మధ్యలో హాకా ఏందీ?

Controversy at peaks between Vijaya Dairy and Haca - Sakshi

హాకా ద్వారా అంగన్‌వాడీలకు పాల సరఫరాపై ‘విజయ’  

తమకు తెలియకుండా ఉత్తర్వులెలా ఇస్తారని సర్కారుకు ప్రశ్న 

మంత్రులు తలసాని, తుమ్మల దృష్టికి వివాదం  

సాక్షి, హైదరాబాద్‌: అంగన్‌వాడీ కేంద్రాలకు విజయ సహా ఇతర సహకార డెయిరీల టెట్రా ప్యాక్‌ పాలను సరఫరా చేస్తామని హైదరాబాద్‌ వ్యవసాయ సహకార సంఘం(హాకా) ప్రకటించడంపై విజయ డెయిరీ యాజమాన్యం మండిపడుతోంది. ఇప్పటికే మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖతో ఒప్పందం కుదుర్చుకుని సెప్టెంబర్‌ నుంచి పాల సరఫరాకు హాకా ఏర్పాట్లు చేసుకుంటుండగా.. పాల సరఫరాకు తాము సిద్ధంగా లేమని డెయిరీ స్పష్టం చేసింది. ఈ మేరకు పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌కు తమ నిర్ణయాన్ని వెల్లడించింది.  విజయ డెయిరీ ఎండీ బాధ్యతలు తీసుకున్న శ్రీనివాసరావు ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించినట్లు తెలిసింది. దీంతో ప్రభుత్వ వ్యాపార సంస్థలైన విజయ డెయిరీ, హాకాల మధ్య తీవ్ర అగాథం నెలకొంది.  

మాకు యంత్రాంగం ఉంది 
తాము అంగన్‌వాడీ కేంద్రాలకు నెలకు 5 లక్షల లీటర్ల టెట్రా ప్యాక్‌లను సరఫరా చేస్తున్నామని, కావాలంటే అదనంగా కూడా సరఫరా చేయగలమని విజయ డెయిరీ యాజమాన్యం చెబుతోంది. తాము సరఫరా చేస్తున్నపుడు మధ్యలో హాకా జొరబడాల్సిన అవసరమేంటని అధికారులు ప్రశ్నిస్తున్నారు. తమకు పూర్తి స్థాయి యంత్రాంగం ఉందని, హాకాకు అటువంటి పరిస్థితి లేదంటున్నారు. అంగన్‌వాడీలకు కాకుండా ఏదైనా కొత్త మార్కెట్‌ చూపిస్తే హాకాకు సహకరించేవారమని, కానీ తాము చేస్తున్న మార్కెట్‌ను వారికెందుకు ఇస్తామని ప్రశ్నిస్తున్నారు. తమకు సమాచారం ఇవ్వకుండా హాకా.. మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖలు నిర్ణయించుకుంటే ఎలాగంటున్నారు. దీనిపై సంబంధిత మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు దృష్టికి కూడా తీసుకొచ్చినట్లు తెలిసింది.  

వేరే డెయిరీల నుంచి కొంటాం: హాకా ఎండీ  
ఇప్పటివరకు ధాన్యం కొనుగోలు చేస్తున్న హాకా.. పాల మార్కెట్లోకి రావాలని నిర్ణయించుకుంది. సహకార డెయిరీల నుంచి పాలు కొని అంగన్‌వాడీలకు సరఫరా చేయడం వల్ల ఏడాదికి రూ. కోటి వరకు ఆర్జించాలని భావిస్తోంది. ఇందుకోసం మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ నేపథ్యంలోనే విజయ డెయిరీ నుంచి టెట్రా ప్యాక్‌ పాలను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. కానీ హాకాకు పాలు సరఫరా చేయబోమని విజయ స్పష్టం చేయడంతో కథ అడ్డం తిరిగినట్లయింది. దీనిపై హాకా ఎండీ సురేందర్‌ను వివరణ కోరగా.. విజయ యాజమాన్యం ఇలా ఎందుకు అంటున్నదో అర్థం కావడం లేదన్నారు. విజయకు తొలుత ప్రాధాన్యం ఇస్తామని, లేదంటే ఇతర సహకార డెయిరీల నుంచి కొనుగోలు చేస్తామని చెప్పారు. అంగన్‌వాడీలకు పాలు సరఫరా చేయడానికి ఏర్పాటైన కమిటీ ఈ అంశంపై చర్చించి తుది నిర్ణయం తీసుకుంటుందని పేర్కొన్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top