లక్షన్నర లీటర్లు నేల‘పాలు’!

Dairy farmers worry about Milk being wastage by Vijaya Dairy - Sakshi

నెలరోజులుగా పారబోస్తున్న విజయ డెయిరీ 

సాక్షి, హైదరాబాద్‌: పాడి రైతులు తెచ్చే పాలను విజయ డెయిరీ నేలపాలు చేస్తోంది. నెల రోజుల్లో ఏకంగా లక్షన్నర లీటర్లకుపైగా పాలను మురుగు కాలువల్లో పారబోసింది. ఈ పాలకు సేకరణ ధర, రైతు ప్రోత్సాహకాన్ని డెయిరీ నిలిపివేసినట్లు సమాచారం. దీంతో పాడి రైతులు గగ్గోలు పెడుతున్నారు. చిత్రమేంటంటే విజయ డెయిరీకి చెందిన చిల్లింగ్‌ కేంద్రాలు, బల్క్‌మిల్క్‌ యూనిట్లు, గ్రామాల్లోని సేకరణ కేంద్రాల నుంచే ఈ పాలు విజయ డెయిరీకి ట్యాంకుల ద్వారా వచ్చాయి. ఆయా కేంద్రాల నుంచి తెచ్చిన పాలను హైదరాబాద్‌ తీసుకొచ్చాక ‘నాణ్యత’పేరుతో నేలపాలు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పాలు బాగో లేకపోతే రైతుల వద్దే తిరస్కరించాల్సింది పోయి తీరా తెచ్చాక నాణ్యత లేదని పారబోయడంపై ఆరోపణలు వస్తున్నాయి. పారబోసిన పాలకు సేకరణ ధర, ప్రోత్సాహకం ఎవరిస్తారని రైతులు నిలదీస్తున్నారు. ఆయా కేంద్రాలకు చెందిన మేనేజర్లు మాత్రం డబ్బులు వస్తాయని, కంప్యూటర్లో మిస్‌ అయిందని నచ్చజెప్పుతున్నారు. 

నాణ్యత పేరుతో.. 
విజయ డెయిరీకి అనేక గ్రామాల్లో సేకరణ కేంద్రాలున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 165 బల్క్‌ మిల్క్‌ యూనిట్లు, 15 చిల్లింగ్‌ సెంటర్లు, 8 డెయిరీలు ఉన్నాయి. ఆయా కేంద్రాలకు పాడి రైతులు పాలు పోస్తుంటారు. ఆ కేంద్రాల నుంచి ప్రతీ రోజూ 3.60 లక్షల లీటర్ల పాలు హైదరాబాద్‌ విజయ డెయిరీకి వస్తాయి. అయితే ప్రస్తుతం విజయ డెయిరీ పాల విక్రయాలు 2 లక్షల లీటర్లకు అటుఇటుగానే ఉన్నాయి. ఇక 40 వేల లీటర్లను అంగన్‌వాడీ కేంద్రాలకు పోసేందుకు టెట్రాప్యాక్‌లను తయారు చేస్తున్నారు. దీంతో ప్రతీరోజూ దాదాపు లక్ష లీటర్ల వరకు పాలు మిగిలిపోతున్నాయి. వాటిని పాలపొడి, వెన్న ఇతరత్రా అనుబంధ ఉత్పత్తులను తయారుచేయడానికి వినియోగించాలి. కానీ ఇప్పటికే కోట్ల విలువైన వెన్న, పాల పొడి చిత్తూరు జిల్లా పలమనేరులో వృథాగా పడి ఉంది. దీంతో ఏం చేయాలో విజయ డెయిరీ యాజమాన్యానికి అంతు బట్టడంలేదు. అదనంగా వచ్చే పాలను ఎలాగైనా వదిలించుకునేందుకు పారబోసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నాణ్యత లేకుంటే ఆయా పాల నుంచి క్రీమ్‌ తీసి వెన్న, పన్నీర్‌ వంటివి తయారుచేసేవారు. అందుకు పాల సేకరణ ధరలో పావుశాతం చెల్లించేవారు. అది కూడా ఎప్పుడో ఒకసారి జరిగేది. కానీ ఇప్పుడలా కాదు. యాంటీ బయోటిక్స్‌ ఉన్నాయని, ఇతరత్రా కారణాలు చెబుతూ పారబోస్తున్నారన్న ఆరోపణలున్నాయి. నిజంగా నాణ్యత లేకుంటే జిల్లాల్లోని విజయ డెయిరీ కేంద్రాల వద్దే తిరస్కరిస్తే రైతులు వాటిని వెనక్కి తీసుకెళ్లేవారు కదా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. 

ఎక్కడెక్కడ ఎంత? 
గత నెల రోజుల వ్యవధిలో రాష్ట్రంలో విజయ డెయిరీ మన్‌సాన్‌పల్లి కేంద్రానికి చెందిన 25 వేల లీటర్ల పాలను పారబోశారు. అలాగే కొత్తపేట కేంద్రానికి చెందిన 30 వేల లీటర్లు, కందుకూరుకు చెందిన 15 వేలు, బొమ్మలరామారానికి చెందిన 10 వేలు, వనపర్తి కేంద్రానికి చెందిన 10 వేలు, చేవెళ్ల కేంద్రానికి చెందిన 12 వేలు, ఇందుగులకు చెందిన 15 వేలు, జనగామకు చెందిన 18 వేలు, ఖమ్మంకు చెందిన 7 వేలు, చౌటుప్పల్‌ కేంద్రానికి చెందిన 6 వేల లీటర్లను పారబోసినట్లు విజయ డెయిరీకి చెందిన కొందరు అధికారులు తెలిపారు. 

ఇలాగైతే మూతే..
ప్రభుత్వం రైతులకు ప్రోత్సాహం ఇస్తుండటంతో పెద్ద ఎత్తున పాల సేకరణ పెరిగింది. కానీ ఉన్నతాధికారుల తప్పుడు నిర్ణయాల వల్ల విక్రయాలు పడిపోయాయి. పాల సేకరణ వద్దనుకుంటే ముందే రైతులకు చెప్పాలి కానీ నాణ్యత పేరుతో పారబోయడం సరికాదు. విజయ డెయిరీ ఇలాగే కొనసాగితే కొన్ని రోజుల్లోనే మూతపడే ప్రమాదముంది.
 కె.యాదయ్య, ప్రధాన కార్యదర్శి,  విజయ డెయిరీ స్టాఫ్‌ అండ్‌ వర్కర్స్‌ యూనియన్‌ 

ఎందుకు పారబోస్తున్నారు? 
పాల సేకరణ అధికంగా ఉంది. విక్రయాలు పడిపోతున్నాయి. ఇదే విజయ డెయిరీ ఎదుర్కొనే ప్రధాన సమస్య. దీంతో మిగిలిన పాలను గతేడాది సెప్టెంబర్‌ నుంచి చిత్తూరు జిల్లా పలమనేరులోని పరాగ్‌ డెయిరీకి పంపి పాల పొడి, వెన్న తయారు చేయించారు. రూ.90 కోట్ల విలువైన 1300 టన్నుల వెన్న, 2 వేల టన్నుల పాల పొడి అక్కడ పేరుకుపోయి ఉన్నట్లు విజయ డెయిరీకి చెందిన ఒక అధికారి ‘సాక్షి’కి తెలిపారు. ఇది ఈ ఏడాది అక్టోబర్‌ నాటికి గడువు తీరిపోనుంది. మరోవైపు వాటిని ఇప్పుడు విక్రయించాలనుకుంటున్నా అమ్ముడుపోవడం లేదు. పాలపొడి అక్కడ తయారు చేయడానికి ఒక కేజీకి రూ.250 అవుతోంది. కానీ బయటి మార్కెట్లో రూ.100 ధరే పలుకుతోంది. ఇలా ఎటు చూసినా నష్టమే కనిపిస్తుంది. ప్రస్తుతం మిగిలే పాలను మళ్లీ వెన్న, పొడి తయారు చేయించే పరిస్థితి లేదు. దీంతో నాణ్యత లేదంటూ పాలను పారబోస్తున్నట్లుగా తెలుస్తోంది. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top