ఉద్యోగులను తొలగించొద్దు

Coronavirus: KTR Letter to Industrial groups About Employees Job Cuts - Sakshi

లాక్‌డౌన్‌ తర్వాత మళ్లీ పుంజుకుంటాం

పారిశ్రామిక వర్గాలకు కేటీఆర్‌ లేఖ

సీఐఐ సభ్యులతో వీడియో కాన్ఫరెన్స్‌

సాక్షి, హైదరాబాద్‌: కరోనా సవాల్‌ను సమష్టిగా ఎదుర్కోవాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ పిలుపునిచ్చారు. భారతీయ పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) తెలంగాణ చాప్టర్‌ సభ్యులతో శనివారం వీడియో కాన్ఫరెన్స్‌లో కేటీఆర్‌ సంభాషించారు. మరోవైపు పారిశ్రామిక వర్గాలు ఎట్టిపరిస్థితుల్లోనూ ఉద్యోగులను తొలగించవద్దని విజ్ఞప్తి చేస్తూ లేఖ రాశారు. లే ఆఫ్‌లు లేకుండా ఉద్యోగులకు అండగా నిలిచేందుకు అవసరమైతే కంపెనీలు ఇతర ఖర్చులు తగ్గించుకోవాలని సూచించారు. నమ్మకం, భరోసా ద్వారానే లాక్‌డౌన్‌ తర్వాత కూడా పారిశ్రామికాభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. పారిశ్రామిక వర్గాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని కేటీఆర్‌ భరోసా ఇచ్చారు.  

అన్నిరంగాల మద్దతు కోరుతున్నాం 
కరోనా వైరస్‌ వ్యాప్తిని నిరోధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను మంత్రి కేటీఆర్‌ సీఐఐ సభ్యులకు వివరించారు. ప్రస్తుత సంక్షోభంలో పారిశ్రామిక రంగానికి అవకాశాలు ఉన్నాయని, రాబోయే రోజుల్లో హెల్త్‌కేర్, మెడికల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, బయోటెక్‌ రంగాలకు ప్రాధాన్యత ఉంటుందన్నారు. ఆయా రంగాల్లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై విజన్‌ డాక్యుమెంట్‌ రూపొందించాలని సీఐఐ ప్రతినిధులను కేటీఆర్‌ కోరారు. ఎంఎస్‌ఎంఈ రంగానికి సహకారం అందించాలని సీఐఐ ప్రతినిధులు మంత్రిని కోరారు.  

పారిశ్రామిక వర్గాలకు అండగా ఉంటాం 
లాక్‌డౌన్‌ తర్వాత ఆర్థిక అభివృద్ధి తిరిగి గాడిన పడుతుందనే విశ్వాసాన్ని కేటీఆర్‌ వ్యక్తం చేశారు. భవిష్యత్తులో కంపెనీలు తమ కార్యకలాపాలు ప్రారంభించినా భౌతిక దూరానికి ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుందన్నారు. వైద్య రంగంలో మౌళిక సదుపాయాల కల్పనకు కంపెనీలు తమ సీఎస్సార్‌ ని«ధులు వెచ్చించాలని కేటీఆర్‌ కోరారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top