మైనర్లకు ట్రాఫిక్‌ పోలీసుల కౌన్సెలింగ్‌ 

Counselling to Minors by Traffic police - Sakshi

వాహనాలు నడుపుతూ పట్టుబడిన 20 మంది పిల్లలు

తల్లిదండ్రులపై చర్యలు తీసుకుంటామని పోలీసుల హెచ్చరిక

సిద్దిపేటటౌన్‌: సిద్దిపేట పట్టణంలో బుధవారం వాహనాలు నడుపుతున్న 20 మంది మైనర్లను సిద్దిపేట ట్రాఫిక్‌ పోలీసులు పట్టుకున్నారు. స్థానిక పాత బస్టాండ్‌లో ట్రాఫిక్‌ సీఐ శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో సాయంత్రం స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టారు. ఈ సందర్భంగా బైక్‌లు నడుపుతూ పట్టుబడిన 20 మంది మైనర్ల తల్లిదండ్రులను పిలిపించి వారితో మాట్లాడారు. మైనర్లకు ఎట్టి పరిస్థితిలోనూ బైక్‌లు ఇవ్వవద్దని తల్లిదండ్రులకు సూచించారు. పిల్లలకు అవసరం ఉన్నా, లేకున్నా వాహనాలు ఇస్తున్న కుటుంబ సభ్యులు, వారి ప్రాణాల విలువను గుర్తించడం లేదని అన్నారు.

వారి సరదాలకంటే ప్రాణం విలువను గుర్తించినప్పుడే చాలా వరకు ప్రమాదాలు నివారించవచ్చన్నారు. మొదటి సారి పట్టుబడడంతో కౌన్సెలింగ్‌ ఇచ్చి పంపించారు. రెండవ సారి పట్టుబడితే బైక్‌ నడిపిన మైనర్లతో సహా వారికి వాహనం ఇచ్చిన తల్లిదండ్రులపై ఎంవీ యాక్టు ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్సై ఆంజనేయులు, ఏఎస్సై, కానిస్టేబుల్స్‌ ఉన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top