
కాప్రా: ఆధునిక కాలంలో శాకాహారం ప్రాశస్థ్యం నానాటికీ పెరుగుతోంది. మారుతున్న ఆహారపు అలవాట్లలో దీని పాత్ర ద్విగుణీకృతమవుతోంది. ప్రపంచ వ్యాప్తంగా శాకాహారానికి డిమాండ్ ఏర్పడిన ప్రస్తుత తరుణంలో జీవహింస వద్దు శాకాహారమే ముద్దంటూ చైతన్యపరిచేందుకు నడుం కట్టారు నగరానికి చెందిన దంపతులు ఆచార్య శ్రీనివాస్, దివ్య దంపతులు. యాత్ర ఫర్ యానిమల్స్ పేరుతో స్వచ్ఛందంగా ర్యాలీలు చేపట్టారు. మాంసాహారంతో వచ్చే నష్టాలు, శాకాహారంతో ఒనగూరే ప్రయోజనాలను వివరించేందుకు దేశవ్యాప్త యాత్రకు రెండు రథాలతో శ్రీకారం చుట్టారు.
పిరమిడ్ ప్రోత్సాహంతో..
ప్రస్తుత సమాజంలో మనిషి ఎదుర్కొంటున్న రోగాల నివారణకు శాకాహారం ఒక్కటే మార్గం. దీని ద్వారానే అనేక వ్యాధులకు, అనర్థాలకు చెక్ పెట్టవచ్చనే సదుద్దేశంతో ఆచార్య శ్రీనివాస్, దివ్య దంపతులు పిరమిడ్ స్వచ్ఛంద సంస్థ ప్రోత్సాహంతో దేశ వ్యాప్తంగా ప్రజలకు అవగాహన కల్పించేందుకు సంకల్పించారు. మహబూబ్‌నగర్ జిల్లా కడ్తాల్ నుంచి ఈ ఏడాది జూన్ 21న యోగా దినోత్సవం సందర్భంగా ర్యాలీకి శ్రీకారం చుట్టారు. దీనిని పిరమిడ్ సొసైటీ ఫౌండర్ బ్రహ్మర్షి పత్రీజీ జెండా ఊపి ప్రారంభించారు. తెలంగాణలో మహబూబ్‌నగర్ జిల్లాలో మొదలైన యాత్రతో రాష్ట్ర వ్యాప్తంగా 54 ర్యాలీలు నిర్వహించారు. దేశ వ్యాప్తంగా 29 రాష్ట్రాల్లోని 644 జిల్లాల్లో 44 వేల కి.మీ మేర ఆచార్య శ్రీనివాస్, దివ్య దంపతులు ర్యాలీల ద్వారా అవగాహన కల్పించనున్నారు. ప్రస్తుతం ఈ యాత్ర కర్ణాటక రాష్ట్రంలో కొనసాగుతోంది.
పలువురు ప్రముఖుల అభినందనలు
శ్రీనివాస్, దివ్య దంపతులు చేపట్టిన ర్యాలీకి త్రిదండి చినజీయర్ స్వామితో పాటు అన్నాహజారే, గాయనీమణులు ఎస్.పి.శైలజ, ఉషా, ఫైట్ మాస్టర్స్ రామ్‌లక్ష్మణ్, నటుడు, ఎమ్మెల్యే బాబూమోహన్, తెలంగాణ రాష్ట్రంలోని పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు మద్దతు పలికిదంపతులను అభినందించారు. దేశవ్యాప్త పర్యటన అనంతరం 2019 జూన్ 21 యోగా దినోత్సవం రోజున హైదరాబాద్‌లో 25 వేల మందితో పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టి ముగించనున్నట్లు ఆచార్య శ్రీనివాస్, దివ్య దంపతులు తెలిపారు.
మార్పు తేవడమే మా లక్ష్యం..
మూగజీవాలను ప్రేమించాలని, మాంసాహార ప్రియులను శాకాహారం వైపు మళ్లించాలనే లక్ష్యంతో యాత్రను చేపట్టాం. శాకాహారం దారిలో వెళ్లాలని ప్రతి ఇంటికీ, ప్రతి విద్యార్థికీ చేరేలా ప్రచారం నిర్వహిస్తున్నాం. మేం చేపట్టిన ర్యాలీతో ఇప్పటికే చాలామంది శాకాహారం వైపు వచ్చారు. ఇదే ఉత్సాహంతో ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ముందుకెళ్తాం. అందరూ శాకాహారం వైపు రావాలనేదే ర్యాలీ లక్ష్యం.
– ఆచార్యశ్రీనివాస్, దివ్య

అభినందిస్తున్న అన్నాహజారే..