హమ్మయ్యా! రిపోర్ట్‌లన్నీ.. నెగెటివ్‌ | Coronavirus : All Sample Reports Are Negative in Nalgonda | Sakshi
Sakshi News home page

హమ్మయ్యా! రిపోర్ట్‌లన్నీ.. నెగెటివ్‌

Apr 24 2020 8:27 AM | Updated on Apr 24 2020 8:41 AM

Coronavirus : All Sample Reports Are Negative in Nalgonda - Sakshi

సాక్షి, నల్లగొండ : జిల్లాలో కరోనా అనుమానితుల నుంచి సేకరించి పంపిన శాంపిల్స్‌ రిపోర్ట్‌లన్నీ నెగెటివ్‌గా నిర్ధారణ అయ్యాయి. దీంతో జిల్లా అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. బుధవారం సేకరించిన తొమ్మిది శాంపిల్స్‌ సహా మొత్తం రిపోర్ట్‌లన్నీ గురువారం సాయంత్రం అందాయి. కాగా సెకండరీ కాంటాక్ట్‌ శాంపిల్స్‌ తీయొద్దని ఉన్నతాధికారులు పేర్కొనడంతో.. గురువారం ఎవరి నుంచి శాంపిల్స్‌ సేకరించలేదు. 

అధికార యంత్రాంగం పటిష్ట చర్యలు
జిల్లాలో కరోనా వ్యాప్తిని నిరోధించడంలో అధికార యంత్రాంగం చేపట్టిన చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. ఒక వైపు పొరుగున ఉన్న సూర్యాపేట జిల్లాలో రోజురోజుకూ కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో నల్లగొండ జిల్లా ప్రజలు టెన్షన్‌ వాతావరణంలో ఉన్నారు. మూడు రోజుల కిందటి వరకు కేసులు లేకపోయినా.. ఒకే కుటుంబంలో మూడు కేసులు నమోదు కావడంతో జిల్లా యంత్రాంగం మళ్లీ అప్రమత్తమైంది. కరోనా పాజిటివ్‌ వచ్చిన వారు, వారి కుటుంబ సభ్యులు కాంటాక్టు అయిన వారి శాంపిల్స్‌ సేకరించి పరీక్షలకు పంపారు. కాగా, గురువారం సాయంత్రానికి ఆ పరీక్షల నివేదికలు జిల్లా అధికారులకు అందాయి. అందరివీ నెగెటివ్‌గా నిర్ధారణ అయ్యాయి.

ఆ వ్యాపారస్తులకూ నెగిటివ్‌
నల్లగొండ పట్టణంలో కరోనా పాజిటివ్‌ వచ్చినవారు కూరగాయల మార్కెట్,కిరాణం,మెడికల్‌ షాపుల్లో సరుకులు కొనుగోలు చేశారన్న సమాచారం మేరకు వారందరినీ గుర్తించి 66 మందివి, బుధవారం పంపిన 9 శాంపిల్స్‌ అన్నీ నెగెటివ్‌ రిపోర్ట్‌ వచ్చింది. సూర్యాపేట లింక్‌తో ఒకే కుటుంబంలో ముగ్గురికి కరోనా సోకడం కుటుంబాన్ని కలిసినట్లు అనుమానం ఉన్న దాదాపు 90 మంది శాంపిల్స్‌ సేకరించి పంపగా అవి కూడా నెగెటివ్‌ వచ్చాయి. వీటితో ఇప్పటివరకు పాజిటివ్‌ వచ్చిన వారి ప్రైమరీ కాంటాక్ట్‌కు సంబంధించి శాంపిల్స్‌ సేకరణ పూర్తయింది. కాగా సెకండరీ కాంటాక్టు అయిన వారి శాంపిల్స్‌ తీయొద్దని ఉన్నతాధికారుల నుంచి సమాచారం అందింది. ఎవరికైనా అనుమానం ఉంటేనే నమూనాలు తీసుకోవాలని సూచించినట్లు తెలిసింది.

కరోనా కట్టడికి అధికార యంత్రాంగం కృషి..
మొదటి నుంచి జిల్లా యంత్రాంగం పక్కా ప్రణాళికతో కరోనా కట్టడికి పూనుకుంది. జిల్లాలో నల్లగొండ పట్టణం, మిర్యాలగూడ, దామరచర్లలో తొలుత 12 కేసులు నమోదు అయ్యాయి. వీరిలో ఆరుగురు గాంధీ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ కూడా అయ్యారు. మర్కజ్‌ వెళ్లొచ్చిన వారితో వైరస్‌ వ్యాప్తి జరుగుతోందని గుర్తించిన మరుక్షణం కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. మర్కజ్‌ వెళ్లి వచ్చిన వారు, వియత్నాం, బర్మా దేశస్తులను గుర్తించడంతో వారి నుంచి వ్యాప్తిని నిరోధించగలిగారు.

పాజిటివ్‌ వచ్చిన వారి ప్రాంతాల్లో ప్రజలకు బయటకు వెళ్లే అవసరం లేకుండా.. అన్ని రకాల సేవలు అందించారు. దీంతో పన్నెండు రోజుల పాటు జిల్లాలో ఒక్క పాజిటివ్‌ కేసుకూడా నమోదు కాలేదు. మాన్యంచెల్కలో ఒకే ఇంట్లో ముగ్గురికి కరోనా వైరస్‌ సోకడంతో తిరిగి వారి ప్రైమరీ కాంటాక్టులందరినీ గుర్తించి వారికి పరీక్షలు చేయించడం వారికి నెగెటివ్‌ రావడంతో కాస్త ఊపిరిపీల్చుకున్నారు. వైరస్‌ వ్యాప్తిని అరికట్టడంలో వైద్య ఆరోగ్య, పోలీస్, రెవెన్యూ శాఖలు ఎంతో కృషి చేశాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement