కొనలేం.. తినలేం

Day By Day Onion Prices Are Increasing In Markets - Sakshi

సాక్షి, నర్సాపూర్‌(మెదక్‌): ఉల్లి గడ్డ ధర భగ్గుమంటుంది. ధరలు అమాంతం పెరగడంతో ఉల్లిగడ్డ వినియోగం తగ్గి అమ్మకాలు తగ్గాయి. సామాన్య ప్రజలు ఉల్లి గడ్డను వాడేందుకు జంకుతున్నారు. ఉల్లిగడ్డ సైజు బట్టి ధర పలుకుతుంది. చిన్న సైజు ఉల్లి గడ్డని సైతం సాధారణ ప్రజలు వాడే స్థాయిలో దాని ధర లేకపోవడం గమనార్హం. పేడుగా పిలువబడే చిన్న సైజు ఉల్లి ధర కిలోకు 40 రూపాయలకు చేరడంతో ప్రజలు కొనలేకపోతున్నారు.  

నాలుగు  నెలలుగా పెరుగుతున్న ధరలు 
సుమారు నాలుగు నెలలుగా ఉల్లిగడ్డ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. రోజుకో ధరకు అమ్మకాలు సాగుతున్నాయి. మామూలుగా చిన్న సైజు ఉల్లి గడ్డ ధర పది రూపాయల లోపు ఉంటుండగా మీడియం సైజు ఉల్లిగడ్డ కిలో ధర పది రూపాయలకు లభించేది. నాలుగు నెలల క్రితం పది రూపాయలు పలికిన ఉల్లి గడ్డ 15 నుంచి 20 రూపాయలకు పెరిగి ఆపై రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. నర్సాపూర్‌కు చెందిన పలువురు వ్యాపారులు హైదరాబాద్, జహీరాబాద్‌ ప్రాంతాల నుంచి ఉల్లిగడ్డను తెచ్చి విక్రయించేవారు. కాగా హోల్‌సేల్‌ ధరలు పెరగడంతో స్థానిక వ్యాపారులు సైతం పెంచాల్సి వస్తుందని అంటున్నారు.  

తగ్గిన వినియోగం 
ఉల్లిగడ్డ ధరలు అమాంతం పెరుగుతున్నందున దాని వినియోగం బాగా తగ్గి అమ్మకాలు పడిపోయాయి. పది రూపాయలకు కిలో ఉల్లిగడ్డ లభించినపుడు బాగా వినియోగించడంతో మార్కెట్లో అమ్మకాలు సైతం బాగానే ఉండేవి. ప్రస్తుతం చిన్న సైజు ఉల్లి  కిలోకు 40 రూపాయలకు చేరడం, మీడియం సైజుది 80 రూపాయల వరకు, పెద్ద సైజుది వంద రూపాయలకు చేరడంతో మామూలు ప్రజలు దానిని వినియోగించేందుకు జంకుతున్నారు.  ధరలు పెరగడంతో పెట్టుబడి ఎక్కువ పెట్టాల్సి వస్తుందని అధిక ధరలకు తెచి్చనా అమ్మక పోవడంతో పాడై నష్టాలు వస్తున్నాయని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  

కొనలేక పోతున్నాం 
మామూలు సైజు ఉల్లి గడ్డ ధరలు 80 నుంచి వంద రూపాయలకు చేరడంతో కొనలేకపోతున్నాం. ధర లు అడ్డగోలుగా పెరుగుతున్నాయి. ఉల్లి ధర వింటుంటే భయమేస్తుంది. ధరలు పెరిగినందున వాడడం తగ్గించాం. ఉల్లి ధరలు అదుపు చేసి సాధారణ ప్రజలకు అందబాటులో ఉండే విధంగా చూడాలి. 
– బొజ్జ నరహరి, వినియోగదారుడు, నర్సాపూర్‌ 

అమ్మకాలు తగ్గాయి 
ఉల్లిగడ్డ ధరను తాము ఏమాత్రం నిర్ణయించ లేం. హోల్‌సేల్‌ మార్కెట్‌లోనే ఉల్లిగడ్డ ధరలు పెరిగాయి.  రోజు రోజుకూ ధరలు పెరుగుతున్నాయి. హైదరాబాద్, జహీరాబాద్‌ మార్కెట్‌ నుంచి తెస్తాం. అక్కడే ధరలు పెరిగాయి. ధరలు బాగా పెరగడంతో ప్రజలు తక్కువ కొనుగోలు చేస్తున్నందున అమ్మకాలు పడిపోయాయి.  
 –సంతోష్‌ వ్యాపారి, నర్సాపూర్‌ 

ప్రభుత్వం ధరలు అదుపు చేయాలి 
ఉల్లి గడ్డ ధరలను ప్రభుత్వం అదుపు చేసేందుకు చర్యలు తీసుకోవాలి. సాధారణ ప్రజలు వాడే స్థితిలో లేనంత ఎత్తుకు ఉల్లి ధరలు చేరాయి. ఉల్లిగడ్డ హోల్‌సేల్‌ వ్యాపారులు వారిష్టమున్న రీతిలో ధరను పెంచుతున్నారు. దీంతో సామాన్య ప్రజలకు ఆర్థికంగా భారమై వాడడం ఇబ్బందిగా మారింది. అందరికీ అందుబాటులో ఉండే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.   
–సంగసాని సురేష్‌, ఎంపీటీసీ మాజీ సభ్యుడు, నర్సాపూర్‌  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top