కొత్త విద్యాసంవత్సరం ఆలస్యం!

Corona Effect; New Academic Year Is Delayed - Sakshi

పాఠశాలలు, కాలేజీలకు కనీసంగా 220 పనిదినాలు

కరోనా నేపథ్యంలో అవి పూర్తికాకుండానే ముగింపు

ఈ నెలలో టెన్త్‌ పరీక్షల నిర్వహణ అనుమానమే..

నైన్త్‌ వరకు ఆటోమేటిక్‌ పాస్‌పై జారీకాని ఉత్తర్వులు

సాక్షి, హైదరాబాద్‌: విద్యాశాఖలో ఈసారి నిర్దేశిత పని దినాలు పూర్తికాకుండా విద్యా సంవత్సరం ముగుస్తోంది. కరోనా నేపథ్యంలో అకడమిక్‌ కార్యక్రమాలకు 220 పనిదినాలు లేకుండానే విద్యాసంవత్సరం పూర్తి కానుంది. అంతేకాదు ఈ పరిస్థితి ఇంకా ఎన్నాళ్లు కొనసాగుతుందో తెలియని పరిస్థితుల్లో ఎలా ముందుకు సాగాలో అర్థం కాకుండా తయారైంది. విద్యాశాఖ నిబంధనల ప్రకారం ఒక విద్యా సంవత్సరంలో అన్ని సెలవులు పోగా కనీసంగా 220 పనిదినాలు పాఠశాలలు, కాలేజీలు పనిచేయాలి. ఆయా రోజుల్లోనే సిలబస్‌ పూర్తయ్యేలా ముందుగానే ఆయా విభాగాలు అకడమిక్‌ క్యాలెండర్‌ను రూపొందిస్తాయి. అందుకు అను గుణంగా బోధన కార్యక్రమాలను చేపట్టి పూర్తి చేయాల్సి ఉంటుంది. అయితే ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో విద్యా సంస్థలు,ముఖ్యంగా స్కూళ్లన్నీ మూతపడ్డాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం రెండో శనివారాల్లో పని చేసేలా షెడ్యూల్‌ జారీ చేసి పనిదినాలను సర్దుబాటు చేసింది. అయితే ఇప్పుడు కరోనాతో కొత్త సమస్య వచ్చిపడింది.

దీంతో ఈసారి నిర్దేశిత పని దినాలు లేకుండా ఈ విద్యా సంవత్సరం ముగియనుంది. వాస్తవానికి ఏప్రిల్‌ 23వ తేదీ పాఠశాలలకు చివరి పని దినం. కానీ రాష్ట్రంలో కరోనా కారణంగా దాదాపు నెలన్నర రోజుల ముందుగానే పాఠశాలలు బంద్‌ అయ్యాయి. మార్చి 15 నుంచి 31వ తేదీ వరకు సెలవులను ప్రభుత్వం ప్రకటించింది. వాటిని ఈనెల 14వ తేదీ వరకు పొడిగించింది. అంటే అప్పటి వరకు పాఠశాలలు ప్రారంభమయ్యే పరిస్థితి లేదు. పైగా వేసవి ఎండల కారణంగా ఇప్పుడు నిర్వహించాల్సినవి ఒంటి పూట బడులే. అవీ మూత పడ్డాయి. ఈనెల 14 తర్వాత మరో 9 రోజులు గడిస్తే విద్యా సంవత్సరమే పూర్తి కానుంది. అప్పటివరకు కూడా కరోనా అదుపులోకి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో 220 పనిదినాల నిబంధనకు విఘాతం కలుగుతోంది. 40 రోజుల ముందుగానే విద్యా సంవత్సరాన్ని ముగించే పరిస్థితి వచ్చింది. వచ్చేది వేసవి కాబట్టి ఆ 40 రోజులు పాఠశాలలను నిర్వహిద్దామన్నా సాధ్యమయ్యే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో ఏం చేయాలన్న దానిపై విద్యాశాఖలో స్పష్టత లేకుండా పోయింది. దానిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

‘పరీక్షల్లేకున్నా పాస్‌’ఉత్తర్వుల్లో జాప్యం
ముందుగా ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం గత నెల 19న ప్రారంభమైన పదో తరగతి పరీక్షలు ఈనెల 6వ తేదీలోగా పూర్తి కావాలి. కరోనా కారణంగా మార్చి 23వ తేదీ నుంచి నిర్వహించాల్సిన అన్ని పరీక్షలు వాయిదా పడ్డాయి.అకడమిక్‌ కేలండర్‌ ప్రకారం ఒకటో తరగతి నుంచి 9వ తరగతి వరకు ఈనెల 7వ తేదీ నుంచి నిర్వహించాల్సిన పరీక్షలు జరిగేలా లేవు. ప్రభుత్వం అన్ని విద్యా సంస్థలకు ఈనెల 14 వరకు సెలవులను ప్రకటించింది. 15న పాఠశాలలు ప్రారంభ మైనా విద్యా సంవత్సరం ముగిసే 23వ తేదీలోగా పరీక్షలు నిర్వహించే పరిస్థితి లేదు. అందుకే ఒకటో తరగతి నుంచి 9వ తరగతి వరకు విద్యార్థులను ఆటోమేటిక్‌గా పాస్‌ చేసి పైతరగతికి పంపించాలని భావిస్తోంది. అయితే దీనికి సంబంధించిన ఉత్తర్వులను ఇంకా జారీ చేయలేదు. ఈ విషయంలో విద్యాశాఖలో కిందిస్థాయి అధికారులు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. పాఠశాల విద్యా కమిషనర్, విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఒకరే కావడంతో ప్రభుత్వం ఏం ఆలోచిస్తుందన్నది కింది స్థాయి అధికారులకు తెలియని పరిస్థితి. అందుకే ప్రభుత్వం నుంచి నిర్ణయం వచ్చే వరకు వేచి చూడాల్సిందేనని  ఓ ఉన్నతాధికారి చెప్పారు. 

జూన్‌ 1న బడులు ప్రారంభమయ్యేనా?
ఇక కరోనా ప్రభావం ఈ నెలంతా ఉండే పరిస్థితులే కనిపిస్తున్నాయి. మే నెలలో ఆ ప్రభావం ఉండవచ్చన్న ఊహాగానాలు వెలువడుతున్నాయి. అదే జరిగితే జూన్‌ 1న వేసవి సెలవులు ముగిసి, తిరిగి బడులు ప్రారంభం కావడం (కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం) కష్టమేనని అధికారులు పేర్కొంటున్నారు. పరిస్థితులు చక్కబడితే ఈ నెలాఖరులో మిగిలిపోయిన పదో తరగతి పరీక్షలను నిర్వహించే అవకాశముంటుంది. లేదంటే మే నెలలోనే నిర్వహించాల్సి వస్తుంది. దాంతో ప్రాథమిక పాఠశాలలకు బోధించే టీచర్లంతా మే నెలలోనూ ఇన్విజిలేటర్లుగా పని చేయాల్సి వస్తుంది. అంతేకాదు పరీక్షలు అయ్యాక సబ్జెక్టు టీచర్లు జవాబు పత్రాల మూల్యాంకనం చేయాల్సి వస్తుంది. దీంతో వారికి అదనంగా సెలవులు ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి వాటిని సర్దుబాటు చేస్తూ కొత్త విద్యా సంవత్సరాన్ని ఆలస్యంగా ప్రారంభించాల్సి వస్తుందని అధికారులు పేర్కొంటున్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top