో ప్రచారం లేనప్పటికీ ఆయా డివిజన్లు, వార్డుల్లో కేంద్రాలు ఏర్పాటు చేయడంతో ఆ నోటా ఈ నోటా విని సాయంత్రం వరకు నాలుగో వంతు దరఖాస్తులు అందజేశారు.

కేంద్రాల ఏర్పాటులో గందరగోళం ఏర్పడడంతో పలు ప్రాంతాల్లో దరఖాస్తుల స్వీకరణ ఆలస్యంగా ప్రారంభమైంది. సెంటర్ల వద్ద కనీస సౌకర్యాలు లేకపోవడంతో దరఖాస్తులు స్వీకరించే సిబ్బంది, ప్రజలు ఇబ్బందులు చెట్ల కిందనే ఇబ్బందులుపడ్డారు. వృద్ధులు, వికలాంగులకు తిప్పలు తప్పలేదు.

     కరీంనగర్ కార్పొరేషన్‌లోని 50 డివిజన్లలో కేంద్రాలు ఏర్పాటు చేశారు. సాయంత్రం వరకు అరకొరగానే దరఖాస్తులు వచ్చాయి. ముందస్తు ప్రచారలోపంతో ప్రజలు గందరగోళానికి గురయ్యారు. అప్పటికప్పుడు తెలుసుకోవడంతో దరఖాస్తుల కోసం పరుగులు తీశారు. తెల్లకాగితం కాకుండా ప్రింటె డ్ ఫార్మాట్, ధ్రువీకరణ జిరాక్స్‌లు తప్పనిసరని పేర్కొనడంతో ప్రజలు ఇక్కట్లు పడ్డారు. ప్రతి సెంటర్‌కు ఒక మున్సిపల్‌సిబ్బందితో పాటు ఇద్దరు ఆర్‌పీలను కేటాయించగా ఆర్‌పీలు సరిగా హాజరు కాకపోవడంతో కార్పొరేటర్లే ప్రత్యామ్నాయ మార్గాలతో ప్రజలకు సహకరించారు.

     రామగుండం కార్పొరేషన్‌లోని 50 డివిజన్లలో కేంద్రాలు మధ్యాహ్నం వరకు ప్రారంభం కాకపోవడంతో దరఖాస్తుల స్వీకరణ ఆలస్యమయ్యింది. కేంద్రాలకు అంగన్‌వాడీ కార్యకర్తలు గైర్హాజరు కావడంతో సిబ్బంది లేక ఇబ్బందులుపడ్డారు. కేంద్రాలను ఉదయం నుంచి అప్పటికప్పుడే ఏర్పాటు చేయడంతో అవి ఎక్కడున్నాయో తెలియక ఇబ్బందులుపడ్డారు. అధికారుల మధ్య సమన్వయ లోపం కనిపించింది. కార్పొరేషన్ పాలకవర్గం పిక్నిక్ వెళ్లి అందుబాటులో లేకపోవడంతో పట్టించుకునే వారు కరువయ్యారు. జిరాక్స్ సెంటర్ల నిర్వాహకులు రూ.5 నుంచి రూ.10 చొప్పున ప్రజల నుంచి దోచుకున్నారు.

కొంతమంది కార్పొరేటర్లు తమకు అనుకాలమైన వారితో దరఖాస్తు ఫారాలకు డబ్బులు వసూలు చేశారు. 24వ డివిజన్‌లో కనీస సౌకర్యాలు లేకపోడంతో ఆ డివిజన్ కార్పొరేటర్ కుంట సాయి స్పందించి స్వయంగా టెంటు, కుర్చీలు, బల్లలను ఏర్పాటు చేయించాడు. దరఖాస్తుదారుల వివరాలను నమోదు చేయడానికి సరిపడ నోట్‌పుస్తకాలు లేకపోడంతో 18వ డివిజన్ కార్పొరేటర్ తోట అనసూర్య కుమారుడు తోట వేణు తమ డివిజన్‌లో తన స్వంత ఖర్చులతో కొనుగోలు చేసి ఇచ్చాడు.

     హుస్నాబాద్‌లో 20 వార్డులుండగా ప్రచారలోపంతో దరఖాస్తులు అరకొరగానే వచ్చాయి. కేంద్రాలను ఆలస్యంగా ప్రారంభించారు. ప్రజలను దరఖాస్తులు చేసుకోవాలంటూ కౌన్సిలర్లు వాడవాడలా ప్రచారం చేయడం, దరఖాస్తులు నింపడం కనిపించింది.

     హుజురాబాద్‌లో 20 వార్డులు, జమ్మికుంటలో 20 వార్డులున్నాయి. గతంలో నిర్ణయించిన కేంద్రాలు కాకుండా ఉదయం హడావుడిగా కేంద్రాలు ఏర్పాటు చేశారు. పాఠశాలల్లో చెట్లకింద దరఖాస్తులు స్వీకరించారు. కౌన్సిలర్లే ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అన్ని రకాల సర్టిఫికెట్లు అడగడంతో జనాలు ఇబ్బందులుపడ్డారు.

   సిరిసిల్లలోని 33 వార్డులలో కేంద్రాలు ఏర్పాటు చేయడంలో విఫలమయ్యారు. కౌన్సిలర్ల ఇళ్ల వద్దే కౌంటర్లు ఏర్పాటు చేశారు. ప్రజల్లో పూర్తిస్థాయిలో ప్రచారం లేదు. ఇక్కడ కూడా జిరాక్స్‌లు తప్పనిసరిగా తీసుకున్నారు.

   పెద్దపల్లిలోని 20 వార్డులలో కేంద్రాలు ఏర్పాటు చేయగా ధ్రువీకరణ పత్రాల జిరాక్స్‌లు తీసుకోవడంతో ప్రజలపై అదనపు భారం పడింది.

   వేములవాడలోని 20 వార్డుల్లో ప్రచారలోపంతో కేంద్రాలు వెలవెలబోయాయి. తొలిరోజు అరకొర దరఖాస్తులే వచ్చాయి.

   కోరుట్లలోని 31 వార్డులలో కౌంటర్లు ఏర్పాటు చేయగా కౌన్సిలర్లే ప్రధాన పాత్ర పోషించారు. ప్రింటెడ్ ఫారాలను జిరాక్స్ సెంటర్లలో విక్రయించారు.  

     జగిత్యాలలోని 38 వార్డులుండగా, రాత్రికి రాత్రి అధికారులు కౌన్సిలర్లతో మీటింగ్ పెట్టి ప్రజలకు తెలియజేయాలని కోరారు. కౌన్సిలర్లు అప్రమత్తమై ప్రజలకు కొంతమేర సమాచారాన్ని అందించారు. సెంటర్లు సైతం సక్రమంగా ఏర్పాటు చేయలేదు. ఇళ్లల్లోనే గద్దెలపై కూర్చుని దరఖాస్తులను స్వీకరించారు.  
     మెట్‌పల్లిలోని 24 వార్డులలో ఆధార్ నెంబర్‌కోసం జనం తిప్పలుపడ్డారు.
 దరఖాస్తులు  అమ్మడం సిగ్గుచేటు
 - మామిడాల చంద్రయ్య, మాజీ కౌన్సిలర్, రామగుండం

 5వ డివిజన్‌లో ఐదు రూపాయల చొప్పున దరఖాస్తులు అమ్మారు. తెల్లకాగితం మీద దరఖాస్తులు స్వీరించాల్సింది పోయి ఫారాలు అమ్మకం ద్వారా సొమ్ము చేసుకోవడం సిగ్గుచేటు. ఇలా ప్రజలను ఇబ్బందులకు గురిచేయడం తగదు. అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలి.
 
 తొలిరోజు పట్టణాలు, నగరాలు, కార్పొరేషన్లలో ఆహారభద్రత, పెన్షన్ల దరఖాస్తులిలా..
 
 పట్టణం, నగరం     ఆహారభద్రత         పెన్షన్లు
 కరీంనగర్             16404            5637
 రామగుండం         13127           5151
 జగిత్యాల               11533           3844
 కోరుట్ల                    6224           1608
 మెట్‌పల్లి                 6094           2836
 సిరిసిల్ల                   3940           3580
 వేములవాడ            4629          1595
 హుస్నాబాద్           1605          1019
 జమ్మికుంట             2131            920
 హుజూరాబాద్          2128            845
 పెద్దపల్లి                    3876         1434
 మొత్తం                  71691       28469
 - ముకరంపుర

Advertisement
Advertisement