పైసలిస్తే రైట్‌..రైట్‌! | Corruption Telangana Border Adilabad | Sakshi
Sakshi News home page

పైసలిస్తే రైట్‌..రైట్‌!

Jan 28 2019 10:50 AM | Updated on Jan 28 2019 10:50 AM

Corruption Telangana Border Adilabad - Sakshi

ఈనెల 19న ఎన్‌హెచ్‌ 44పైన నిర్మల్‌ పోలీసులు పట్టుకున్న కలప 

నిర్మల్‌: ‘అడవుల్లో నుంచి అక్రమంగా పూచిక పుల్ల కూడా వెళ్లనివ్వొద్దు..’ అని సీఎం కేసీఆర్‌ పేర్కొంటున్నారు. జిల్లాలో మాత్రం పైసలిస్తే చాలు.. పూచిక పుల్ల ఏం ఖర్మ..! ఫుల్లుగా అడవినే నరికి తీసుకెళ్లొచ్చు. ఎక్కడా.. ఏఒక్క.. అ ధికారి కూడా అడ్డుకోరు. సంబంధిత శాఖ చెక్‌పోస్టుల్లో అధికారులు, సిబ్బంది కనీసం వాహనాలను ఆపి, చెక్‌ చేసేందుకు కూడా ముందుకురారు. కేవలం పైసలిస్తే చాలు. లక్షల కొద్దీ కలపను సాఫీ గా.. హద్దులు దాటించి మరీ పంపిస్తారు.

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా నుంచి స్మగ్లర్లు నిజామాబాద్, హైదరాబాద్‌కు అక్రమ కలపను దర్జాగా తీసుకెళ్తున్నారు. ఇటీవల నిర్మల్‌ రూర ల్‌ పోలీసులు పట్టుకున్న కలప కేసే ఇందుకు ఉదాహరణ. ప్రభుత్వం సీరియస్‌గా దృష్టిపెట్టడం, స్వయంగా సీఎం కేసీఆరే రంగంలోకి దిగి, అడవుల నుంచి అక్రమంగా కలప తరలింపు పైన సీరియస్‌ కావడంతో ఇప్పుడు జిల్లా అధి కారుల్లో కాస్త చలనం కనిపిస్తోంది. ఇన్నేళ్లుగా కోట్లాది రూపాయల కలప తరలిపోతున్నా.. తమ శాఖలోనే ఇంటి దొంగలు ఉన్నారని తెలి సినా.. మిన్నుకుండి పోయారు. స్మగ్లర్లు రెండు జిల్లా మధ్య పలువురు అధికారులు, సిబ్బంది, చెట్లను నరికే ముల్తానీలతో కలిసి ఓ రాకెట్‌లా మారి.. ఏకంగా కలప అక్రమ తరలింపునకు ఓ కారిడార్‌గా ఉపయోగించుకున్నారు. ఆదిలాబా ద్‌ నుంచి ఇచ్చోడ వరకు ఉన్న ఏ ఒక్క చెక్‌పో స్టులో అధికారులు, సిబ్బంది ఇన్నేళ్లుగా కలప ను పట్టుకోలేదంటే.. ఏ స్థాయిలో స్మగ్లర్ల నుంచి ముడుపులు అందుతున్నాయో అర్థం చేసుకోవచ్చన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

చేతులెత్తేశారు.. 
ఈనెల 19న నిర్మల్‌ పోలీసులు పట్టుకునే వరకు కలపదందా రాకెట్‌   కొనసాగుతున్న విషయం అటవీశాఖకు తెలియదా..! ఇచ్చోడ నుంచి నిర్మల్‌ మీదుగా నిజామాబాద్‌ వెళ్లాలంటే కనీసం రెండు చెక్‌పోస్టులైనా దాటిపోవాలి. మరి.. ఇన్నేళ్లుగా ఏ ఒక్క చెక్‌పోస్టులో కూడా సంబంధిత అక్రమదందా వాహనాలు పట్టుబడలేదా..! ఇలాంటి ప్రశ్నలు ఇప్పుడు ప్రతి సామాన్యుడిలో తలెత్తుతున్నాయి. ఆదిలాబాద్‌ జిల్లాలో ఉట్నూర్‌ ఎఫ్‌ఎస్‌ఓ రాజేందర్‌ సహకారంతో టేకు చెట్లను తేలికగా నరికివేయించారు. ఇక వాటిని నిజామాబాద్‌ తరలించాలంటే సుమారు 50–55కి.మీ దూరం కలప వాహనాలు నిర్మల్‌ జిల్లాలో ప్రయాణించాల్సి ఉంటుంది. ఈ దూరంలో రెండు మూడు చెక్‌పోస్టులూ ఉన్నాయి.

వీటిని దాటించేందుకూ స్మగ్లర్లు డబ్బులను ఎరగా వేశారు. ఆశించిన డబ్బులు చేతుల్లో పడటంతో సిబ్బంది అక్రమ కలప రవాణాకు గేట్లు ఎత్తివేశారు. తాజా కేసు విచారణలో నిర్మల్‌ దాటిన తర్వాత రెండు జిల్లాల సరిహద్దులో ఉండే సోన్‌ చెక్‌పోస్టు వద్ద సిబ్బంది చేతివాటం బయట పడింది. అధికారులకు తెలియకుండా అక్కడి సిబ్బంది ప్రైవేట్‌గా పెట్టుకున్న సద్ధాం అనే వ్యక్తి స్మగ్లర్లకు పూర్తిగా సహకరించినట్లు పోలీసులు తేల్చారు. అయితే సదరు వ్యక్తితో తమకెలాంటి సంబంధం లేదని, ఎనిమిది నెలల క్రితమే ఆయనను తొలగించామని అటవీశాఖ ఉన్నతాధికారులు చెబుతున్న తీరు చూస్తుంటే.. క్షేత్రస్థాయిలో పనితీరుపై పర్యవేక్షణ లేదన్న విషయం బయట పడుతోంది.

హద్దులు దాటిస్తే.. డబ్బులు 
స్మగ్లర్లు అక్రమంగా తరలిస్తున్న కలపను తమ హద్దులు దాటిస్తే చాలు డబ్బులు సంబంధిత సిబ్బంది ఖాతాల్లోకి వచ్చేస్తాయి. తమ సరిహద్దులను దాటించిన సిబ్బంది అకౌంట్‌లోకి స్మగ్లర్లు నేరుగా డబ్బులను పంపిస్తున్నారని సమాచారం. ఎవరికీ అనుమానం రాకుండా కొంతమంది సిబ్బంది స్మగ్లర్లతో సంబంధాలు కొనసాగించినట్లు తెలుస్తోంది. స్మగ్లర్లు వాహనాల్లో కలప తరలించే సమయంలో తాము పనిచేసే చెక్‌పోస్టుల వద్ద పరిస్థితిని ఎప్పటికప్పుడు వారికి తెలియజేసేవారు. సదరు వాహనాలు తమ చెక్‌పోస్టు పరిధిలోకి రాగానే కనీసం ఆపకుండా, పరిశీలించకుండా పంపించేవారు. ఇలాంటి సందర్భాల్లో స్థానిక చెక్‌పోస్టు అధికారులు సైతం పట్టించుకోకుండా వ్యవహరించడం లేదా తాము కూడా డబ్బులు తీసుకుని వదిలేయడం చేశారన్న ఆరోపణలూ ఉన్నాయి.

నామమాత్రంగానే.. 
ఆదిలాబాద్, నిర్మల్‌ జిల్లాల్లో అటవీశాఖ నిర్వహిస్తున్న చెక్‌పోస్టులు నామ్‌కే వాస్తే.. అన్నట్లుగానే కొనసాగుతున్నాయి. అడవుల్లో నుంచి అక్రమంగా తరలించే కలపను అడ్డుకోవాల్సిన ఈ చెక్‌పోస్టులు స్మగ్లర్ల కోసం చేతులెత్తేస్తున్నాయి. ప్రస్తుతం ఆదిలాబాద్‌–నిజామాబాద్‌ మార్గంలో ప్రధానంగా కలపను తరలించే దారిలో మూడు చెక్‌పోస్టులు ఉన్నాయి. నిర్మల్‌ మీదుగా వచ్చే పాత ఎన్‌హెచ్‌44 మార్గంలో నేరేడిగొండ మండలం ఇస్పూర్‌ వద్ద, సారంగపూర్‌ మండలం చించోలి(బి) క్రాస్‌రోడ్డు వద్ద, సోన్‌ మండలకేంద్రంలో జిల్లా సరిహద్దు వద్ద మూడు చెక్‌పోస్టులు ఉంటాయి. నేరేడిగొండ నుంచి నిర్మల్‌ వరకు ఎన్‌హెచ్‌ 44 బైపాస్‌ రోడ్డులో వస్తే మామడ మండలం మొండిగుట్ట వద్ద గల చెక్‌పోస్టు ఎదురవుతుంది.

ఈ లెక్కన పాత రోడ్డులో వస్తే మూడు, బైపాస్‌లో వస్తే రెండు చెక్‌పోస్టులను స్మగ్లర్లు దాటాల్సి ఉంటుంది. ఇందులో మామడ మండలంలోని మొండిగుట్ట, ఇస్పూర్‌ చెక్‌పోస్టులు నేరేడిగొండ రేంజ్‌ పరిధిలో, సోన్‌ చెక్‌పోస్టు నిర్మల్‌ పరిధిలో ఉంది. ఇలా ప్రధాన రహదారి కాకుండా మరో దారిలో వెళ్లే అవకాశం లేకుండా చుట్టూ అడవులే ఉన్నాయి. స్మగ్లర్లు ఎన్‌హెచ్‌ 44 పై నుంచే కలపను తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఈ లెక్కన ప్రస్తుతం ఉన్న చెక్‌పోస్టుల సిబ్బంది వారితో కుమ్మక్కు కావడంతోనే స్మగ్లర్లు సాఫీగా కోట్లాది రూపాయలు విలువ చేసే కలపను తరలించారు. ప్రస్తుత కేసులో ఒక ప్రైవేటు వ్యక్తిపైనే కేసు నమోదు చేశారు. మిగితా సిబ్బంది, అధికారుల తీరుపైనా దృష్టిపెట్టాలన్న డిమాండ్‌ ఉంది.

విధులకు సిబ్బంది కరువు.. 
జిల్లాలోని చెక్‌పోస్టుల్లో కనీస సిబ్బంది కరువయ్యారు. ఒక్కో చెక్‌పోస్టులో ఒక్కో ఎఫ్‌ఎస్‌ఓ, ఎఫ్‌బీఓ, ఇద్దరు వాచర్‌లు కనీసం ఉండాలి. వీరిని ప్రత్యేకంగా వీటి కోసమే కేటాయించాలి. కానీ ప్రస్తుతం జిల్లాలోని అటవీశాఖ చెక్‌పోస్టుల్లో అరకొర సిబ్బంది కొనసాగుతున్నారు. సోన్, చించోలి(బి) చెక్‌పోస్టుల్లో ఒక్కో ఎఫ్‌బీఓల చొప్పున కొనసాగుతున్నారు. కనీసం 12గంటలకొకరి చొప్పున అధికారులు, సిబ్బంది మారాల్సి ఉంటుంది. కానీ.. ఇప్పుడు ఉన్న ఒకరిద్దరే 24గంటలపాటు విధుల్లో కొనసాగుతున్నారు.

జిల్లా పరిధిలో ఎఫ్‌ఎస్‌ఓ, ఎఫ్‌బీఓల్లో మహిళా అధికారులు ఉన్నారు. వీరికి చెక్‌పోస్టు డ్యూటీలుకేటాయించలేకపోతున్నట్లు పైఅధికారులు చెబుతున్నారు. అక్రమంగా కలప తరలింపును అడ్డుకోవాల్సిన బాధత్య గల చెక్‌పోస్టులపై కావాలనే చిన్నచూపు చూస్తున్నారన్న అనుమానాలూ తలెత్తుతున్నాయి. స్మగ్లర్లకు సహకరించేలా వాటì  పనితీరు ఉందన్న ఆరోపణలూ ఉన్నాయి. సీఎం కేసీఆర్‌ తీసుకుంటున్న కఠిన నిర్ణయాలతోనైనా జిల్లా అధికారులు సీరియస్‌గా చర్యలు చేపట్టాలని జిల్లావాసులు కోరుతున్నారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement