ఈసారైనా పెరిగేనా..!   

Decreasing Degree Admissions - Sakshi

 నేలచూపు చూస్తున్న డిగ్రీ ప్రవేశాలు

నేటితో ముగుస్తున్న గడువు

ఐదోసారి దోస్త్‌ ప్రవేశాలకు అవకాశం

రేపు సీట్ల కేటాయింపు

ఎంసెట్‌తో సహా వివిధ కోర్సుల కౌన్సిలింగ్‌ పూర్తి

డిగ్రీ వైపునకు వచ్చే అవకాశాలు

పోటీ పడుతున్నప్రయివేటు కళాశాలలు

శాతవాహనయూనివర్సిటీ : అర్హులైన విద్యార్థులకు డిగ్రీ కళాశాలల్లో సీటు వచ్చేవిధంగా దోస్త్‌ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. గతంలో ఎన్నడూ ఎరగని రీతిలో పలుమార్లు ప్రవేశాలకు అవకాశమిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ యూనివర్సిటీల్లో భారీగా మిగులుతున్న సీట్లును భర్తీచేయాలనే ఉద్దేశంతో ఐదోసారి దోస్త్‌ ద్వారా కొత్తవారికి, గతంలో నమోదు చేసుకున్న వారికి కళాశాల మార్పిడి, అంతర్గత కోర్సుల మార్పిడికి అవకాశమిస్తున్నారు.

శాతవాహనయూనివర్సిటీ పరిధిలో 45,471 సీట్లుండగా నాలుగు దశల్లో 20,350 సీట్లు భర్తీ అయ్యాయి. 25,121 మిగులు సీట్లతో డిగ్రీప్రవేశాలు నేలచూపు చూస్తున్నాయి. ఐదోదశలో ప్రవేశాలకు అవకాశమివ్వడంతో రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీలతో పాటు శాతవాహనలో కూడా ప్రవేశాలు పెరిగే అవకాశముండొచ్చని విద్యావేత్తలు భావిస్తున్నారు. 16 తేదీతో నమోదు, వెబ్‌ ఆప్షన్లు పూర్తవనుండడంతో ప్రవేట్‌ కళాశాలలు దీనినే చివరి అవకాశంగా భావించి పోటీపడుతున్నారు. మరికొంతమంది విద్యార్థులు కళాశాలలో సదుపాయాలు పరిశీలించి మారడానికి మొగ్గుచూపుతున్నట్లు సమాచారం.  ఇదే జరిగితే దాదాపు మూడు వేల సీట్ల వరకు మార్పులు చేర్పులు జరుగుతాయనేది అంచనా. 

పెరగనున్న సీట్ల భర్తీ ... 

దోస్త్‌ అధికారులు డిగ్రీసీట్ల భర్తీని పెంచడానికి గతంలో ఎన్నడూ కనివిని ఎరగని అవకాశాలు అందిస్తున్నారు. ఈ నెల 14 నుంచి 16వరకు డిగ్రీ ప్రవేశాలకు నమోదు, వెబ్‌ఆప్షన్లకు అవకాశం కల్పించారు. ఇప్పటికే ఇంజినీరింగ్‌ ప్రవేశ కౌన్సెలింగ్, సీట్ల కేటాయింపు కూడా పూర్తయింది. దీంతో ఆయా కోర్సుల్లో సీటు రాని వారు ఇటువైపుగా వచ్చే అవకాశముంది. 

ఇదీ పరిస్థితి..

వర్సిటీలో నాలుగేళ్లుగా డిగ్రీ ప్రవేశాలు తిరోగమనంలోనే ఉంటున్నాయి. కొన్నిసార్లు భర్తీ కన్నా ఖాళీగా మిగులుతున్న సీట్ల సంఖ్యనే ఎక్కువగా ఉంటుంది. యూనివర్సిటీ పరి«ధిలోని 18 ప్రభుత్వ కళాశాలలు, 96 ప్రవేట్‌ కళాశాలల్లో వివిధ కోర్సుల్లో  45,471 సీట్లు ఉన్నాయి. మొదటిదశలో 13,177, రెండోదశలో 5,743 సీట్ల కేటాయింపుతో ‘దోస్త్‌’ అందరినీ నిరాశ పరిచింది. మూడో దశ కేటాయింపు తర్వాత యూనివర్సిటీ వ్యాప్తంగా 20,023 సీట్లు కేటాయించబడి 33.85 భర్తీ శాతం నమోదైంది. గతంలో ఇచ్చిన  నాలుగోదశలో 20,350 సీట్ల భర్తీ జరిగింది. ఇప్పుడు ఐదోదశకు అవకాశం ఇవ్వడంతో దాదాపు 2వేల పైగానే  సీట్లు భర్తీ అవుతాయని  విద్యారంగ నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. 

కళాశాలల మధ్య పోటీ.. 

‘దోస్త్‌’ అధికారులు ఐదోసారి ప్రవేశాలకు అవకాశం ఇవ్వడంతో ప్రయివేటు కళాశాలల్లో ఆశలు చిగురిస్తున్నాయి. గతంలో పలు కళాశాలల మధ్య ఆనారోగ్యకరమైన పోటీ నెలకొని ఒకరికి మించి ఒకరు ఆఫర్లు ప్రకటించి విద్యార్థులను ఆకర్షించారు. ఎన్ని తిప్పలు పడ్డా ఆనుకున్నస్థాయిలో సీట్ల భర్తీ జరగలేదు. మూడు, నాలుగు దశల సీట్ల కేటాయింపు పూర్తయినా కరీంనగర్‌తో పాటు వివిధ ప్రాంతాల్లోని కొన్ని కళాశాలల్లోనే చెప్పకోదగ్గస్థాయిలో ప్రవేశాలు జరిగాయి. మిగిలినివి కొన్ని పర్వాలేదనిపించినా మరికొన్ని మాత్రం మూసివేసే దశకు దగ్గరగా ఉన్నట్లు సమాచారం. ఇప్పుడు ప్రకటించిన 5వ అవకాశాన్ని ఎలాగైనా సద్వినియోగపరుచుకోవాలనే ఉద్దేశంతో పలు ప్రవేట్‌ కళాశాలలు తప్పుడు మార్గంలో ప్రలోభాలు ప్రకటించి డిగ్రీ ప్రవేశాలను చేపడుతున్నాయని సమాచారం.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top