కారు గుర్తు నాదే.. కాదు.. నాదే!

The Crisis of Municipal Election Tickets in the Tandoor TRS - Sakshi

తాండూరు మున్సి‘పోరు’లో అధికార పార్టీలో టికెట్ల పంచాయితీ 

రిజర్వేషన్‌లు తేలకముందే గ్రూపు రాజకీయాలు 

చైర్మన్‌ అభ్యర్థి ప్రకటించకుండానే ఎన్నికలకు వెళ్లే యోచన! 

ఎన్నికల నిర్వహణపై హైకోర్టు తాత్కాలిక బ్రేక్‌ 

ఈనెల 29వ వరకు కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశం 

తాండూరు: తాండూరు మున్సిపల్‌ ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారో ఇంకా తేలకముందే అప్పుడే అధికార పార్టీ శ్రేణుల్లో అంతర్గత కుమ్ములాటలు మొదలయ్యాయి. కౌన్సిలర్లుగా పోటీ చేసేందుకు ఆశవహుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. చైర్మన్‌ అభ్యర్థిత్వం మొదలుకోని కౌన్సిలర్‌ స్థానం వరకు అధికారపార్టీలో నాయకుల మద్య పోటీ తీవ్ర స్థాయిలో ఉంది. చైర్మన్‌ పదవికోసం ఇద్దరు బలమైన నేతలు పోటీ పడుతున్నారు. అయితే ఇద్దరి మధ్య సాగుతున్న పోరుతో విసుగుచెందిన గులాబీబాస్‌లు చైర్మన్‌ అభ్యర్థి పేరు ప్రకటించకుడానే ఎన్నికల్లోకి వెళ్లాలని భావిస్తున్నట్టు భోగట్టా. 

29 వరకు కౌంటర్‌ దాఖలు చేయండి.. 
మున్సిపల్‌ వార్డుల విభజన సక్రమంగా జరగలేదని పలు పార్టీలు కోర్టును ఆశ్రయించాయి. సోమవారం మున్సిపల్‌ ఎన్నికలపై ప్రభుత్వ, ప్రతిపక్ష లాయర్ల వాదనలు విన్న హైకోర్టు ఈనెల 29వ తేదీ వరకు మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణపై కౌంటర్‌ దాఖలు చేయాలని తీర్పు వెలువరించింది. దీంతో అన్ని మున్సిపాలిటీలతో పాటు తాండూరు మున్సిపాలిటీకి కూడా అప్పటి వరకు తాత్కాలిక బ్రేక్‌ పడినట్లయ్యింది. అయితే ఎన్నికలపై తీర్పు వెలువడే వరకు ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేస్తోందా.. లేదా అనేది స్పష్టత లేదని అధికార వర్గాలు అంటున్నాయి.

 చైర్మన్‌ అభ్యర్థి పేరు ప్రకటించకుండానే ఎన్నికల్లోకి..! 
తాండూరు మున్సిపల్‌ ఎన్నికలలో టీఆర్‌ఎస్‌ పార్టీ చైర్మన్‌ అభ్యర్థి పేరు ప్రకటించకుండానే ఎన్నికలలోకి వెళ్లనున్నట్లు సమాచారం. టీఆర్‌ఎస్‌ పార్టీలో ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌ రెడ్డి వర్గం నుంచి, ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి వర్గం నుంచి చైర్మన్‌ పీఠం కోసం పోటీ పడుతున్నారు. అయితే మరికొంత మంది నాయకులు చైర్మన్‌ రేసులో తమ పేర్లను పరిశీలించాలని పార్టీ నేతల వద్దకు వెలుతున్నారు. దీంతో పదవికోసం పోటీ తీవ్రం అయింది. ఈ విషయం గులాబీ బాస్‌లకు తలనొప్పిని తెప్పిస్తోంది. దీంతో మున్సిపల్‌ ఎన్నికలలో తాండూరులో చైర్మన్‌ అభ్యర్థి పేరు ప్రకటించకుండా కౌన్సిలర్‌లతోనే ఎన్నికలకు వెళ్లాలని యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.  

కౌన్సిలర్‌ టికెట్‌ కోసం తీవ్ర పోటీ.. 
తాండూరు మున్సిపల్‌ పరిధిలోని 36 వార్డుల్లో టీఆర్‌స్‌ పార్టీ నుంచి టికెట్‌ ఆశిస్తున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఒక్క వార్డులో పార్టీ నుంచి పోటీ చేసేందుకు 10 మంది వరకు ముందుకు వస్తున్నారు. బీ–ఫామ్‌లు ఇద్దరు నేతల్లో ఎవరి చేతికి అందుతాయోనని పార్టీ శ్రేణుల్లో ఆందోళన మొదలైంది. మిగతా పార్టీలలో మాత్రం ఎన్నికల టెన్షన్‌ ఏమాత్రం లేకుండా ముందుకు వెళ్తున్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top