బావిలో నక్కల జంట | A Couple Of Foxes In The Well At Vargal | Sakshi
Sakshi News home page

బావిలో నక్కల జంట

Aug 5 2019 10:34 AM | Updated on Aug 5 2019 10:34 AM

A Couple Of Foxes In The Well At Vargal - Sakshi

బావిలో మూలన నక్కిన నక్కల జంట

సాక్షి, గజ్వేల్‌: ఎవరైనా తరిమారో.. లేదా ప్రమాదవశాత్తు పాడుబడిన బావిలో పడ్డాయో? తెలియదుగాని బిక్కుబిక్కుమంటు ఓ మూలన నక్కిన నక్కల జంటను అటవీ అధికారుల బృందం రక్షించింది. వన్యప్రాణులు బావిలో పడిన ఈ ఘటన వర్గల్‌ మండలం సింగాయపల్లిలో ఆదివారం మధ్యాహ్నం చోటు చేసుకుంది.  గ్రామస్తులు, అటవీ డిప్యూటీ రేంజ్‌ ఆఫీసర్‌ వేణుగోపాల్‌ తెలిపిన ప్రకారం..  సింగాయపల్లి గ్రామ సమీపంలోని టేకులపల్లి మల్లారెడ్డికి చెందిన నీళ్లు లేని పాడుబడిన వ్యవసాయ బావిలో ఆడ, మగ నక్కల జంట పడిపోయాయి.

వాటిని గమనించిన రైతులు, ఈ సమాచారాన్ని అటవీ శాఖ డిప్యూటీ రేంజ్‌ ఆఫీసర్‌ వేణుగోపాల్‌కు అందించారు. ఆయన సాయంత్రం 4 గంటల వరకు ముట్రాజ్‌పల్లి బీట్‌ ఆఫీసర్‌ వెంకన్న, డ్రైవర్‌ ఫరూక్, గజ్వేల్‌ అటవీ పార్క్‌లో పనిచేస్తున్న ఆర్కిటెక్ట్‌ రఘులతో కలిసి వలలు, తాడు నిచ్చెన, ఫస్ట్‌ఎయిడ్‌ కిట్‌తో కూడిన రెస్క్యూ వ్యాన్‌తో సింగాయపల్లి చేరుకున్నారు. రఘు, వెంకన్నలు బావిలోకి దిగి వల సహకారంతో నక్కలను పట్టుకుని సురక్షితంగా బయటకు తీశారు. అనంతరం వాటిని గజ్వేల్‌–వర్గల్‌ సరిహద్దు సంగాపూర్‌ అడవిలో వదిలిపెట్టారు. ఆడ, మగ నక్కలు వాటంతట అవే పడ్డాయా లేదా ఎవరైనా తరిమితే పడ్డాయో తెలియదుకాని ఆరేడు గంటలు బావిలో బిక్కుబిక్కుమంటూ గడిపాయి. జంట నక్కలు సురక్షితంగా వదిలేయడంతో బతుకుజీవుడా అంటూ అడవిలోకి పరుగులు తీశాయి. నక్కల జంట సమాచారం సకాలంలో అందించి వాటిని రక్షించడంలో సహకరించిన గ్రామస్తులను అటవీ అధికారి వేణుగోపాల్‌ అభినందించారు.  

1
1/1

రెస్క్యూ వ్యాన్‌ వద్ద అటవీ అధికారుల బృందం, గ్రామస్తులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement