పార్లమెంట్‌ ఎన్నికలపై కాంగ్రెస్‌ సన్నాహక సమావేశం 

Congress Meeting Of Lok Sabha Elections Mahabubnagar - Sakshi

హైదరాబాద్‌లో కాంగ్రెస్‌ నేతల ప్రత్యేక సమావేశం 

దిశానిర్దేశం చేసిన పార్టీ ఇన్‌చార్జ్‌ కుంతియా, ఉత్తమ్‌ 

స్టేషన్‌ మహబూబ్‌నగర్‌: రానున్న పార్లమెంట్‌ ఎన్నికలకు పార్టీ శ్రేణులకు సిద్ధం చేసేలా కాంగ్రెస్‌ అధిష్టానం రంగంలోకి దిగింది. ఈ మేరకు పార్లమెంట్‌ స్థానాల వారీగా నేతలతో సమావేశాలు నిర్వహించి వారి అభిప్రాయాలు సేకరిస్తున్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో శనివారం మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్‌ పార్లమెంట్‌ నియోజకవర్గాల స్థాయి సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎంపీ నంది ఎల్లయ్య, ఏఐసీసీ కార్యదర్శులు చిన్నారెడ్డి, వంశీచంద్‌రెడ్డి, సంపత్‌కుమార్, మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి, మాజీ ఎంపీ డాక్టర్‌ మల్లు రవి, డీసీసీ అధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వాల్‌తోపాటు మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

పార్లమెంట్‌ ఎన్నికల్లో చేపట్టనున్న ప్రణాళికలు, కార్యక్రమాలపై చర్చించారు. ఈ సందర్భంగా పార్టీ తెలంగాణ ఇన్‌చార్జీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ఆర్‌సీ.కుంతియా, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి దిశానిర్దేశం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కడ ఓట్లు తగ్గాయో తదితర అంశాలను ఆరా తీశారు. టీఆర్‌ఎస్‌కు ఓటేస్తే బీజేపీకి వేసినట్లేనని ప్రచారం చేసి మైనార్టీలను కాంగ్రెస్‌ వైపు ఆకర్షితులను చేయాలని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన మాత్రాన నేతలు, కార్యకర్తలు ఆందోళన పడొద్దని, ఈ పార్లమెంట్‌ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపే ధ్యేయంగా కష్టపడాలని పిలుపునిచ్చారు.

పార్లమెంట్‌ ఎన్నికల కంటే 45 రోజుల ముందే అభ్యర్థులను ప్రకటించాలని మెజార్టీ నేతలు ఏఐసీసీ నేతల దృష్టికి తీసుకొచ్చారు. ఇక సీనియర్లతో చర్చించి మహబూబ్‌నగర్‌ పార్లమెంట్‌ స్థానం పోటీపడుతున్న అభ్యర్థుల జాబితాను ఆదివారం లోగా గాంధీభవన్‌లో సమర్పించాలని డీసీసీ అధ్యక్షుడికి సూచించినట్లు తెలిసింది. మండల స్థాయిల్లో నేతల అభిప్రాయం మేరకు సాధ్యమైనంత తక్కువ మందితో జాబితాను అందజేయాలని చెప్పినట్లు సమాచారం. కాగా, ఈ సమావేశానికి కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డితో పాటు డీకే.అరుణ, రేవంత్‌రెడ్డి హాజరుకాకపోవడం గమనార్హం.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top