నిబంధనల.. తకరారు!

Congress MLA Candidates New Terms Nalgonda - Sakshi

సాక్షిప్రతినిధి, నల్లగొండ : అభ్యర్థుల ఎంపిక దశలోనే కాంగ్రెస్‌ వడబోత కార్యక్రమం మొదలు పెట్టింది. టీఆర్‌ఎస్‌ తన అభ్యర్థులను ప్రకటించి నెల రోజులు గడిచిపోయింది. ఇన్నాళ్లూ ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించిన కాంగ్రెస్‌ మాత్రం ఇంకా ప్రకటించలేదు. వివిధ రాజకీయ పక్షాలతో కూటమి గట్టే పనిలో ఉన్న ఆ పార్టీ నాయకత్వం పూర్తిగా ఆ అంశంపైనే దృష్టిపెట్టిందని చెబుతున్నారు. ఇక, కాంగ్రెస్‌ పార్టీలోనూ ఆశావహుల సంఖ్య విపరీతంగా పెరిగిపోవడం, కూటమి సర్దుబాట్లు సమస్యగా మారడం, ఏకాభిప్రాయ సాధన కష్టంగా కనిపిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్‌ నాయకత్వం వడబోతకు కొన్ని కొత్త నిబంధనలు పెడుతోందని పార్టీ వర్గాల సమాచారం.

ఆ నిబంధనల పరిధిలోకి వచ్చే వారికి తేలిగ్గా టికెట్‌ నిరాకరించవచ్చన్నది నాయకత్వం ఆలోచనగా ఉందని పేర్కొంటున్నారు. అధినాయకత్వం సూచిస్తున్న ఈ నిబంధనలు నిజంగానే అమలు చేస్తే ఆయా నియోజకవర్గాల్లో టికెట్‌ పోటీ దారుల సంఖ్యను గణనీయంగా తగ్గించవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. గత ఎన్నికల్లో పోటీ, వచ్చిన ఓట్లు, ఎంత తేడాతో ఓడిపోయారు, ఎన్ని పర్యాయాలు పోటీ చేశారు, ఎన్ని సార్లు ఓటమి పాలయ్యారు తదితర  అంశాలన్నింటినీ టికెట్ల కేటాయింపులో పరిగణనలోకి తీసుకోనున్నారని పేర్కొంటున్నారు.

మూడు నిబంధనల .. అడ్డుగోడ
పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతున్న మేరకు.. కనీసం మూడు నిబంధనల పరిధిలోకి రాని వారి పేరునే టికెట్ల కేటాయింపు దశలో పరిశీలనలోకి తీసుకుంటారని అంటున్నారు. వరుసగా మూడు ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన వారికి ఈసారి టికెట్‌ లభించడం దుర్లభమని సమాచారం. గత ఎన్నికల్లో 30వేల ఓట్ల తేడాతో ఓడిపోయిన వారు, కనీసం 25వేల ఓట్లు సాధించలేని వారిని పరిగణలోకి తీసుకునే అవకాశాల్లేవని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఇక, ఒక కుటుంబంలో ఒకరికే టికెట్‌ అన్న నిబంధన ఉందా, లేదా అన్న అంశంపై పార్టీ నాయకత్వం స్పష్టత ఇవ్వడం లేదంటున్నారు. ముందునుంచీ జరుగుతున్న ప్రచారం మేరకైతే ఈ నిబంధన కూడా ఉందని అంటున్నారు. పై మూడు నిబంధనల ప్రభావం ఉమ్మడి నల్లగొండ జిల్లాలో దాదాపు ఉండదు. ఒక కుటుంబానికి ఒకే టికెట్‌ నిబంధన అమలైతే మాత్రం నలుగురు నాయకులకు ఇబ్బందికి మారనుందని విశ్లేషిస్తున్నారు.

నియోజకవర్గాల్లో .. ఇదీ పరిస్థితి
కాంగ్రెస్‌ అధిష్టానం అమలు చేయబోతోందని చెబుతున్న నిబంధనలు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఎలాంటి ప్రభావం చూపే అవకాశం లేదు. నాగార్జునసాగర్‌ నుంచి సీఎల్పీ మాజీ నేత కె.జానారెడ్డి ఇప్పటికి ఏడు పర్యాయాలు విజయం సాధించారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి నాలుగు పర్యాయాలు, సీఎల్పీ మాజీ ఉప నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్లగొండ నుంచి నాలుగు సార్లు గెలిచారు. సూర్యాపేటలో గత ఎన్నికల్లో ఆర్‌.దామోదర్‌ రెడ్డి ఓటమి పాలైనా ఐదు సార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. కోదాడలో పద్మావతి సిట్టింగ్‌గా ఉన్నారు. ఆలేరులో డీసీసీ అధ్యక్షుడు బూడిద భిక్షమయ్య గౌడ్‌ గత ఎన్నికల్లో 32వేల ఓట్ల తేడాతో ఓడిపోయినా, ఆయన ఆ ఎన్నికల్లో 60వేల పైచిలుకు ఓట్లు సొంతం చేసుకున్నారు.

మునుగోడులో కాంగ్రెస్‌ అభ్యర్థులు పోటీ చేసి చాలా సంవత్సరాలే గడిచిపోయింది. ఇక్కడ దాదాపు ప్రతి ఎన్నికల్లో పొత్తులో భాగంగా సీపీఐ పోటీ చేస్తూ వస్తోంది. దేవరకొండలోనూ సీపీఐకే సీటు కేటాయిస్తున్నారు. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఇక్కడి నుంచి గెలిచినా, సిట్టింగ్‌ను కాదనుకుని 2014 ఎన్నికల్లో సీపీఐకి టికెట్‌ ఇచ్చారు. ఇక, మిర్యాలగూడలో గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలిచినా, ఆయన ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా ఉన్నారు. భువనగిరిలోనూ కాంగ్రెస్‌ ఓడిపోయినా, గత ఎన్నికల్లో ఓటమిపైన నాయకుడు కాకుండా తెరపైకి కొత్త నేత వచ్చారు.

మిర్యాలగూడలోనూ కొత్త నాయకుడే అభ్యర్థి కానున్నారు. తుంగర్తిలోనూ కాంగ్రెస్‌ ఓడిపోయినా, ఓట్ల తేడా చాల స్వల్పం కావడంతో గత ఎన్నికల్లో ఓటమి పాలైన అద్దంకి దయాకర్‌కే మళ్లీ టికెట్‌ ఇవ్వాల్సి వచ్చినా ఆ ఓటమి పెద్ద అడ్డంకి కాబోదన్న అభిప్రాయంవ్యక్తం అవుతోంది. నకిరేకల్‌లోనూ గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓడిపోయింది. అంతకు ముందటి ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన చిరుమర్తి లింగయ్య గత ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో మాత్రమే ఓడిపోయారు. దీంతో ఈసారి టికెట్‌ కేటాయింపునకు ఇది ఏమాత్రం సమస్య కాబోదంటున్నారు.  ఇలా.. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పన్నెండు నియోజకవర్గాల్లోనూ కాంగ్రెస్‌ అధిష్టానం అమలు చేయబోతోందన్న నిబంధనలు ప్రభావం చూపే అవకాశాలు దాదాపుగా లేవు.

కుటుంబానికి ఒక టికెట్‌ మాత్రమే అయితే..
ఒక కుటుంబం నుంచి ఒకరికే టికెట్‌ అంటే మాత్రం ముగ్గురు, నలుగురు నాయకులకు సమస్య కానుంది. సీనియర్‌ నేత జానారెడ్డి తన తనయుడు రఘువీర్‌ రెడ్డికీ టికెట్‌ కావాలంటున్నారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ దంపతులు హుజూర్‌నగర్, కోదాడల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కోమటిరెడ్డి సోదరుల్లో రాజగోపాల్‌రెడ్డి ఇప్పటికే శాసన మండలి సభ్యుడిగా ఉన్నారు. మరో సీనియర్‌ నాయకుడు, మాజీ మంత్రి ఆర్‌.దామోదర్‌ రెడ్డి తన వారసునిగా తనయుడిని ఈ ఎన్నికల్లో అరంగేట్రం చేయించాలని భావిస్తున్నారు. కుటుంబానికి ఒకటే టికెట్‌ నిబంధన నిజంగానే అమలైతే వీరందరి పరిస్థితి ఏమిటన్న చర్చ ఆసక్తి రేపుతోంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top