ఎక్కడ వేసిన గొంగళి అక్కడే! | delay process of construction of new buildings Anganwadi centers | Sakshi
Sakshi News home page

ఎక్కడ వేసిన గొంగళి అక్కడే!

Jan 27 2017 1:36 AM | Updated on Mar 19 2019 6:19 PM

రాష్ట్రంలో గ్రామ పంచాయతీలు, అంగన్‌వాడీ కేంద్రాలకు కొత్త భవనాల నిర్మాణ ప్రక్రియ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉంది.

నిధులున్నా ముందుకు సాగని పంచాయతీ, అంగన్‌వాడీ భవనాల నిర్మాణం
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో గ్రామ పంచాయతీలు, అంగన్‌వాడీ కేంద్రాలకు కొత్త భవనాల నిర్మాణ ప్రక్రియ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉంది. గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా రూ.300 కోట్ల ఉపాధి హామీ నిధులను ప్రభుత్వం మంజూరు చేసి ఏడాదైనా దాదాపు ఏ జిల్లాలోనూ భవన నిర్మాణ పనులు ముందుకు సాగడం లేదు. వాస్తవానికి ఒక్కో గ్రామ పంచాయతీ భవనానికి రూ.13 లక్షల చొప్పున మొత్తం వెయ్యిభవనాలకు రూ.130 కోట్లు, కొత్త అంగన్‌వాడీ కేంద్రాల నిర్మాణం నిమిత్తం ఒక్కోదానికి రూ.5 లక్షల చొప్పున 2,263 భవనాలకు రూ.113.15 కోట్లు కేటాయించారు.

నిర్మాణం ప్రారంభించి అసంపూర్తిగా వదిలేసిన 1,436 అంగన్‌వాడీ కేంద్రాలకూ ఒక్కోదానికి రూ.4లక్షల చొప్పున రూ.57.44 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసింది. మొత్తంగా రూ.300.59 కోట్ల నిధులున్నా, భవన నిర్మాణ పనులు అడుగు ముందుకు పడడం లేదు. కొన్ని ప్రభుత్వ శాఖల అధికారుల మధ్య సమన్వయం కొరవడటమే ఇందుకు ప్రధాన కారణమని తెలుస్తోంది.

నిధులున్నా పనులు సున్నా: అంగన్‌వాడీ కేంద్రాలకు నూతన భవన నిర్మాణాలకుగాను ఉపాధిహామీ నిధుల నుంచి గ్రామీణాభివృద్ధి శాఖ ఒక్కో భవనానికి రూ.5లక్షలు కేటాయించగా, మహిళా శిశు సంక్షేమ శాఖ తన వాటాగా ఒక్కో కేంద్రానికి రూ.3 లక్షలు మంజూరు చేయాలి. నిధుల మంజూరులో గ్రామీణాభివృద్ధి శాఖ స్పందించిన రీతిలో మహిళా, శిశు సంక్షేమ శాఖ స్పందించడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాగా ఆయా నిర్మాణ పనులను పంచాయతీరాజ్‌ ఇంజనీరింగ్‌ విభా గం చేయాల్సి ఉండగా, పర్యవేక్షణ బాధ్యతలను గ్రామ సర్పంచులకు అప్పగించారు.

మొత్తంగా ఆయా విభాగాల అధికారులు, సిబ్బంది సమష్టి్టగా బాధ్యత వహించకపోవడం, కొన్నిచోట్ల అధికారులు ముందుకు వచ్చినా స్థానికంగా రాజకీయ జోక్యం పెరగడంతో భవన నిర్మాణాలు పూర్తికాక ప్రభుత్వం ఆశించిన మేరకు ప్రయోజనం చేకూరడం లేదు. వివిధ శాఖల ఉన్నతాధికారులు, ప్రభుత్వ పెద్దలు ఈ విషయంపై దృష్టిసారించి భవన నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement