
సాక్షి, సూర్యాపేట: హుజూర్‌నగర్ సీపీఎం అభ్యర్థి శేఖర్‌రావును పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు సీపీఎం నేతలు ప్రకటించారు. ఉప ఎన్నికలో సరిగా నామినేషన్ వేయకపోడాన్ని తీవ్రంగా పరిగణించిన ఆ పార్టీ రాష్ట్ర కమిటీ శేఖర్‌రావును ఏడాది పాటు బహిష్కరిస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది. అలాగే పార్టీ జిల్లా కార్యదర్శి రాములును బాధ్యతల నుంచి తప్పించింది. కాగా పత్రాలు సరిగా లేని కారణంగా సీపీఎం అభ్యర్థి నామినేషన్‌ను అధికారులు తిరస్కరించిన విషయం తెలిసిందే. దీంతో అతనిపై పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పార్టీ నియమావళిని అనుసరించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సోమవారం ఆ పార్టీలు నేతలు తెలిపారు. కాగా అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురికావడంతో తెలంగాణ ప్రజాపార్టీ చెందిన సాంబశివగౌడ్‌కు మద్దతు తెలుపుతున్నట్లు సీపీఎం ప్రకటించింది. ఇప్పటికే అధికార టీఆర్‌ఎస్‌కు మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించిన సీపీఐని నిర్ణయం మార్చుకోవాలని సీపీఎం నేతలు కోరారు.