తవ్వేకొద్ది అక్రమాలు


సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : ‘అవుట్‌సోర్సింగ్’ అక్రమాలు జిల్లాలో తవ్వేకొద్దీ వెలుగుచూస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం పనిచేస్తున్న అవుట్‌సోర్సింగ్ ఏజెన్సీల గడువు ముగిసినా.. అధికారులు పది నెలలుగా పాత ఏజెన్సీలనే కొనసాగిస్తుండటం వెనుక పలు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొందరు ప్రజాప్రతినిధుల ఒత్తిళ్ల మేరకు సంబంధిత అధికారులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తుండటం విమర్శలకు దారితీస్తోంది. ఈ అక్రమాల వెనుక రూ.లక్షల్లో ముడుపులు చేతులు మారినట్లు తెలుస్తోంది. అవుట్‌సోర్సింగ్ అక్రమ నియామకాల అంశం ఏకంగా ఉప ముఖ్యమంత్రి రాజ య్య పదవికే ఎసరు పెట్టగా, జిల్లాలో కూడా అదే స్థాయిలో అక్రమాలు వెలుగుచూస్తున్నాయి.

 

 టెండరు ప్రక్రియలో అధికారుల జిమ్మిక్కులు..

 జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో సుమారు 1,500 నుంచి రెండు వేల మంది  అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరికి ప్రతినెలా రూ.కోట్లలో జీతభత్యాలతోపాటు, వీరిని సరఫరా చేస్తున్న ఏజెన్సీలకు రూ.లక్షల్లో ప్రభుత్వం చార్జీలను చెల్లిస్తోంది. ప్రస్తుతం జిల్లాలో ఐదు అవుట్‌సోర్సింగ్ ఏజెన్సీలు పనిచేస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనా శాఖ అధికారి గఫార్ తెలిపారు. ఈ ఏజెన్సీల గడవు 2014 మార్చి 31తోనే ముగిసింది. దీంతో ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం 2014-15 గాను ఈ ఏజెన్సీల ఎంపిక ప్రక్రియను చేపట్టేందుకు కలెక్టర్ ఎం.జగన్‌మోహన్ ఓ కమిటీని నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు.

 

 అదనపు జాయింట్ కలెక్టర్ ఎస్.ఎస్.రాజు నేతృత్వంలోని ఈ కమిటీ ఏజెన్సీల ఎంపిక ప్రక్రియకు 2014 జూన్‌లో శ్రీకారం చుట్టింది. ఆ నెలలో టెండరు నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 24 ఏజెన్సీలు టెండర్లలో పాల్గొన్నాయి. నిర్ణీత తేదీలోగా ఈ టెండర్లను ఓపెన్ చేయాల్సిన అధికారులు కావాలనే జాప్యం చేశారు. అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గి ‘పని ఒత్తిడి’ని సాకుగా చూపి ఈ పక్రియను వాయిదా వేశారు. ఆ తర్వాత టెండర్ల జోలికే వెళ్లలేదు. 2014-15 ఆర్థిక సంవత్సరం మరో రెండు నెలల్లో ముగుస్తున్నా, పదినెలల కాలంగా పాత ఏజెన్సీలకే కట్టబెట్టడం వెనుక ఆంతర్యం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఈ టెండర్ల ప్రక్రియను యథాతథ స్థితిలో కొనసాగించాలని కోర్టు ఆదేశించిందని, న్యాయస్థానం ఆదేశాల మేరకే అవుట్‌సోర్సింగ్ ఎంపిక ప్రక్రియను నిలిపివేశామని ఎంపిక కమిటీ కన్వీనర్ గఫార్ ‘సాక్షి’ ప్రతినిధితో పేర్కొన్నారు. నోటిఫికేషన్‌లో పేర్కొన్న నిర్ణీత తేదీలోగా టెండర్లు ఎందుకు తెరవలేదని ప్రశ్నించగా అది.. జిల్లా ఉన్నతాధికారులకు తెలుసని చెప్పుకొచ్చారు.

 

 అవుట్‌సోర్సింగ్ అక్రమాలపై చర్యలేవీ..?

 జిల్లాలో కొన్ని అవుట్‌సోర్సింగ్ ఏజెన్సీలు పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతున్నాయి. తమ ఉద్యోగుల జీతభత్యాల్లో ఒక్కో ఉద్యోగి వద్ద రూ.వేలల్లో కోత పెడుతూ ప్రతినెలా రూ.లక్షలు దండుకుంటున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఈ మేరకు కొందరు బాధితులు జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా, అధికారులు మాత్రం ఏ ఒక్క ఏజెన్సీపై చర్యలు తీసుకున్న దాఖలాల్లేవంటే.. అధికారులు ఆయా ఏజెన్సీలకు ఏ మేరకు సహకరిస్తున్నారో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.

 

 రాష్ట్రంలో ఈ అవుట్‌సోర్సింగ్ అక్రమ నియామకాల వ్యవహారంలో ఏకంగా ఉప ముఖ్యమంత్రి రాజయ్యపైనే బర్తరఫ్ వేటు వేసిన ప్రభుత్వం.. జిల్లాలో జరుగుతున్న అవుట్ సోర్సింగ్ ఏజెన్సీల అక్రమాలపై ఎందుకు దృష్టిసారించడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం పకడ్బందీగా విచారణ చేపట్టిన పక్షంలో ఈ వ్యవహారం జిల్లా ఉన్నతాధికారుల మెడకు చుట్టుకోవడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top