రాష్ట్ర డెరైక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు(డీజీపీ) నియామకం కోసం నవంబర్ 9న తుది జాబితా వెల్లడికానుంది.
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర డెరైక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు(డీజీపీ) నియామకం కోసం నవంబర్ 9న తుది జాబితా వెల్లడికానుంది. అందుకోసం 9న యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) కమిటీ భేటీ కానుంది. ఐదుగురు సభ్యులు ఉండే ఈ కమిటీలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూడా ఉంటారు. ఈ నేపథ్యంలో 9న జరిగే సమావేశానికి హాజరు కావాల్సిందిగా సీఎస్ రాజీవ్‌శర్మకు ఢిల్లీ నుంచి పిలుపు వచ్చింది. నిబంధనల మేరకు రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 11న ఐదుగురు సీనియర్ అధికారులతో కూడిన జాబితాను కేంద్ర హోంశాఖకు పంపింది. వీరిలో రాష్ట్ర తాత్కాలిక డీజీపీ అనురాగ్‌శర్మతో పాటు నేషనల్ పోలీసు అకాడమీ డెరైక్టర్ అరుణా బహుగుణ, ఏసీబీ డీజీ ఏకే ఖాన్, సీఆర్‌పీఎఫ్ డీజీ కె.దుర్గా ప్రసాద్, ఎస్పీఎఫ్ డీజీ తేజ్‌దీప్ కౌర్‌మీనన్ ఉన్నారు.
అలాగే వీరి పనితీరును వివరించే వార్షిక రహస్య నివేదిక (ఏసీఆర్)లను రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర హోంశాఖకు అందజేసింది. ఈ నివేదికలను హోంశాఖ యూపీఎస్సీకి పంపించింది. అనంతరం వాటిని పరిశీలించిన యూపీఎస్సీ మళ్లీ అనురాగ్‌శర్మ, అరుణా బహుగుణ, దుర్గాప్రసాద్‌ల ఏసీఆర్ నివేదికలను కోరింది. అక్టోబర్ 1న ఈ ముగ్గురి ఏసీఆర్‌లను రాష్ట్ర ప్రభుత్వం పంపింది. యూపీఎస్సీ కమిటీ నవంబర్ 9న భేటీ అనంతరం డీజీపీ ఎంపిక కోసం ముగ్గురి పేర్లతో కూడిన జాబితాను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేయనుంది. రాష్ట్ర ప్రభుత్వం తన నిర్ణయాధికారం మేరకు వారిలో ఒకరిని డీజీపీగా నియమించనుంది. అయితే తాత్కాలిక డీజీపీగా కొనసాగుతున్న అనురాగ్‌శర్మకే పూర్తిస్థాయి బాధ్యతలు లభించే అవకాశముందని తెలుస్తోంది.