రద్దీ వేళల్లో 16.1 కి.మీలకు తగ్గుతున్న పరిస్థితి
లెక్కకట్టిన అంతర్జాతీయ సంస్థ టామ్ టామ్
ప్రపంచ వ్యాప్తంగా 500 సిటీల్లో కంజెక్షన్ సర్వే
హైదరాబాద్ నగరానికి 47వ ర్యాంక్
2025లో మెరుగుపడిన స్థితిగతులు
సాక్షి, హైదరాబాద్: పెరుగుతున్న వాహనాల సంఖ్య.. ఆక్రమణలతో కుంచించుకుపోతున్న రహదారులు.. వాహన చోదకులు, వ్యాపారుల్లో కొరవడిన స్పృహ.. ఇలా ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఉన్నా... నగరంలో ట్రాఫిక్ చిక్కులు (కంజెక్షన్) మాత్రం తగ్గుతున్నాయి. 2024తో పోలిస్తే 2025లో పరిస్థితులు కొంత మెరుగుపడ్డాయి. కంజెక్షన్ 1.6 పర్సెంటేజ్ పాయింట్స్ తగ్గింది. అలాగే సరాసరి వేగం సాధారణ సమయంలో గంటకు 18.4 కి.మీ, రద్దీ వేళల్లో 16.1గా నమోదైంది. అంతర్జాతీయ సంస్థ టామ్ టామ్ ఈ విషయం ప్రకటించింది. ఈ సంస్థ స్లో మూవింగ్ ట్రాఫిక్ ఇండెక్స్‌ను విడుదల చేసింది. హైదరాబాద్ 2024లో అంతర్జాతీయ స్థాయిలో 18వ ర్యాంక్‌లో ఉండగా.. నిరుడు 47వ స్థానానికి వెళ్లింది. ఎంత తక్కువ ర్యాంక్‌లో ఉంటే అంత ఎక్కువ ట్రాఫిక్ చిక్కులు ఉన్నట్లు లెక్క. ఈ కారణంగానే బెంగళూరు అంతర్జాతీయ స్థాయిలో రెండు, జాతీయ స్థాయిలో తొలి స్థానంలో నిలిచింది. హైదరాబాద్ రోడ్లపై ఓ వాహనం 10 కిలోమీటర్లు వెళ్లాలంటే సరాసరిన 32.37 నిమిషాలు పడుతోంది.
విస్తృతంగా సర్వే
62 దేశాల్లోని 500 నగరాల్లో టామ్ టామ్ సంస్థ సర్వే చేపట్టింది. ఆయా నగరాల జనాభా, అక్కడి వాహనాల సంఖ్య, రోడ్ల శాతం, ట్రాఫిక్ సిబ్బంది సంఖ్యను విశ్లేషించింది. ప్రపంచంలోని ఇతర నగరాలను పోలుస్తూ ర్యాంకింగ్స్ ఇచి్చంది. హైదరాబాదీలు ఏడాదికి 123 పని గంటలు నష్టపోతున్నట్లు లెక్కకట్టింది.
ఆగస్టు 30... దారుణమైన రోజు..
హైదరాబాద్‌లో 2025లో అత్యంత దారుణమైన రోజు ఆగస్టు 30. ఇతర రోజుల్లో సరాసరిన 15 నిమిషాల్లో ఓ వాహనం 4.6 కిమీ ప్రయాణిస్తే.. ఆ రోజు మాత్రం 3.3 కి.మీకే పరిమితమైంది. బేగంపేట, సోమాజిగూడ, పంజాగుట్ట, ఖైరతాబాద్, అమీర్‌పేట, బంజారాహిల్స్, హిమాయత్‌నగర్, మెహిదీపట్నం తదితరాలు తీవ్రమైన ట్రాఫిక్ జామ్స్ ఉండే ప్రాంతాలుగా నమోదయ్యాయి.
ఏదైనా నగరంలో ట్రాఫిక్ నిర్వహణ మెరుగ్గా ఉందా? లేదా? అనేది తేల్చడానికి వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. కేవలం వాహనాల సరాసరి వేగం ఆధారంగా ట్రాఫిక్ స్థితిగతుల్ని అంచనా వేయకూడదు. ఇందులో రోడ్ల వెడల్పు, బాటిల్‌నెక్స్, మౌలిక సదుపాయాలు.. ఇలా అనేకం ముడిపడి ఉంటాయి. కంజెక్షన్ శాతం ఆధారంగానే దీన్ని లెక్కకట్టాలి. ఇది ఎంత ఎక్కువ ఉంటే ట్రాఫిక్ చిక్కులు అంతలా ఉన్నట్లు. ఇది తక్కువగా నమోదవుతున్నప్పుడే పరిస్థితులు మెరుగుడుతున్నట్లు అంచనా వేయాలి.
– ఆర్.ప్రభాకర్, రవాణా రంగ నిపుణుడు


