వీఆర్‌ఏ పదోన్నతుల్లో గందరగోళం

Confused In The VRA Promotions - Sakshi

నిబంధనలకు పాతర..అనర్హులకు పెద్దపీట

బ్యాన్‌ పీరియడ్‌లో ఎంపికైన వారికీ జాబితాలో చోటు

ఉమ్మడి జిల్లాలో 81 మందికి వీఆర్వోలుగా పదోన్నతి కల్పిస్తూ ఉత్తర్వులు

సాక్షి, మహబూబ్‌నగర్‌ న్యూటౌన్‌ : గ్రామ రెవెన్యూ సహాయకు(వీఆర్‌ఏ)లకు వీఆర్వోలకు పదోన్నతులు కల్పించిన సందర్భంగా గందరగోళం నెలకొంది. నిబంధనలకు పక్కన పెట్టి అనర్హులకు పదోన్నతులు కల్పించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొందరి నియామకాలే అడ్డదారిలో జరిగాయనే ఆరోపణలు ఉండగా.. అలాంటి వారికి ఇప్పుడు పదోన్నతుల్లో అవకాశం కల్పించడంతో పాటు అర్హులకు అన్యాయం జరిగిందనే విమర్శలు వచ్చాయి. దీంతో ఏళ్ల తరబడి పదోన్నతుల కోసం ఎదురుచూస్తున్న గ్రామ రెవెన్యూ సహాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమగ్ర విచారణ తర్వాతే పదోన్నతులు కల్పించాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు.

మొదటి నుంచి చెబుతున్నా..
ఎంతో కాలంగా సీనియారిటీ జాబితా, పదోన్నతుల జాబితాలను తయారు చేస్తుండగా పలు తప్పులు దొర్లాయని సంఘాలు ఎత్తి చూపుతూనే ఉన్నా అధికారులు పట్టించుకోలేదు. చివరకు బుధవారం 81 మంది వీఆర్‌ఏలకు పదోన్నతులు కల్పిస్తూ రూపొందించిన ఫైల్‌ను కలెక్టర్‌ ఆమోదించగా.. అందులో చాలా మంది అనర్హులు ఉన్నారని ఆరోపణలు వచ్చాయి. పదోన్నతుల జాబితాలో 16 మంది బ్యాన్‌ పీరియడ్‌లో ఎంపికైన వారు ఉన్నారని వీఆర్‌ఎ సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. పదోన్నతుల సందర్భంగా కలెక్టర్‌ను సైతం కొందరు అధికారులు తప్పుదోవ పట్టించారనే విమర్శలు వినిపిస్తున్నాయి. పదోన్నతుల జాబితాలో పేర్లు ఉన్న వీఆర్‌ఏల ఎంపిక, అర్హతలు, ఎంపికైన విధానంలో ఏ మాత్రం స్పష్టత లేదని చెబుతున్నారు.

చక్రం తిప్పిన రిటైర్ట్‌ ఉద్యోగి
వీఆర్‌ఏల పదోన్నతుల్లో కలెక్టరేట్‌లో సంబంధిత విభాగంలో ఔట్‌ సోర్సింగ్‌ పద్ధతిపై పని చేస్తున్న ఓ రిటైర్డు ఉద్యోగి చక్రం తిప్పినట్లు తెలిసింది. జాబితా రూపకల్పనలో అక్రమాలకు పాల్పడటమే కాకుండా అధికారులను తప్పుదోవ పట్టించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయనతో పాటు కలెక్టరేట్‌లో కీలక అధికారికి నమ్మిన వ్యక్తులుగా ఉన్న మరో ఇద్దరు.. పైరవీకారులకు కొమ్ము కాసి కలెక్టరేట్‌ ప్రతిష్టను దిగజార్చారని వీఆర్‌ఏ సంఘాల నాయకులు ఆరోపించారు.

అప్పట్లో కావలికారులు
పూర్వ కాలం నుండి గ్రామాల్లో కావలి కారులుగా చెప్పుకునే వీరు అప్పట్లో గ్రామాల్లో పట్టాదారుతో పాటు పాలేరులంతా వంతుల వారీగా విధులు నిర్వహించేవారు. రాను రాను పట్టాదారు చనిపోయిన స్థానాల్లో వారసత్వంగా వారి కుమారులు, కుమార్తెలు, భార్యకు కావలికారు ఉద్యోగం ఇచ్చేవారు. ఇలా కాకుండా కొందరు చనిపోయిన వారి స్థానంలో అప్పటి తహసీల్దార్లను మచ్చిక చేసుకుని ఇతరులను సైతం నియమించారు. కొందరి వద్ద డబ్బులు తీసుకుని పైరవీకారులు నకిలీ ఎంపిక పత్రాలు ఇవ్వడం కలకలం రేపింది. ప్రజావాణిలో ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా విచారణకు కొద్ది కాలం క్రితం జిల్లా కలెక్టర్‌ రొనాల్డ్‌రోస్‌ ఆదేశించారు.  

బ్యాన్‌ పీరియడ్‌లో 96 మందికి ఉద్యోగాలు
గతంలో ఉన్న కావలికారులతో పాటు జిల్లాలోని ఖాళీల ఆధారంగా 2012లో 434 మందిని డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ కింద ప్రభుత్వం జిల్లాలో నియమించింది. 2014లో మరోసారి 90 మంది వీఆర్‌ఏలను నేరుగా నియమించారు. ఫిబ్రవరి 1994 నుండి నవంబర్‌ 2011 వరకు ప్రభుత్వం బ్యాన్‌ విధించింది. ఈ మధ్య కాలంలో ఎలాంటి నియామకాలు చేపట్టరాదని సూచించినా అప్పటి తహసీల్దార్లు పని ఒత్తిడిని సాకుగా చెబుతూ ఉమ్మడి జిల్లాలోని వివిధ మండలాల్లో 96 మంది వీఆర్‌ఏలను నియమించుకున్నారు. ఆ తర్వాత 2016లో అడ్‌హక్‌ ప్రమోషన్‌ పేరుతో 30 మందికి పదోన్నతులు కల్పించారు. దీంతో మిగతా వీఆర్‌ఏలు కూడా ఒత్తిడి తీసుకురాగా కలెక్టరేట్‌ అధికారులు సీసీఎల్‌ఏకు నివేదిక పంపారు. అలాగే, బ్యాన్‌ పీరియడ్‌లో నియమితులైన వీఆర్‌ఏలు కోర్టులకు సైతం వెళ్లారు.

కలెక్టర్‌ను కలసిన వీఆర్‌ఏలు
వీఆర్‌ఏ సంఘాల నాయకులు, పలువురు వీఆర్‌ఏలు బుధవారం జిల్లా కలెక్టర్‌ రొనాల్డ్‌రోస్‌ను కలిశారు. ఈ సందర్భంగా తమకు జరుగుతున్న అన్యాయాన్ని ఆయనకు వివరించగా ఎవరూ నష్టపోకుండా పదోన్నతులు కల్పిస్తామని కలెక్టర్‌ హామీ ఇచ్చినట్లు వారు వెల్లడిండారు.  

81 మంది వీఆర్‌ఏలకు పదోన్నతి
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పని చేస్తున్న 81 మంది వీఆర్‌ఏలకు వీఆర్వోలుగా పదోన్నతి లభించింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్‌ రొనాల్డ్‌రోస్‌ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. కలెక్టర్‌ చాంబర్‌లో పదోన్నతులు పొందిన వీఆర్‌ఏలకు ఉత్తర్వులు ఆయన అందజేసి విధులు సక్రమంగా నిర్వర్తిస్తూ మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ వెంకట్రావు, డీఆర్వో వెంకటేశ్వర్లు, ఏఓ ప్రేమ్‌రాజ్, ఆర్డీఓ లక్ష్మీనారాయణ, మెప్మా పీడీ గోపాల్, వీఆర్‌ఏ సంఘాల నాయకులు గోవిందు, గోవర్ధన్‌  తదితరులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top