నన్ను చంపేందుకు కుట్ర

Conspiracy to kill me - Revanth reddy - Sakshi

టీపీసీసీ నేత రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు

సాక్షి, హైదరాబాద్‌: తనను చంపేందుకు కుట్ర పన్నుతున్నారంటూ టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు కేంద్ర బలగాలతో భద్రత కల్పించాలని కేంద్ర హోంశాఖ, కేంద్ర ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ఆదేశించినా భద్రత కల్పించకుండా కుట్ర పన్నారంటూ ఆరోపించారు. తనకు ప్రాణహాని ఉందని పదే పదే ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, తీరా కోర్టు ఆదేశాలను సైతం అమలు చేయకుండా వేధిస్తున్నారంటూ ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం మహబూబాబాద్, నర్సంపేట ఎన్నికల సభల్లో పాల్గొని బేగంపేట్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న రేవంత్‌ అత్యవసర మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొడంగల్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి నరేందర్‌రెడ్డి నివసిస్తున్న ఇంట్లో ఐటీ అధికారులు రూ.17.51 కోట్లు స్వాధీనం చేసుకుంటే ఎన్నికల కమిషన్‌ కేవలం రూ.51 లక్షలు మాత్రమే పట్టుబడినట్టు చెప్పడం వెనుక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఒత్తిడి ఉందని   ఆరోపించారు.  

ఆ లెక్కలన్నీ ఉన్నా..: కొడంగల్‌లో రూ.100 కోట్లు ఖర్చయినా గెలవాలని భావించిన పట్నం బ్రదర్స్‌ నిజ స్వరూపం బయటపడిందని రేవంత్‌ అన్నారు. ఐటీ అధికారుల సోదాలో పోలీసులకు, పార్టీలు మారిన నేతలకు ఎంతెంత వెచ్చించారో రాసుకున్న లెక్కలన్నీ ఉన్నాయని, అది బయటకు రాకుండా గోప్యంగా ఉంచేందుకు ఎన్నికల కమిషన్, ఐటీ అధికారులపై ఒత్తిడి తీసుకువస్తున్నారని ఆరోపించారు. తనను ఓడించేందుకు టీఆర్‌ఎస్‌ మొత్తం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని ఆరోపించారు. తమిళనాడులోని ఆర్కేనగర్‌ తరహాలో కొడంగల్‌లో కూడా ఎన్నిక వాయిదా వేయించడానికి టీఆర్‌ఎస్‌ నేతలు కుట్రలకు తెరలేపారన్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీకి ఇంటెలిజెన్స్‌ డీఐజీ ప్రభాకర్‌రావుతో పాటు మరికొంత మంది పోలీస్‌ ఉన్నతాధికారులు సహకరిస్తున్నారని ఆరోపించారు. తక్షణమే సంబంధిత అధికారులను బదిలీ చేయాలని డిమాండ్‌ చేశారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top