పదిలంగా.. ఆ గుండె ప్రయాణం!

Cops provide green channel for transporting heart - Sakshi

8 కిలోమీటర్ల దూరం.. కేవలం 7 నిమిషాల్లో

అందులోనూ సికింద్రాబాద్‌–నాంపల్లి మార్గంలో..

దాత గుండెను రోగి వద్దకు చేర్చిన అంబులెన్స్‌

గ్రీన్‌ చానల్‌ ఇచ్చిన నగర ట్రాఫిక్‌ అధికారులు  

సాక్షి, హైదరాబాద్‌: సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రి, నాంపల్లిలోని కేర్‌ ఆస్పత్రి మధ్య మార్గం అది. నిత్యం రద్దీగా ఉండే ఈ మార్గంలో వాహనాల సరాసరి వేగం 25 కిలోమీటర్లకు మించదు. గురువారం కేర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ మహిళ గుండె మార్పిడి శస్త్రచికిత్స కోసం డోనర్‌ గుండె(లైవ్‌ హార్ట్‌)ను ఆ మార్గంలో తీసుకెళ్లేందుకు నగర ట్రాఫిక్‌ పోలీసులు ‘గ్రీన్‌ చానల్‌’ఇచ్చారు.

ఫలితంగా ఈ 8 కి.మీల మార్గాన్ని అంబులెన్స్‌ కేవలం 7 నిమిషాల్లో అధిగమించింది. మధ్యాహ్నం 12.46కు యశోద ఆస్పత్రి నుంచి అంబులెన్స్‌ బయలుదేరగా.. కేర్‌ ఆస్పత్రికి 12.53కు చేరుకుంది. అనంతరం ప్రారంభమైన ఆపరేషన్‌ సాయంత్రం వరకు సాగింది. ఆపరేషన్‌ విజయవంతమైనట్లు వైద్యులు 6 గంటలకు ప్రకటించారు.

మధ్యాహ్నం మొదలైన ‘ఆపరేషన్‌’..
నగర ట్రాఫిక్‌ విభాగంలో మధ్య, పశ్చిమ మండలాలకు చెందిన అధికారులు, సిబ్బంది చేతుల్లోని వైర్‌లెస్‌ సెట్స్‌ అన్నీ గురువారం మధ్యాహ్నం ఒక్కసారిగా మోగాయి. ‘నాంపల్లి కేర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మేక ఆదిలక్ష్మీ అనే మహిళకు గుండె మార్పిడి చేయాల్సి ఉంది.

ఆమెకు శస్త్రచికిత్స మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం కానుంది. డోనర్‌ ఇస్తున్న గుండె మధ్యాహ్నం 12.45 గంటలకు సికింద్రాబాద్‌ యశోద ఆస్పత్రి నుంచి బయలుదేరుతుంది’అన్నది వాటిలో వినిపించిన సందేశం సారాంశం. దీంతో అన్ని స్థాయిల అధికారులు అప్రమత్తమై రంగంలోకి దిగారు. 12.10 గంటల నుంచే ఈ రూట్‌లో ట్రాఫిక్‌ నియంత్రణ, సమన్వయానికి అవసరమైన చర్యలు మొదలుపెట్టారు.

నిరంతర పర్యవేక్షణ..
డోనర్‌ ఇచ్చిన గుండె ఉన్న బాక్స్‌ను తీసుకెళ్తున్న అంబులెన్స్‌ ఈ రెండు ఆస్పత్రులకు మధ్య ఉన్న 8 కి.మీల దూరాన్ని సాధ్యమైనంత త్వరగా అధిగమించాలనే లక్ష్యంతో ట్రాఫిక్‌ పోలీసులు రంగంలోకి దిగారు. మహంకాళి ఇన్‌స్పెక్టర్‌ నేతృత్వంలోని బృందం ఓ వాహనంలో అంబులెన్స్‌కు ఎస్కార్ట్‌గా వెళ్లడానికి సిద్ధమైంది.

అలాగే ఈ మధ్యలో ఉన్న ప్రతి కూడలిలో అధికారులు సంసిద్ధులయ్యారు. బషీర్‌బాగ్‌ కమిషనరేట్‌లో ఉన్న ట్రాఫిక్‌ కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ (టీసీసీసీ) సిబ్బంది ఈ ప్రయాణం ఆద్యంతం పర్యవేక్షించడానికి, క్షేత్రస్థాయి పరిస్థితులకు అనుగుణంగా సిబ్బందికి సలహాలు, సూచనలు ఇవ్వడానికి ఏర్పాట్లు చేసుకున్నారు.  

పోలీసుల సహకారం మరువలేం
మా అమ్మకి మధ్యాహ్నం 12 గంటలకు ఆపరేషన్‌ మొదలైంది. మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో డోనర్‌ ఇచ్చిన లైవ్‌ హార్ట్‌ ఆపరేషన్‌ థియేటర్‌లోకి చేరినట్లు సమాచారం వచ్చింది. సాయంత్రం 5.20 వరకు సర్జరీ సాగగా.. సక్సెస్‌ అయినట్లు వైద్యులు 6 గంటలకు ప్రకటించారు. ఇందులో భాగస్వామ్యులైన పోలీసులు, ఆస్పత్రి వైద్యులకూ ప్రత్యేక ధన్యవాదాలు. మాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇంతటి సహాయం చేసిన వారి సహకారం మరువలేనిది. –సునంద, ఆదిలక్ష్మీ కుమార్తె

ఇదీ గుండె ప్రయాణం..
మధ్యాహ్నం 12.46 గంటలకు ‘లైవ్‌ హార్ట్‌ బాక్స్‌’తో ఉన్న అంబులెన్స్‌ సికింద్రాబాద్‌ యశోద నుంచి బయలుదేరింది. అక్కడ నుంచి ప్యాట్నీ, బైబిల్‌ హౌస్, కార్బలా మైదాన్, ట్యాంక్‌బండ్, అంబేడ్కర్‌ విగ్రహం, లిబర్టీ, బషీర్‌బాగ్‌ ఫ్లైఓవర్, ఖాన్‌ లతీఫ్‌ ఖాన్‌ ఎస్టేట్, ఉదయ్‌ ఆస్పత్రి, నాంపల్లి స్టేషన్‌ రోడ్, తాజ్‌ ఐలాండ్, గాంధీభవన్‌ మీదుగా ప్రయాణించి సరిగ్గా మధ్యాహ్నం 12.53కు నాంపల్లి కేర్‌కు చేరింది. ఈ మార్గంలోని అన్ని జంక్షన్లనూ ఆపేసిన ట్రాఫిక్‌ పోలీసులు ఈ అంబులెన్స్, పైలెట్‌ వాహనాలకు గ్రీన్‌ చానల్‌ ఇవ్వడంతో 7 నిమిషాల్లో గమ్యం చేరుకున్నాయి. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top