ముడి వీడుతోంది! 

Congress MLA Candidate Ready To Final List Adilabad - Sakshi

సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీ టికెట్ల ముడి వీడుతోంది. జిల్లా, రాష్ట్ర పార్టీల నుంచి వచ్చిన ఆశావహుల జాబితాలను పరిశీలించిన భక్తచరణ్‌దాస్‌ నేతృత్వంలోని స్క్రీనింగ్‌ కమిటీ ఏ నియోజకవర్గంలో ఎవరికి సీటిస్తే గెలిచే అవకాశాలు ఉంటాయనే నివేదికను ఏఐసీసీ సెంట్రల్‌ ఎలక్షన్‌ కమిటీకి అందజేసింది. సెంట్రల్‌ ఎలక్షన్‌ కమిటీతో బుధవారం కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి కుంతియా, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి , ప్రచార కమిటీ కన్వీనర్‌ మల్లు భట్టి విక్రమార్క తదితరులు భేటీ అయినట్లు సమాచారం.

ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ తుది పరిశీలన తరువాత అభ్యర్థుల జాబితా విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే అభ్యర్థుల జాబితా ప్రకటించిన తరువాత రెబల్స్‌గా బరిలో నిలిచే అవకాశం లేని అభ్యర్థులను తొలి జాబితాగా ప్రకటించనున్నట్లు సమాచారం.  ఈ క్రమంలో ఆదిలాబాద్‌ ఉమ్మడి జిల్లాకు చెందిన పది నియోజకవర్గాల్లో కూడా తొలి జాబితాలో ముగ్గురు నుంచి ఐదుగురి పేర్లు ఉండొచ్చని పార్టీ వర్గాల నుంచి అందిన సమాచారం.

మూడు సీట్లు ఇప్పటికే ఖరారు
ఉమ్మడి జిల్లాలో వివాదం లేని సీట్లలో ఇప్పటికే అభ్యర్థులు ఖరారయ్యారు. నిర్మల్‌ నుంచి డీసీసీ అధ్యక్షుడు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, ఆసిఫాబాద్‌ నుంచి మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కుతో పాటు టికెట్టు హామీతోనే కాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎంపీ రాథోడ్‌ రమేష్‌కు ఖానాపూర్‌ సీటును ఖరారు చేశారు.  ఈ మూడు సీట్లతో పాటు బెల్లంపల్లి సీటును సీపీఐకి ఇవ్వాలని కూడా నిర్ణయించారు. మిగతా ఆరు సీట్ల విషయంలో ఓ నిర్ణయానికి వచ్చినప్పటికీ, రెండో జాబితాలో విడుదల చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. 

స్థానిక అంశాలే ప్రాతిపదిక
టికెట్టు కోసం తీవ్ర పోటీ ఉన్న సీట్ల విషయంలో స్థానిక అంశాలను, సామాజిక సమీకరణాలను, ప్రజల్లో ఎవరికి పట్టు ఉందన్న అంశాలను పరిగణలోకి తీసుకున్నట్లు తెలిసింది. ఒకరికి టికెట్టు ఇచ్చినప్పుడు మరో నాయకుడు రెబల్‌గా బరిలోకి దిగే అవకాశాలున్నాయని భావించిన సీట్ల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని పార్టీ యోచిస్తోంది. ఇలాంటి సీట్ల విషయంలో పోటీలో ఉన్న మరో నాయకుడితో మాట్లాడి ఒప్పించి టికెట్లు ప్రకటించాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం.

మంచిర్యాలలో మాజీ ఎమ్మెల్సీ కె.ప్రేంసాగర్‌రావుకు సీటిస్తే మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవింద్‌రెడ్డి నుంచి వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశం ఉం ది. అరవింద్‌రెడ్డికి టికెట్టు ఇచ్చినా అదే పరిస్థితి. ఈ నేపథ్యంలో ఎవరికి టికెట్టు ఇస్తున్నారో ఇద్దరికి తెలియజేసి, అందుకు గల కారణాలను వివరించాలని అధిష్టానం భావిస్తోంది. అందుకే మం చిర్యాలతో పాటు చెన్నూరు, ఆదిలాబాద్, సిర్పూ రు టికెట్లు రెండో జాబితాలో ప్రకటించాలని భావిస్తోంది. ఈ నియోజకవర్గాల్లో ప్రాధాన్యత క్రమంలో ఎవరికి సీటివ్వాలనే అంశంపై ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చారని సమాచారం. 

టీజేఎస్‌కు ఏ స్థానం..?
ప్రొఫెసర్‌ కోదండరాం నేతృత్వంలోని తెలంగాణ జన సమితి ఉమ్మడి జిల్లాలో మూడు సీట్లను ఆశిస్తోంది. అయితే టీజేఎస్‌కు ఆఫర్‌ చేసినట్టుగా చెపుతున్న సీట్లలో ఈ మూడు లేవు. చెన్నూరు సీటు కోసం పట్టు పడుతున్నట్లు వార్తలు వస్తున్నప్పటికీ, అక్కడ కాంగ్రెస్‌ పోటీ చేస్తేనే టీఆర్‌ఎస్‌ అభ్యర్థి బాల్క సుమన్‌కు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉన్నట్లు సర్వే నివేదికల ద్వారా తేలినట్లు సమాచారం. రాహుల్‌గాంధీ సన్నిహితుడైన కొప్పుల రాజు ఆశీస్సులతో ఇక్కడ బోర్లకుంట వెంకటేశ్‌ నేత ప్రచారం సాగిస్తున్నారు.

ఈనేపథ్యంలో చెన్నూరు టీజేఎస్‌కు ఇచ్చే అవకాశం లేదు. ఆసిఫాబాద్‌లో మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు సీటు దాదాపుగా ఖరారైంది. గతంలో గెలిచిన ఈ సీటును కాంగ్రెస్‌ వదులుకునేందుకు సిద్ధంగా లేదు. మిగిలిన సీటు ముథోల్‌ ఒక్కటే. భైంసాలో రాహుల్‌గాంధీ బహిరంగసభ విజయవంతమైన నేపథ్యంలో కాంగ్రెస్‌ ఆశావహులు ఈ సీటు మీద ఆశలు పెట్టుకున్నారు. రామారావు పటేల్, నారాయణరావు పటేల్, విజయకుమార్‌రెడ్డి వంటి నేతలు పోటీ పడ్డారు. రామారావు పటేల్‌కు సీటొచ్చే అవకాశాలున్నట్లు ప్రచారం జరిగింది. అయితే ఉమ్మడి జిల్లాలో తమకు సీటు కావాలని టీజేఎస్‌ గట్టి పట్టు పడితే ముధోల్‌ కేటాయించే అవకాశం ఉంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top