కాంగి‘రేసు’లో మిగిలేది ఎవరు..?

Congress MLA Tickets Competition Karimnagar - Sakshi

సాక్షిప్రతినిధి, కరీంనగర్‌: కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులను ఖరారు చేసే పనిలో ఆ పార్టీ అధిష్టానం బిజీబిజీగా ఉంది. ఇంతకాలం కూటమి, పొత్తులపై హడావుడిగా ఉన్న నే తలు.. ఎన్నికల షెడ్యూల్‌ విడుదలతో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియపై వేగం పెంచారు. జిల్లా కాంగ్రెస్‌ కమిటీలు, టీపీసీసీలకు దరఖాస్తు చేసుకున్న ఆశావహుల దరఖాస్తులను పరిశీలిస్తున్నారు. దరఖాస్తుల పరిశీలనలో భాగంగా ప్రదేశ్‌ ఎలక్షన్‌ కమిటీ (పీఈసీ) మంగళవారం హైదరాబాద్‌లోని గండిపేటలో భేటీ అయ్యింది.

ఈ సమావేశానికి ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా అధ్యక్షుడు కటుకం మృత్యుంజయం, ఎన్నికల కమిటీ, ఇతర కమిటీల సభ్యులుగా ఉన్నవారు కూడా హాజరయ్యారు. కరీంనగర్, హుజూరా బాద్, చొప్పదండి, మానకొండూరు నియోజకవర్గాల నుంచి ఇప్పటివరకు డీసీసీకి 32 మంది దరఖాస్తు చేసుకోగా, ప్రధానంగా అభ్యర్థుల జాబితాలో వినిపిస్తున్న పలువురు పేర్లు లేవు. అలాంటి వారు టీపీసీసీ ద్వారా కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని తెలిసింది. ప్రదేశ్‌ ఎలక్షన్‌ కమిటీ బుధవారం కూడా సమావేశం కానున్నందునా.. ఆ భేటీ అనంతరం ఏఐసీసీ స్క్రీనింగ్‌ కమిటీకి ఒక్కో నియోజకవర్గం నుంచి మూడు, నాలుగు పేర్లను పంపనున్నట్లు తెలిసింది. ఆ తర్వాత ఫ్లాష్‌ సర్వేలు, పార్టీ మార్గదర్శకాలు, నిబంధనలకు అనుగుణంగా అభ్యర్థులను ఏఐసీ సీ ప్రకటించే అవకాశం ఉందని సమాచారం.

ఆశావహులకు సంకటంగా ‘మూడు సూత్రాలు’..
ముందస్తు పోరులో పాల్గొనే అభ్యర్థుల విషయంలో కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం ఆచీతూచీ నిర్ణయం తీసుకోనుందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అభ్యర్థుల ఎంపి క కోసం ప్రధానంగా మూడు నిబంధనలు విధించినట్లు వార్తలు వస్తున్నాయి. మొదటిది వరుసగా మూడుసార్లు ఓడిపోయిన వారికి టికెట్‌ ఇవ్వరాదన్న నిబంధన. రెండోది గత ఎన్నికల్లో 30 వేల కంటే ఎక్కు వ ఓట్ల మెజారిటీతో ఓడిపోయిన వారిని పక్కన బెట్టా లని, అదేవిధంగా 2014 ఎన్నికల్లో 25 వేల కంటే తక్కు వ ఓట్లు వచ్చిన వారికి అవకాశం ఇవ్వరాదని నిర్ణయం తీసుకున్నారు.

ఇవన్నీ దరఖాస్తు చేసుకున్న పలువురికి సంకటం కానుండగా.. కొత్తగా, మొదటిసారి దరఖాస్తు చేసుకునే వారికి కలిసొచ్చే అవకాశంగా భావిస్తున్నారు. ఇదే సమయంలో డీసీసీ, టీపీసీసీలకు వివిధ నియోజకవర్గాల నుంచి దరఖాస్తు చేసుకున్న పలువురు టిక్కెట్‌ కోసం ఎవరికి వారుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదిలా వుంటే కాంగ్రెస్‌ అధిష్టానం మూడు సూత్రాలను ప్రామాణికంగా తీసుకుంటే మాజీ మంత్రి సుద్దాల దేవ య్య, మాజీ విప్‌ ఆరెపల్లి మోహన్‌కు సంకటం కానుండగా, ప్రజలతో సత్సంబంధాలు, పార్టీ నిర్వహించే ఫ్లాష్‌ సర్వేలతో ఉపశమనం కలిగించనున్నాయి. బుధవారం జరిగే సమావేశంలో మరిన్ని కీలక నిర్ణయాలు వెల్లడించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి.
 
కరీంనగర్‌ నియోజకవర్గానికి 1952 నుంచి 2014 వరకు 14 ఎన్నికలు జరిగితే 11 సార్లు పోటీ చేసిన కాంగ్రెస్‌ పార్టీ ఐదు సార్లు గెలిచింది. 2004లో చివరగా ఎం.సత్యనారాయణరావు (ఎమ్మెస్సార్‌) గెలిచా రు. 2009, 2014లలో వరుసగా కాంగ్రెస్‌ అభ్యర్థి చల్మెడ లక్ష్మీనర్సింహారావు ఓడిపోయారు. రెండోసారి 25,670 ఓట్లతో వెనుకబడి పోయారు. ఈ సారి కరీంనగర్‌ నుంచి 12 మంది పేర్లు వినిపిస్తుండగా, 10 మంది డీసీసీలో దరఖాస్తు చేసుకున్నారు. చల్మెడ లక్ష్మీనర్సింహారావు ఈ ఎన్నికలకు దూరంగా ఉంటానని చెప్తుండగా, పొన్నం ప్రభాకర్, కటుకం మృత్యుంజయంల పేర్లు తెరమీదకు వచ్చాయి.

చొప్పదండి (ఎస్సీ రిజర్వుడు) స్థానంలో 1957 నుంచి 2014 వరకు 11 సార్లు ఎన్నికలు జరిగితే.. రెండు సార్లు గెలిచిన కాంగ్రెస్‌ అభ్యర్థులు, తొమ్మిది సార్లు ఓటమి చెందారు. 2009 ఎన్నికల్లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన సుద్దాల దేవయ్య 2014 ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో సమీప ప్రత్యర్థి, టీఆర్‌ఎస్‌ అభ్యర్థి బొడిగె శోభ, సుద్దాల దేవయ్యపై 54,891 ఓట్లతో గెలుపొందారు. ఈ నియోజకవర్గం నుంచి అత్యధికంగా డీసీసీకి 14 మంది దరఖాస్తు చేసుకోగా, ‘మూడుసూత్రాల’ను అమలు చేస్తే సు ద్దాల దేవయ్యకు పార్టీ టికెట్‌ వచ్చే అవకాశం లేదు. ఈ స్థానం నుంచి కొత్తవారికే చాన్స్‌ దక్కనుంది.

హుజూరాబాద్‌ నియోజకవర్గంలో 1952 నుంచి 2014 వరకు 16 పర్యాయాలు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. 1952, 1957లలో ద్విశాసనసభ స్థానంగా ఉన్న హుజూరాబాద్‌ నుంచి 2014 ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థికే తిరి సుదర్శన్‌రెడ్డి టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఈటల రాజేందర్‌పై 57,037 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆయన రెండేళ్ల క్రితం చనిపోగా, ఇక్కడి నుంచి ఐదుగురు టికెట్‌ కోసం జిల్లా కాంగ్రెస్‌ కమిటీలో దరఖాస్తు చేసుకున్నారు. ఇక్కడి నుంచి ఆశిస్తున్న అందరూ కొత్త వారే కావడంతో ‘మూడు సూత్రాల’ పరిధిలోకి వచ్చే అవకాశం లేదు. దీంతో ఇక్కడ కూడా కొత్తవారికే అవకాశం.
 
ఎస్సీ రిజర్వుడు స్థానం మానకొండూరు నియోజకవర్గంలో 1962 నుంచి 2014 వరకు 12 సార్లు ఎన్నికలు జరిగాయి. 1992 నుంచి 2004 వరకు నేరెళ్ల నియోజకవర్గంగా, 2009 నుంచి మానకొండూరుగా మారిన ఈ నియోజకవర్గం నుంచి 12 సార్లు పోటీ చేస్తే.. నాలుగు సార్లు కాంగ్రెస్‌ పార్టీ, ఒకసారి కాంగ్రెస్‌(ఐ) గెలుపొందింది. గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి రసమయి బాలకిషన్‌పై కాంగ్రెస్‌ అభ్యర్థి ఆరెపల్లి మోహన్‌ 46,922 ఓట్ల తేడాతో ఓడిపోయారు. మూడు సూత్రాలలో భాగంగా 30 వేల పైబడిన మెజార్టీతో ఓడిపోయిన వారి అభ్యర్థిత్వంపై కూడా పరిశీలన చేస్తారన్న ప్రచారం నేపథ్యంలో మానకొండూరు టికెట్‌పైనా చర్చ జరిగే అకాశం ఉంది. కాగా, ఈ నియోజకవర్గం నుంచి డీసీసీకి ముగ్గురు దరఖాస్తు చేసుకున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top