దసరా వేడుకల్లోరగడ

Conflicts on Dussehra Festival Flag Hoisting in Medchal - Sakshi

జాతీయ జెండా ఎగరవేతపై ఘర్షణ

అడ్డుకున్న పోలీసులు

మేడ్చల్‌: పండగ రోజున పూడూర్‌ గ్రామంలో రగడ నెలకొంది. దసరా సందర్భంగా గ్రామంలో జాతీయ జెండా ఆవిష్కరించడం ఆనవాయితీ. 1950కి ముందు ముస్లింలు జెండా ఎగురవేయగా అనంతరం పోలీస్‌ పటేళ్లు ఎగురవేస్తున్నారు. దానికయ్యే ఖర్చు, పనులను గ్రామ పంచాయతీ చూసుకునేది. కాగా పటేల్, పట్వారీ వ్యవస్థ రద్దయినా వారు ఎగరవేయం ఎంటని.. గ్రామ సర్పంచ్‌ జెండా ఎగురవేయాలని గ్రామస్తులు డిమాండ్‌ చేశారు. దీనికి గ్రామంలోని పటేల్‌ వర్గం ఒప్పుకోలేదు. పోలీస్‌ పటేల్‌ కుటుంబికులే జెండా ఎగురవేస్తారని ఆ వర్గం భీష్మించడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీస్‌ పటేల్‌గా పిలువబడే వారే జెండా ఎగురవేయడం సంప్రదాయమని ఓ వర్గం, పటేల్, పట్వారీ వ్యవస్థను ప్రభుత్వం రద్దు చేసినా గ్రామంలో ఇంకా వారి పెత్తనమేంటని మరో వర్గం నినదించడంతో ఇరువర్గాల మధ్యా గొడవకు దారితీసింది. విషయం తెలుసుకున్న మేడ్చల్‌ సీఐ గంగాథర్‌ తన సిబ్బందితో సంఘటన స్థలికి చేరుకుని పెద్ద మనుషులను పిలిచి గ్రామంలోని సంప్రదాయం తెలుసుకుని వారి వివరణ తీసుకున్నారు.

గతంలో పోలీస్‌ పటేల్‌లే జెండా ఎగురవేసే వారని కొందరు తెలుపగా సర్పంచ్‌ పదవిలో ఎవరు ఉంటే వారు ఎగురవేస్తే మంచిదని కొందరు సీఐకి విన్నవించారు. ఇప్పటికిప్పుడు సంప్రదాయాలను మార్చలేమని ఈ సారి పండగను సంప్రదాయలను గౌరవిస్తూ జరుపుకోవాలని సీఐ సూచించగా అందుకు గ్రామస్తులు ససేమిరా అన్నారు. జెండాను సర్పంచ్‌ ఎగురవేస్తే తమకు అభ్యంతరం లేదని, లేకుంటే ఎగురవేసే పద్ధతిని తొలగించాలని పట్టుబట్టారు. ఈ సారి పాత పద్దతిలోనే పండుగ జరుపుకోని తర్వాత గ్రామ పెద్దలు మాట్లాడుకోవాలని సీఐ ఆదేశించి ఎవరైనా అడ్డుకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. దీంతో  పోలీస్‌ పటేల్‌ కుటుంబికులు పోలీస్‌ పహారాలో గ్రంథాలయం సమీపంలో జెండా ఎగురవేయగా గ్రామ సర్పంచ్‌ బాబుయాదవ్‌ గ్రామస్తులతో కలిసి గాంధీ విగ్రహం వద్ద మరో జెండా ఆవిష్కరించారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన ఇరువర్గాల ఆందోళనలు సాయంత్రం 5 గంటల వర కు సాగాయి.  భారీగా పోలీసులు మొహరించి ఇరు వర్గాలను శాంతింపజేశారు.

ఆ గ్రామంలోనే ఎందుకు?
పటేల్, పట్వారీ వ్యవస్థ రద్దయి దశాబ్ధాలు గడుస్తున్నా పూడూర్‌ గ్రామంలో ఇంకా ఈ సంప్రదాయం ఎందుకని గ్రామస్తులు అభిప్రాయపడుతున్నారు. మిగతా గ్రామాల్లో సర్పంచ్‌లు జెండా ఎగురవేస్తుండగా ఇక్కడ మాత్రం పటేళ్లు మాత్రమే ఎగురవేడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల పక్షాన నిలవాల్సిన సీఐ ప్రజాభిప్రాయాన్ని గౌరవించకుండా పటేళ్లకు వత్తాసు పలికారని సర్పంచ్, గ్రామస్తులు ఆరోపించారు. జెండా ఆవిష్కరణ వివాదంలో గ్రామం లో పండగ రోజు ఉద్రికత్త నెలకొంది.

నాకు పక్షపాతం లేదు: సీఐ
పూడూర్‌ ఘటనలో తాను ఎవరి పట్ల పక్షపాతంగా వ్యవహరించలేదని సీఐ గంగాధర్‌ పేర్కొన్నారు. గ్రామ సర్పంచ్‌ సంప్రదాయాన్ని గౌరవించకుండా ప్రజల మధ్య వర్గాల భేదాలు తీసుకవచ్చి గ్రామంలో పరిస్థితిలను ఉద్రిక్తం చేసే యత్నం చేశారన్నారు. తాము సంప్రదాయాన్ని గౌరవించి ఎప్పటి నుంచో వస్తున్న ఆచారాన్నిపాటించాలని సూచించామని, సర్పంచ్‌ జాతీయ జెండా ఎగురవేయాలనుకుంటే పండగకు పదిరోజుల ముందు గ్రామ సభ నిర్వహించి గ్రామ సభలో ప్రజలు సూచించిన విధంగా నడుచుకోవాలన్నారు. కానీ సర్పంచ్‌ వైషమ్యాలకు పండగ రోజు తెరతీశాడని తాము జోక్యం చేసుకుని గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితి నెలకోనకుండా చూశామన్నారు. సీనీయర్‌ సిటిజన్స్‌ సమావేశం నిర్వహించి వారి అభిప్రాయం అడగ్గా వారు పాత పద్ధతినే అనుసరించాలని సూచించారని తెలిపారు. గ్రామంలో ఉద్రిక్తతలు సృష్టించేందుకు చడానికి యత్నించిన సర్పంచ్‌తో పాటు మరికొందరిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top