
అభివృద్ధి పనులపై ఉన్నతాధికారులతో సమీక్ష
కొడంగల్: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈనెల 14 లేదా 16వ తేదీన కొడంగల్‌లో పర్యటించనున్నట్లు అధికార వర్గాల సమాచారం. ఈ సందర్భంగా ఆయన నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులపై రాష్ట్ర, జిల్లాస్థాయి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించనున్నట్లు తెలిసింది. ఈ మేరకు స్థానిక అధికారులకు మౌఖిక ఆదేశాలు అందినట్లు సమాచారం.
నియోజకవర్గంలో గడిచిన ఏడాదిన్నర కాలంలో సుమారు రూ.10 వేల కోట్లతో పలు రకాల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ మెడికల్ కళాశాల, వృత్తి విద్యా కళాశాల, ఇంజనీరింగ్ కళాశాల, నర్సింగ్ కళాశాల, వ్యవసాయ పరిశోధనా కేంద్రం, మహిళా డిగ్రీ కళాశాల, పీజీ కళాశాల, జూనియర్ కళాశాలలు, 220 పడకల ప్రభుత్వ టీచింగ్ ఆస్పత్రి, కొడంగల్ – నారాయణపేట ఎత్తిపోతల పథకం, కొడంగల్‌లో రూ.6 కోట్లతో ఆర్‌అండ్‌బీ అతిథి గృహం, రూ.344 కోట్లతో రోడ్ల విస్తరణ పనులు, రూ.30 కోట్లతో పాఠశాలల్లో అదనపు తరగతి గదుల నిర్మాణం, సమీకృత గురుకుల విద్యా సంస్థలు, కొడంగల్‌లో మున్సిపల్ కార్యాలయం, రూ.300 కోట్లతో ఇతర అభివృద్ధి పనులు.. తదితర అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమీక్ష చేయనున్నట్లు తెలిసింది.