
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 4న రాజ్‌భవన్ ముట్టడికి సీపీఐ పిలుపునిచ్చింది. ఇంటర్ బోర్డు అవకతవకల వ్యవహారం పై గవర్నర్ నరసింహన్ జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేస్తూ చలో రాజ్‌భవన్ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ప్రకటించింది. హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ, గ్లోబరీనా యాజమాన్యంపై క్రిమినల్ కేసులు, ఆత్మహత్యలకు పాల్పడిన విద్యార్థుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లింపు, బాధ్యులపై, బోర్డు అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్లతో ఈ ముట్టడిని చేపడుతున్నట్లు సీపీఐ హైదరాబాద్ కార్యదర్శి ఈటీ నర్సింహ ఒక ప్రకటనలో తెలిపారు. గ్లోబరీనా సంస్థ అవకతవకలకు అడ్డుకట్ట వేయాలంటూ 2015 మే 15న నరసింహన్‌కు సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ లేఖ రాశారని, అప్పుడు స్పందించి చర్యలు తీసుకుని ఉంటే ఇంటర్‌బోర్డులో అక్రమాలు జరిగి ఉండేవి కావన్నారు. తమ డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వపరంగా చర్యలు తీసుకోకపోతే ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు.