సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల పూర్తికి భూ సేకరణ అడ్డంకిగా మారింది. గతంలో భూ సేకరణ జరగక ప్రాజెక్టుల పరిధిలో అంచనాలు పెంచాల్సిన పరిస్థితి తలెత్తిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అదనపు ధరలు చెల్లించేందుకు సిద్ధమైన ప్రాజెక్టుల ప్యాకేజీల్లో కూడా భూ సేకరణలో జాప్యం జరగడంతో గడువు పెంచాల్సిన అవసరం ఏర్పడుతోంది. దీంతో మొత్తంగా 51 ప్యాకేజీల పరిధిలో మరో 21,633 ఎకరాల మేర భూ సేకరణ చేయాల్సి ఉండటంతో ఈ ప్యాకేజీలను పూర్తి చేసేందుకు వచ్చే ఏడాది జూన్ వరకు గడువు పొడిగించారు. అయితే చాలా చోట్ల కోర్టు కేసులు ఉండటం, కొన్నిచోట్ల రైతుల నుంచి వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో గడువులోగా ప్రాజెక్టుల్లోని ప్యాకేజీల పూర్తి గగనంగా మారనుంది.  
మళ్లీ ‘భారం’తప్పదా?
భూ సేకరణ జరగకపోవడం, అటవీ అనుమతులు లేకపోవడంతో ప్రాజెక్టుల నిర్మాణ గడువు పెరగడం, దీనికి అనుగుణంగా స్టీలు, సిమెంట్, ఇంధన ధరలు, కార్మికుల వ్యయం, యంత్ర పరికరాల ధరలు, ఇసుక, కంకర వంటి ఇతర మెటీరియల్స్ ధరలు పెరిగాయి. దీంతో కాంట్రాక్టర్లపై భారం పెరిగి.. వారు పనులు ఆపేసే పరిస్థితి తలెత్తింది. ఈ నేపథ్యంలో భూ సేకరణ, రీ ఇంజనీరింగ్, చట్టపరమైన అనుమతులు వంటి సహేతుక కారణాలతో ఎక్కడైనా ప్రాజెక్టుల పనులు ఆలస్యమైన చోట అదనపు ధరల చెల్లింపు (ఎస్కలేషన్) చేసేందుకు ప్రభుత్వం రెండున్నరేళ్ల కింద ముందుకొచ్చింది. రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న 25 భారీ, మధ్య తరహా ప్రాజెక్టుల్లోని 116 ప్యాకేజీల్లో ధరల పెరుగుదలకు అనుగుణంగా అదనపు చెల్లింపులు చేయడానికి జీవో 146లో ప్రభుత్వం అవకాశం కల్పించింది.
ఈ జీవో కారణంగా ప్రభుత్వంపై సుమారు రూ.2,500 కోట్ల మేర భారం పడింది. ఇందులో వివిధ కారణాలతో 33 ప్యాకేజీలను తొలగించగా, 83 ప్యాకేజీలను ఎస్కలేషన్ పరిధిలో చేర్చారు. 83 ప్యాకేజీల్లో 36 ప్యాకేజీలను గతేడాది నవంబర్ నాటికే పూర్తి చేయాల్సి ఉన్నా, భూ సేకరణలో ఇబ్బందులతో పనులు పూర్తి కాలేదు. ఈ ప్యాకేజీల పరిధిలో 24,002 ఎకరాలు అవరసరం కాగా.. ఇంకా 17,025 ఎకరాల మేర భూ సేకరణ మిగిలే ఉంది. మరో 15 ప్యాకేజీలను ఈ జూన్‌కే పూర్తి చేయాల్సి ఉండగా.. అక్కడా మరో 4,500 ఎకరాల సేకరణ జరగకపోవడంతో ఆ పనులు పూర్తికాలేదు. పొడిగించిన గడువులోగా పనులు పూర్తి కాకుంటే.. ప్రభుత్వంపై మళ్లీ భారం పడే అవకాశం ఉంది.
మరో 11.79 లక్షల ఎకరాలు
మొత్తం 51 ప్యాకేజీల కింద 18.18 లక్షల ఎకరాలు ఆయకట్టు ఉండగా.. ఇందులో 6.39 లక్షల ఎకరాల ఆయకట్టు వృద్ధిలోకి వచ్చింది. మరో 11.79 లక్షల ఎకరాలు సాగులోకి రావాల్సి ఉంది. ప్రస్తుతం భూ సేకరణ ఆలస్యం కారణంగా 5 లక్షల ఎకరాలపై నేరుగా ప్రభావం పడుతోంది.
దేవాదుల పరిధిలో 5 వేల ఎకరాలు
ప్రధానంగా కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్ పరిధిలోనే 19 ప్యాకేజీల పరిధి లో 3,200 ఎకరాల మేర అవసరం ఉండగా, 2,300 ఎకరాల సేకరణ జరగలేదు. అత్యధికంగా కల్వకుర్తి పరిధిలో 1,450 ఎకరాలు సేకరించాల్సి ఉంది. దీంతో ఈ ప్రాజెక్టుల పరిధిలో పనులన్నింటినీ వచ్చే ఏడాది జూన్ వరకు పొడి గించారు. దేవాదుల, సింగూరు పరిధిలో నీటి విడుదల జరుగుతున్న కారణంతో భూ సేకరణ ప్రక్రియ నిలిచిపోయింది. దేవాదుల పరిధిలోని 10 ప్యాకేజీల్లో ఏకంగా 5 వేల ఎకరాల భూ సేకరణ పూర్తికాలేదు. కొన్ని చోట్ల భూపరిహారంపై రైతుల నుంచి వ్యతిరేకత వస్తోంది. ప్రభుత్వ పరిహారంకన్నా అధికంగా డిమాండ్ చేస్తున్న కారణంతో సేకరణ జరగడం లేదు.

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
