Sakshi News home page

కరీంనగర్‌లో క్రికెట్ స్టేడియం!

Published Tue, Apr 28 2015 3:05 AM

Cricket stadium on karimnagar

- స్థలసేకరణ దిశగా అడుగులు
- శాతవాహన పీజీ సెంటర్ స్థలంలో ఏర్పాటు
- తెలంగాణ రాష్ట్రంలో రెండోది
- ఎంపీ, ఎమ్మెల్యేల ప్రత్యేక చొరవ
- ప్రభుత్వానికి ప్రతిపాదనలు
కరీంనగర్ స్పోర్ట్స్ :
క్రికెట్.. క్రికెట్.. ఈ పేరు వింటేనే అందరిలో ఏదో ఫీలింగ్. జిల్లా వ్యాప్తంగా క్రికెట్‌కు ఉన్న క్రేజీ అంతా ఇంతా కాదు. దేశంలో ఎక్కడ మ్యాచ్ జరిగినా.. చాలా మంది అభిమానులు అక్కడికి వెళ్లి చూసి వచ్చిన సందర్భాలు అనేకం. మనకూ ఒక స్టేడియం ఉంటే బాగుండు అనుకునేవారు చాలా మందే ఉన్నారు. ఇప్పుడు ఇలాంటి క్రీడాభిమానులందరి కల సాకారం కానుంది. బోర్‌‌డ ఆఫ్ క్రికెట్ కంట్రోల్ ఇన్ ఇండియా(బీసీసీఐ) ఆధ్వర్యంలో జిల్లాలో క్రికెట్ స్టేడియం నిర్మాణానికి అడుగులు పడుతున్నారు.

ఇందుకు ఎంపీ, ఎమ్మెల్యే, క్రికెట్ సంఘాల బాధ్యులు చురుకుగా పావులు కదుపుతున్నారు. తెలంగాణ రాష్ర్టంలో ఉప్పల్ తర్వాత రెండో క్రికెట్ స్టేడియం కరీంనగర్‌లో ఏర్పడనుంది. దీంతో కరీంనగర్ జిల్లా క్రీడారంగం దశ తిరగనుంది. ఎంపీ వినోద్‌కుమార్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, క్రికెట్ సంఘం పెద్దలు ఈ విషయమై సీఎం కేసీఆర్‌ను కలిసి స్టేడియం నిర్మాణంపై చర్చించారు. స్పందించిన సీఎం జిల్లా కేంద్రంలో స్థలం చూసుకోవాలని.. తర్వాత స్టేడియం మంజూరుకు కృషిచేస్తానని చెప్పి.. వెంటనే ప్రిన్సిపల్ సెక్రటరీకి లెటర్ ఫార్వర్డ్ చేయమని చెప్పినట్లు సమాచారం. ఆ లేఖ ఇటీవలే కలెక్టర్, ఆర్డీవోలకు అందినట్లు తెలిసింది.

10 ఎకరాల్లో స్టేడియం
జిల్లా కేంద్రంలో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) ఆధ్వర్యంలో హైదరాబాద్ క్రికెట్ సంఘం నిర్వహణలో క్రికెట్ స్టేడియం నిర్మాణం జరిగే అవకాశాలు ఉన్నారు. లోయర్ మానేరు డ్యాం సమీపంలోని శాతవాహన పీజీ సెంటర్, ఎల్‌ఎండీ కాలనీలోని వేంకటేశ్వర దేవాలయం సమీపంలో, కొత్తపల్లిలో స్టేడియం నిర్మాణానికి స్థల పరిశీలన చేశారు. శాతవాహన పీజీ సెంటర్ స్థలంలో స్టేడియం నిర్మాణానికి బీసీసీఐ అంగీకరించినట్లు సమాచారం. కలెక్టర్ అనుమతి రాగానే నిధుల మంజూరు.. నిర్మాణంపై దృష్టిసారించే అవకాశాలు ఉన్నారుు. దీనికి సంబంధించిన గూగుల్ మ్యాప్ రెడీ చేశారు. రూ.20 కోట్ల వ్యయంతో 25 నుంచి 30 వేల మంది కూర్చునే సామర్థ్యంతో స్టేడియాన్ని నిర్మించనున్నారు.

గతేడాది హైదరాబాద్ క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో జరిగిన పలు లీగ్, అంతర్ జిల్లాల క్రికెట్ పోటీల్లో జిల్లా జట్లు విజయడంకా మోగించాయి. అంతకుముందు ఏడాది కూడా మంచి ఫలితాలు సాధించి క్రికెట్‌లో కరీంనగర్ తిరుగులేని జట్టుగా నిలిచింది. గతేడాది అండర్-14, 19 విభాగంలో ఒకసారి, 2013-14 లో అండర్-16, 19లో మరోసారి విజేతగా నిలిచింది. జిల్లా క్రీడాకారిణి సునీత జాతీయస్థాయి పోటీలకు కెప్టెన్‌గా వ్యవహరించి జిల్లా ఖ్యాతిని పెంచారు. క్రికెట్ సంఘాల బాధ్యులూ ఔత్సాహికంగా వ్యవహరిస్తుండడంతో స్టేడియం నిర్మాణానికి అడుగులు పడుతున్నారుు.

Advertisement
Advertisement