
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనున్న రెండు స్థానాలకు సంబంధించిన అభ్యర్థులను సీపీఎం ఖరారు చేసింది. ఖమ్మం నుంచి పార్టీ కార్యదర్శివర్గసభ్యుడు బి.వెంకట్‌ను, నల్లగొండ నుంచి తెలంగాణ సాయుధపోరాట యోధురాలు మల్లుస్వరాజ్యం కోడలు, ఐద్వా నాయకురాలు మల్లు లక్ష్మిని పోటీ చేయించాలని నిర్ణయించింది. మంగళవారం ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశంలో ఖరారు చేసింది. పొత్తుల అంశం, పోటీచేయని చోట్ల అనుసరించాల్సిన వైఖరిపై సీపీఐ తుది అభిప్రాయం తీసుకున్నాక బుధవారం సీపీఎం తన తుది నిర్ణయాన్ని ప్రకటించనుంది. సీపీఐతో పొత్తుకు సంబంధించిన చర్చలు, మిగతాచోట్ల జనసేన, బీఎస్పీ, బీఎల్పీ, ఎంసీపీఐ(యూ), ఎంబీటీ వంటి మిత్రపక్షాలకు మద్దతునిచ్చే విషయంపై ఈ భేటీలో చర్చించారు. సమావేశానికి జాతీయ నాయకత్వం తరఫున బీవీ రాఘవులు హాజరై రాష్ట్ర పార్టీకి దిశానిర్దేశం చేశారు. ఏపీలో మాదిరిగానే తెలంగాణలోనూ జనసేన, బీఎస్పీలను వామపక్షాలు కలుపుకుని పోతే మంచిదనే అభిప్రాయం సమావేశంలో వ్యక్తమైనట్టు సమాచారం.
మిత్రులు లేనిచోట...
సీపీఐ, సీపీఎం పోటీ చేసే నాలుగు సీట్లలో బీజేపీ, కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌లను ఓడించాలని, జనసేన, బీఎస్పీ, ఇతర మిత్రపక్షాలు పోటీచేస్తున్నచోట వారికి సహకరించాలని, మిగతా చోట్ల బీజేపీని, టీఆర్‌ఎస్‌ను ఓడించాలని రాష్ట్ర కమిటీ భేటీలో నిర్ణయించినట్టు తెలుస్తోంది. బీజేపీ, టీఆర్‌ఎస్‌లను ఓడించాలనే నినాదంతో ఎన్నికల క్యాంపెయిన్, నాలుగు సీట్లలో సీపీఐ, సీపీఎం పరస్పర సహకారం, మిగతా సీట్లలో ఎవరికి మద్దతివ్వాలనే దానిపై ఏ పార్టీకి ఆ పార్టీ నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ ఉండాలని, దీనిపై పరస్పరం చర్చించుకుని ఏకాభిప్రాయానికి రావాలని సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డికి సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం రాసిన లేఖలో స్పష్టం చేసినా సీపీఐ నుంచి సానుకూల స్పందన రాకపోవడంపై ఈ భేటీలో అసంతృప్తి వ్యక్తమైనట్టు తెలిసింది. సీపీఎంతో పొత్తుకు సీపీఐ సిద్ధంకాకపోతే జనసేన, బీఎస్పీ, బీఎల్పీ, ఎంసీపీఐ(యూ), ఎంబీటీ తదితర పార్టీలతో కలసి పోటీచేయాలనే అభిప్రాయానికి సీపీఎం వచ్చినట్టు సమాచారం.